త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGSRTC MahaLakshmi Scheme | దూసుకెళ్తున్న ‘మహాలక్ష్మి’: 3 నెలల్లోనే 35.65 కోట్ల మహిళల ప్రయాణం

తెలంగాణలో మహాలక్ష్మి పథకానికి ఆడబిడ్డల బ్రహ్మరథం! గత 3 నెలల్లో అదనంగా 97.20 లక్షల మంది మహిళల ప్రయాణం.. రద్దీ రూట్లలో పెరిగిన బస్సులు, వివరాలివే.

J

Telangana | Published On Oct 5, 2026, 6.45 pm IST

TGSRTC MahaLakshmi Scheme | దూసుకెళ్తున్న ‘మహాలక్ష్మి’: 3 నెలల్లోనే 35.65 కోట్ల మహిళల ప్రయాణం

సంక్షిప్త సారాంశం

2026 జూలై నుంచి సెప్టెంబర్ వరకు మహాలక్ష్మి పథకంలో ఏకంగా 35.65 కోట్ల (3,565.11 లక్షలు) ప్రయాణాలు నమోదు. 2025 ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది మూడు నెలల్లో అదనంగా 97.20 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. రద్దీకి తగ్గట్లుగా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం తదితర ఇంటర్‌ డిస్ట్రిక్ట్ మార్గాల్లో ట్రిప్పులను పెంచిన ఆర్టీసీ. రాబోయే పండుగల సీజన్ దృష్ట్యా మరింత మందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు వెల్లడించిన వీసీ, ఎండీ వై.నాగిరెడ్డి.

Advertisement
  • కొత్త రూట్లలో బస్సులు, ట్రిప్పుల పెంపు

TGSRTC MahaLakshmi Scheme | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న "మహాలక్ష్మి" ఉచిత బస్సు ప్రయాణ పథకానికి మహిళల నుంచి ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రికార్డు స్థాయిలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ మూడు నెలల కాలంలోనే అదనంగా దాదాపు కోటి మంది మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకోవడం విశేషం.

ఇదీ చదవండి | మౌలిక వ‌స‌తుల ప్రాజెక్టులకు సహ‌క‌రించండి

నెలకు సగటున 11 కోట్లకు పైగా ప్రయాణాలు

ఆర్టీసీ విడుదల చేసిన అధికారిక కంపారిజన్ రిపోర్ట్ ప్రకారం

జూలై: 2025లో 1,159.65 లక్షల మంది (11.59 కోట్లు) ప్రయాణించగా, 2026 జూలై నాటికి ఈ సంఖ్య 1,185.10 లక్షలకు (11.85 కోట్లు) చేరింది (+25.44 లక్షల పెరుగుదల).

ఆగస్టు: 2025లో 1,175.32 లక్షలు (11.75 కోట్లు) ఉండగా, 2026 ఆగస్టులో 1,223.59 లక్షల (12.23 కోట్లు) ప్రయాణాలు నమోదయ్యాయి (+48.27 లక్షల పెరుగుదల).

Also Read | సీఎం రేవంత్‌ అవినీతిపై రాష్ట్రపతి తక్షణమే జోక్యం చేసుకోవాలి

సెప్టెంబర్: 2025లో 1,132.94 లక్షల మంది (11.32 కోట్లు) కాగా, 2026 సెప్టెంబర్‌లో 1,156.43 లక్షల మంది (11.56 కోట్లు) మహిళలు ప్రయాణించారు (+23.49 లక్షల పెరుగుదల).

మొత్తంగా చూస్తే, 2025 త్రైమాసికంలో 34.67 కోట్ల (3,467.91 లక్షలు) ప్రయాణాలు నమోదు కాగా, 2026 నాటికి అది ఏకంగా 35.65 కోట్లకు (3,565.11 లక్షలు) ఎగబాకింది. అంటే ఒక్క త్రైమాసికంలోనే 97.20 లక్షల అదనపు ప్రయాణాలు నమోదయ్యాయి.

రద్దీ మార్గాల్లో అదనపు బస్సులు, ట్రిప్పులు

మహిళా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న కీలక ప్రాంతాల్లో టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేకంగా ట్రిప్పుల సంఖ్యను పెంచింది. ముఖ్యంగా అంతర్ జిల్లా, రాజధాని కనెక్టివిటీ రూట్లపై ప్రత్యేక దృష్టి సారించింది.

హైదరాబాద్, రాజధాని కనెక్టివిటీ: సిద్దిపేట - జేబీఎస్ (JBS), నాగర్‌కర్నూలు - హైదరాబాద్, కోస్గి - హైదరాబాద్ రూట్లలో అదనపు బస్సులు.

ఉత్తర తెలంగాణ, కరీంనగర్ రీజియన్: హుస్నాబాద్ - కరీంనగర్, కరీంనగర్ - గోదావరిఖని / మందమర్రి, హన్మకొండ - కరీంనగర్.

Also Read | నకిలీ సర్టిఫికెట్లతో కొలువులు: 35 మంది జూనియర్ లెక్చరర్లపై వేటు

వరంగల్, నల్గొండ మార్గాలు: సంగారెడ్డి - హన్మకొండ, హన్మకొండ - తొర్రూరు, నల్గొండ - దేవరకొండ, నల్గొండ - సూర్యాపేట, దేవరకొండ - మిర్యాలగూడ, అచ్చంపేట - దేవరకొండ.

ఖమ్మం, కొత్తగూడెం ఏరియా: ఖమ్మం - ఇల్లందు, ఇల్లందు - కొత్తగూడెం, ఖమ్మం - మధిర, సూర్యాపేట - ఖమ్మం.

నిజామాబాద్, ఆదిలాబాద్: బాన్సువాడ - నిజామాబాద్, బోధన్ - నిజామాబాద్, కామారెడ్డి - రామాయంపేటలతో పాటు దక్షిణ తెలంగాణలోని కల్వకుర్తి - మహబూబ్‌నగర్ మార్గాల్లోనూ ట్రిప్పులు పెరిగాయి.

పండుగల వేళ మరిన్ని ప్రత్యేక సర్వీసులు: ఎండీ వై. నాగిరెడ్డి

మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుంచి మహిళల నుంచి నిరంతర ఆదరణ లభిస్తోందని టీజీఎస్ ఆర్టీసీ వైస్-ఛైర్మన్ అండ్ ఎండీ వై. నాగిరెడ్డి తెలిపారు. క్షేత్రస్థాయిలో డిపో మేనేజర్లు ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన అదనపు బస్సులను రోడ్లపైకి తెస్తున్నారని చెప్పారు. రానున్న పండుగల సీజన్‌లో మహిళా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మరిన్ని ప్రత్యేక సర్వీసులు నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.

Also Read | సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,10,250ల బోనస్: కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి

Advertisement
Advertisement