Orkut | ఆర్కుట్ మళ్లీ వస్తుందా..? వ్యవస్థాపకుడి కీలక ప్రకటన..
Orkut | అప్పట్లో.. అంటే 2000వ సంవత్సరంలో యువతను విశేషంగా ఆకట్టుకున్న ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ వేదిక ఆర్కుట్ మళ్లీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్కుట్ వ్యవస్థాపకుడు ఆర్కుట్ బుయుక్కోక్తెన్ ఈ వేదికను పునరుద్ధరించేందుకు ఇంటర్నెట్ వినియోగదారుల మద్దతు కోరారు. స్నేహం, సమాజం, నిజమైన మానవ సంబంధాలకు ప్రాధాన్యం ఇచ్చే కొత్త రూపంలో ఆర్కుట్‌ను తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు.
Technology | Published On Oct 9, 2026, 1.17 pm IST
Orkut | అప్పట్లో.. అంటే 2000వ సంవత్సరంలో యువతను విశేషంగా ఆకట్టుకున్న ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ వేదిక ఆర్కుట్ మళ్లీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్కుట్ వ్యవస్థాపకుడు ఆర్కుట్ బుయుక్కోక్తెన్ ఈ వేదికను పునరుద్ధరించేందుకు ఇంటర్నెట్ వినియోగదారుల మద్దతు కోరారు. స్నేహం, సమాజం, నిజమైన మానవ సంబంధాలకు ప్రాధాన్యం ఇచ్చే కొత్త రూపంలో ఆర్కుట్‌ను తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు. ఎక్స్‌లో చేసిన పోస్టులో బుయుక్కోక్తెన్ వినియోగదారులను తన ప్రయత్నానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఆర్కుట్ అధికారిక వెబ్‌సైట్‌లో తమ పేరును నమోదు చేసి, మద్దతుదారుల కార్డును తమతో కలిసి ఆర్కుట్‌కు రావాలని కోరుకునే స్నేహితులతో పంచుకోవాలని సూచించారు.
లేఖ విడుదల చేసిన ఫౌండర్..
ఆర్కుట్ అధికారిక వెబ్‌సైట్‌లో బుయుక్కోక్తెన్ ఒక బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు. గత రెండు దశాబ్దాల్లో సోషల్ మీడియా ఎలా మారిపోయిందో ఆయన అందులో వివరించారు. వినియోగదారుల మధ్య అర్థవంతమైన సంబంధాల కంటే వారి దృష్టిని ఎక్కువసేపు ఆకర్షించడానికే సోషల్ మీడియా వేదికలు ప్రాధాన్యం ఇస్తున్నాయని ఆయన విమర్శించారు. అయితే ఆర్కుట్ పునఃప్రారంభానికి సంబంధించి ఎలాంటి తేదీని ఆయన ఇంకా ప్రకటించలేదు. రెండు దశాబ్దాల క్రితం తాను తొలినాటి సోషల్ నెట్‌వర్క్‌లలో కొన్నింటిని రూపొందించానని, సోషల్ మీడియా ఎలా తప్పుదారి పట్టిందో మీతో కలిసి చూస్తూ వచ్చానని బుయుక్కోక్తెన్ తన లేఖలో పేర్కొన్నారు. ఇంటర్నెట్ తొలినాళ్లను గుర్తుచేసుకున్న బుయుక్కోక్తెన్.. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులతో పరిచయం కావడం అప్పట్లో ఎంతో ఆసక్తికరంగా, ఉత్సాహంగా ఉండేదని చెప్పారు. మరో ఖండంలో ఉన్న అపరిచిత వ్యక్తి నుంచి సందేశం రావడం కూడా ఒక అద్భుతమైన అనుభూతిని కలిగించేదని పేర్కొన్నారు.
సోషల్ మీడియాకు యువత బానిసలుగా..
అయితే కాలక్రమేణా సోషల్ మీడియా వేదికలు నిజమైన సంబంధాల కంటే వినియోగదారుల దృష్టిని ఆకర్షించేలా తమ ఫీడ్‌లను రూపొందించాయని ఆయన అన్నారు. గత 20 ఏళ్లుగా వినియోగదారుల దృష్టిని ఎలా ఎక్కువసేపు తమవైపు ఉంచాలనే దానిపైనే దృష్టి పెట్టారని, సంబంధాల కంటే ఎంగేజ్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. అల్గారిథమ్‌ల కారణంగా ఒక తరం యువత సోషల్ మీడియాకు బానిసలై, విభజనకు గురై, ప్రకటనల కోసం వినియోగించబడిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతున్న ప్రభావంపైనా బుయుక్కోక్తెన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ ప్రపంచంలో నిజమైన వ్యక్తితోనే మనం మాట్లాడుతున్నామనే ప్రాథమిక భావనను ఏఐ దెబ్బతీస్తోందని ఆయన అన్నారు. సోషల్ నెట్‌వర్కింగ్ ప్రత్యేకతకు, దాని నిర్మాణానికి ప్రధాన కారణమైన మానవ సంబంధాల స్థానాన్ని కృత్రిమ మేధస్సు ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు.
మద్దతు తెలపాలని విజ్ఞప్తి..
ఆర్కుట్‌ను పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా అధికారిక వెబ్‌సైట్‌లో మద్దతు తెలిపేందుకు పేర్లు నమోదు చేసుకోవాలని బుయుక్కోక్తెన్ వినియోగదారులను కోరారు. నిజమైన వ్యక్తులు, అసలైన సంబంధాలు, తమకు చెందిన సమాజం అనే భావనకు ప్రాధాన్యం ఇచ్చే కొత్త సోషల్ నెట్‌వర్క్‌ను ఆర్కుట్ రూపొందించాలని కోరుతున్నట్లు పేరు నమోదు చేయడం ద్వారా తెలియజేయవచ్చని వెబ్‌సైట్ పేర్కొంది. కాగా ఇప్పటికే 2.55 లక్షలకు పైగా మంది ఆర్కుట్ పునరుద్ధరణకు మద్దతుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మరింత మంది స్నేహితులను ఈ ఉద్యమంలో భాగస్వాములను చేయాలని, తమ మద్దతుదారుల కార్డులను వారితో పంచుకోవాలని బుయుక్కోక్తెన్ కోరారు. సాంకేతికత ఆధిపత్యం పెరుగుతున్న ప్రపంచంలో నిజమైన మానవ సంబంధాల ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ ఆయన తన లేఖను ముగించారు. అల్గారిథమ్ జీవితం విలువైనదిగా మార్చలేదని, కానీ ఒక స్నేహితుడు, ఒక సమాజం ఆ పని చేయగలవని ఆయన పేర్కొన్నారు. వినియోగదారుల దృష్టిని ఆకర్షించడంపై కాకుండా ఒకరినొకరు కలుపుకోవడంపై దృష్టి పెట్టి ఇంటర్నెట్‌ను మళ్లీ మానవీయంగా మార్చాలని పిలుపునిచ్చారు.
12 ఏళ్ల తరువాత ఇప్పుడు రీ ఎంట్రీ..?
ఆర్కుట్‌ను గూగుల్ ఇంజినీర్ ఆర్కుట్ బుయుక్కోక్తెన్ రూపొందించారు. గూగుల్ యాజమాన్యంలో నిర్వహించిన ఈ సోషల్ నెట్‌వర్కింగ్ సేవ 2004 జనవరిలో ప్రారంభమైంది. భారత్, బ్రెజిల్ వంటి దేశాల్లో ఆర్కుట్‌కు భారీగా ఆదరణ లభించింది. ప్రొఫైళ్లు, కమ్యూనిటీలు, టెస్టిమోనియల్స్, స్నేహితుల నెట్‌వర్క్‌ల ద్వారా వినియోగదారులు ఒకరితో ఒకరు అనుసంధానమయ్యేవారు. అయితే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ఇతర సోషల్ మీడియా వేదికలు వేగంగా ప్రజాదరణ పొందడంతో ఆర్కుట్ వినియోగం తగ్గింది. దీంతో గూగుల్ 2014 సెప్టెంబర్‌లో ఆర్కుట్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. ఇప్పుడు వ్యవస్థాపకుడి తాజా ప్రయత్నంతో దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆర్కుట్ మళ్లీ కొత్త రూపంలో తిరిగి వస్తుందా అనే ఆసక్తి నెలకొంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి

KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!






