త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

V Srinivas Goud | ఓబీసీ కుల గ‌ణ‌నకు అన్ని రాష్ట్రాల‌ అసెంబ్లీలలో తీర్మానాలు చేయాలి

V Srinivas Goud | ఓబీసీ కుల గ‌ణ‌న (OBC Caste Census)కు అన్ని రాష్ట్రాల‌ అసెంబ్లీలలో తీర్మానాలు చేయాలని.. ప్ర‌తి కులానికి ప్ర‌త్యేక కోడ్‌ (Special Code), డ్రాప్‌డౌన్ జాబితాను రూపొందించాల‌ని మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ (V Srinivas Goud) అన్నారు.

S

Telangana | Published On Nov 28, 2026, 7.33 pm IST

V Srinivas Goud | ఓబీసీ కుల గ‌ణ‌నకు అన్ని రాష్ట్రాల‌ అసెంబ్లీలలో తీర్మానాలు చేయాలి
Advertisement
  • ప్రతి కులానికి ప్రత్యేక కోడ్, డ్రాప్‌డౌన్ జాబితాను రూపొందించాలి
  • అలా చేస్తే అదనంగా ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం ఉండ‌దు
  • పారదర్శక కులగణనతోనే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం
  • ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, ప్రత్యేక నిధులు కేటాయించాలి
  • న్యూఢిల్లీ ఓబీసీ మహాసభలో మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్

V Srinivas Goud | త్రినేత్ర న్యూస్‌: ఓబీసీ కుల గ‌ణ‌న (OBC Caste Census)కు అన్ని రాష్ట్రాల‌ అసెంబ్లీలలో తీర్మానాలు చేయాలని.. ప్ర‌తి కులానికి ప్ర‌త్యేక కోడ్‌ (Special Code), డ్రాప్‌డౌన్ జాబితాను రూపొందించాల‌ని మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ (V Srinivas Goud) అన్నారు. ఇలా చేస్తే అద‌నంగా ఒక్క రూపాయీ ఖ‌ర్చు చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. పార‌ద‌ర్శ‌క కుల గ‌ణ‌న‌తోనే జ‌నాభా ప్రాతిప‌దిక‌న రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని చెప్పారు. సరైన కుల గణన లెక్క‌లు లేకపోవడంతో కొన్ని రాష్ట్రాలు కల్పించిన రిజర్వేషన్లను న్యాయస్థానాలు రద్దు చేసిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. న్యూఢిల్లీ (New Delhi)లోని రామ్‌లీలా మైదానంలో ఆల్ ఇండియా ఓబీసీ కులగణన కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓబీసీ మహాసభలో శ‌నివారం ఆయ‌న పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో ప్రత్యేక ఓబీసీ మంత్రిత్వ శాఖ (Separate OBC Ministry)ను ఏర్పాటు చేసి, ఓబీసీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు.

రూ.11,700 కోట్లు ఖర్చు చేస్తోంది

బ్రిటిష్ పాలనలోనే దేశంలో కులగణన జరిగిందని, గత ఆరు దశాబ్దాలుగా పాలించిన ప్రభుత్వాలు ఓబీసీ కులగణనను నిర్లక్ష్యం చేశాయ‌న్నారు. ప్రస్తుతం జనగణన కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.11,700 కోట్లు ఖర్చు చేస్తోందని, అదే జనగణనలో ఓబీసీల కోసం ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేసి, ప్రతి కులానికి ప్రత్యేక కోడ్, డ్రాప్‌డౌన్ జాబితాను రూపొందిస్తే అదనంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదన్నారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఓబీసీ కులగణన చేపట్టేందుకు ఆయా రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శాస్త్రీయమైన, పారదర్శకమైన కులగణన ద్వారానే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమవుతుందని అన్నారు. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్లమెంట్‌లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సైతం ఓబీసీ కులగణన చేపట్టాలని మాట్లాడార‌న్నారు.

కేంద్ర ప్రభుత్వం వెంటనే జనగణనలో ఓబీసీ కులగణనను చేర్చి, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా ఓబీసీ కులగణన చేయాలన్నారు. కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఓబీసీలను ఉపయోగించుకుంటున్నారని, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేయడంతో పాటు వారికి తగిన గౌరవం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.

చట్టసభల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేయాలన్నారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించినప్పుడే సమాజంలో వారికి నిజమైన గుర్తింపు, గౌరవం లభిస్తాయని అన్నారు. ఓబీసీ కులగణనకు మద్దతు తెలిపే రాజకీయ పార్టీల వెంటే దేశవ్యాప్తంగా ఓబీసీలు నిలుస్తారని, ఈ డిమాండ్‌కు మద్దతు ఇవ్వని పార్టీలకు రాబోయే ఎన్నికల్లో బీసీలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

కులగణన ద్వారా మాత్రమే లెక్కలు వెలుగులోకి వస్తాయని, ఆ గణాంకాల ఆధారంగా విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించినప్పుడే సామాజిక అసమానతలు తొలగి సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ఎంపీ విల్సన్, ప్రొఫెసర్ సూరజ్ మండల్, AIOBCA అధ్యక్షులు కిరణ్ కుమార్, రత్న సభాపతి, యోగేంద్ర సింగ్ యాదవ్, బాలరాజ్, ధర్మేందర్ కుష్వా, విజయ్ వడేకర్, అనిల్ జైన్, రాజేంద్ర గౌతమ్ పాల్, రంగయ్య, నవీన్, ఉమేష్ కొర్ర, నవీన్ ఆచార్య, రామచంద్ర యాదవ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement