త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tata Madhu | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మ‌ధు అరెస్ట్‌

Tata Madhu | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మ‌ధును (Tata Madhu) పోలీసులు అరెస్టు చేశారు. మంగ‌ళ‌వారం ఉద‌యం న్యూ ఎమ్మెల్యే క్వార్ట‌ర్స్‌లోని ఆయ‌న నివాసంలో అదుపులోకి తీసుకున్నారు.

G

Telangana | Published On Sep 8, 2026, 8.08 am IST

Tata Madhu | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మ‌ధు అరెస్ట్‌
Advertisement

Tata Madhu | త్రినేత్ర‌.న్యూస్‌: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మ‌ధును (Tata Madhu) పోలీసులు అరెస్టు చేశారు. మంగ‌ళ‌వారం ఉద‌యం న్యూ ఎమ్మెల్యే క్వార్ట‌ర్స్‌లోని ఆయ‌న నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. తాతా మ‌ధుతోపాటు మ‌రో ఎమ్మెల్సీ న‌వీన్ కుమార్ రెడ్డిని (Naveen Kumar Reddy) కోకాపేట‌లోని ఆయ‌న నివాసంలో అరెస్టు చేశారు.

అసెంబ్లీ స‌మావేశాల తొలిరోజు జ‌రిగిన ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌ను (Gaddam Prasad Kumar) కులం పేరుతో పాటు అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించార‌ని స్పీక‌ర్ ఓఎస్డీ పొల్లెప‌ల్లి వెంక‌టేశం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సీ, ఎస్టీ కేసు న‌మోదుచేసిన పోలీసులు తాతా మ‌ధును అరెస్టు చేసి సైఫాబాద్ పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

నా మాట‌లు వెన‌క్కి తీసుకుంటున్నా..

తాను అన‌ని మాట‌ల‌ను నాకు ఆపాదిస్తున్నార‌ని.. ఒక‌వేళ స్పీక‌ర్‌ను ఉద్దేశించి అన్న‌ట్లు భావిస్తే ఆ మాట‌ల‌ను వెన‌క్కి తీసుకుంటున్నాన‌ని ఎమ్మెల్సీ తాతా మ‌ధు అన్నారు. అందుకు విచారం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు చెప్పారు. స్పీక‌ర్ వ్య‌వ‌స్థ ప‌ట్ల‌, స్పీక‌ర్‌పై వ్య‌క్త‌గ‌తంగా త‌న‌కు ఎంతో గౌర‌వం ఉంద‌న్నారు. వారిని ఉద్దేశించి ఒక్క‌మాట కూడా అన‌లేద‌న్నారు. ఈమేర‌కు ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

నేను అన‌ని మాట‌ల‌ను నాకు ఆపాదిస్తున్నారు. ఈ విష‌యంపై వివ‌ర‌ణ ఇస్తున్నాను. స్పీక‌ర్ వ్య‌వ‌స్థ పట్ల‌, వ్య‌క్తిగ‌తంగా స్పీక‌ర్ పట్ల నాకు ఎంతో గౌర‌వం ఉంది. వారిని ఉద్దేశించి నేను ఒక్క మాట కూడా అన‌లేదు. నేను అన‌ని మాట‌ల‌ను నాకు ఆపాదించ‌డం స‌రైంది కాదు. ఒకవేళ నేను అన్న మాట‌ల్లో ఏదైనా స్పీక‌ర్‌ను ఉద్దేశించిన‌ట్లు భావిస్తే ఆ మాట‌ల‌ను నేను ఉప‌సంహ‌రించుకుంటున్నా. అందుకు విచారం వ్య‌క్తం చేస్తున్నా.

ఈరోజు మ‌హిళా ఎమ్మెల్యేల‌తో పాటు మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌పై దాడి జ‌రిగింది. నాపై కూడా దాడి చేసి నా ప్యాంటు ఊడ‌దీసేందుకు ప్ర‌య‌త్నించారు. నా గొంతు నొక్క‌డానికి య‌త్నించారు. చెప్ప‌డానికి వీలుకాని రీతిలో బండ‌బూతులు తిడుతూ నా డొక్క‌లో పిడిగుద్దులు గుద్దుతూ దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌తో తీవ్ర ఆవేద‌న‌కు గురయ్యాను. దాడి ఎవ‌రు చేశారు? నా ప్యాంటు లాగేందుకు ఎవ‌రు య‌త్నించారు? అలా చేయ‌మ‌ని ఎవ‌రు ఆదేశించారు? అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశాను. ఆ స‌మ‌యంలో కూడా నేను స్పీక‌ర్ గారిని అన‌లేదు.

శాంతియుతంగా స‌భ‌లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించిన మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌పై పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరు తీవ్రంగా ఖండించాల్సిన విష‌యం. మ‌గ పోలీసులు మ‌హిళా ఎమ్మెల్యేల చీర‌లు లాగ‌డం, జ‌ట్టు ప‌ట్టుకోవ‌డం, గొంతు నొక్క‌డం వంటి ఘ‌ట‌న‌లు స‌భ్య స‌మాజం సిగ్గుప‌డే విధంగా ఉన్నాయి. యాద‌వరెడ్డి, జ‌గ‌దీశ్ రెడ్డి, హ‌రీశ్ రావు, కేటీఆర్‌, డాక్ట‌ర్ సంజ‌య్ గార్ల‌పై పోలీసులు దాడి చేసి ఈడ్చుకెళ్లారు.

ఈ దాడికి బాధ్య‌త వ‌హిస్తూ హోంశాఖ మంత్రిగా, ముఖ్య‌మంత్రిగా రేవంత్‌రెడ్డి క్ష‌మాప‌ణ చెప్పాలి. దాడికి పాల్ప‌డిన పోలీసుల‌పై త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాలి. నా మాట‌ల‌ను వ‌క్రీక‌రించి అస‌లు ఘ‌ట‌న‌ను ప‌క్క‌దారి ప‌ట్టించ‌కుండా ప్ర‌భుత్వం బాధ్య‌త తీసుకొని చ‌ర్య‌లు తీసుకోవాలి అని తాతా మ‌ధు విజ్ఞ‌ప్తి చేశారు.

ఇవికూడా చ‌ద‌వండి..

అసెంబ్లీ వ‌ద్ద తోపులాట‌.. హ‌రీశ్ రావు, కేటీఆర్‌పై కేసు

రేవంత్ సవాల్‌ను కేసీఆర్ ఎందుకు లైట్‌ తీసుకుంటున్నారు? అసలు వ్యూహం ఇదీ!

 

Advertisement
Advertisement