త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | నా దేశానికి ఏమవుతోంది..? ఢిల్లీ ష‌ట్‌డౌన్‌పై సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసిన సీనియ‌ర్ న్యాయ‌వాదులు

Supreme Court | సీజేపీ నిర‌స‌న‌ల నేప‌థ్యంలో ఢిల్లీలో విధించిన ఆంక్ష‌ల‌ను సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వి, ప్రశాంత్ భూషణ్‌లు సుప్రీంకోర్టులో (Supreme Court) స‌వాల్ చేశారు. సీజేపీ నిర‌స‌న‌ల నేప‌థ్యంలో రాజ‌ధాని ఢిల్లీని కేంద్రం స్తంభింప‌జేస్తోంద‌ని మండిప‌డ్డారు.

D

National | Published On Oct 9, 2026, 1.51 pm IST

Supreme Court | నా దేశానికి ఏమవుతోంది..? ఢిల్లీ ష‌ట్‌డౌన్‌పై సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసిన సీనియ‌ర్ న్యాయ‌వాదులు
Advertisement

Supreme Court | త్రినేత్ర న్యూస్ : ప్ర‌ధాన‌ ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా అక్టోబర్ 10న ఢిల్లీలో కాక్రోచ్ జ‌న‌తాపార్టీ తలపెట్టిన నిరసనల (CJP Protests) నేపథ్యంలో ప్రభుత్వం విధించిన ఆంక్షలపై సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్ (Kapil Sibal ), అభిషేక్ మను సింఘ్వి (Abhishek Manu Singhvi), ప్రశాంత్ భూషణ్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రైళ్లు ర‌ద్దు, మెట్రో, ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను నిలిపివేయ‌డం వంటి అంశాల‌ను అత్యున్న‌త న్యాయ‌స్థానంలో స‌వాల్ చేస్తూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

సీజేపీ నిర‌స‌న‌ల నేప‌థ్యంలో రాజ‌ధాని ఢిల్లీని కేంద్రం స్తంభింప‌జేస్తోంద‌ని మండిప‌డ్డారు. "రైళ్లన్నీ రద్దయ్యాయి, మెట్రో స్టేషన్లు మూసివేశారు. ప్రజలకు హోటళ్లలో వసతి నిరాకరిస్తున్నారు. నిజాముద్దీన్‌ను మూసివేశారు. ప్రజలను ఇళ్ల నుండి బయటకు రావద్దని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల (RWA)కు చెబుతున్నట్లు సమాచారం. నా దేశానికి ఏమవుతోంది..? ఇది శాంతియుత నిరసన. ఇలా జరగడానికి ఎలా అనుమతిస్తారు..?" అంటూ కపిల్ సిబాల్ ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉందని గుర్తు చేశారు. కానీ, ప్ర‌భుత్వం తీసుకుంటున్న ఇటువంటి కఠిన చర్యలు గ‌తంలో దేశంలో ఎన్నడూ చూడలేదన్నారు. జూలైలో జరిగిన సీజేపీ (CJP) నిరసనకు సంబంధించిన ఇతర విషయాలతో పాటు, ఈ పిటిషన్‌ను కూడా ఇవాళే విచారించాలని ఆయన కోరారు.

ఇది కూడా చ‌ద‌వండి.. సీజేపీ నిర‌స‌న‌ల‌తో ఢిల్లీలో హై అల‌ర్ట్‌.. రైళ్లు ర‌ద్దు, మెట్రో స్టేష‌న్లు మూసివేత‌..!

స్పందించిన‌ జస్టిస్ జాయ్‌మాల్య‌ బాగ్చీ ధర్మాసనం.. ప్రజలకు నిరసన తెలిపే హక్కు ప్రాథమిక హక్కు అని స్ప‌ష్టం చేసింది. అయితే, అది నిబంధనలకు లోబడి ఉండాలని పేర్కొంది. నిర్వాహ‌కులు నిర‌స‌న‌కు అవ‌స‌ర‌మైన అనుమ‌తులు తీసుకున్నారా..? లేదా..? అనేది ప‌రిశీలించాల్సి ఉంటుంద‌న్నారు. అనుమతి లేకపోతే ఆ నిరసన చట్టవిరుద్ధమవుతుందని ఆయన పేర్కొన్నారు. నిరసనలకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారా లేదా అనే వివరాల‌తో మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు తిరిగి హాజ‌రుకావాల‌ని పిటిష‌న‌ర్ల‌ను సుప్రీం ధ‌ర్మాస‌నం ఆదేశించింది.

Also Read..

కాన్షీరామ్‌కు భారతరత్న ఇవ్వాల్సిందే

ఎలాన్ మ‌స్క్ ట్వీట్‌తో మోదీపై ఉన్న ఆరోప‌ణ‌లు అబద్ద‌మ‌ని రుజువైంది: రాంచంద‌ర్‌రావు

ఆర్కుట్ మళ్లీ వస్తుందా..? వ్యవస్థాపకుడి కీలక ప్రకటన..

Advertisement
Advertisement