త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KP Vivekananda | సీఎం రేవంత్‌ అవినీతిపై రాష్ట్రపతి తక్షణమే జోక్యం చేసుకోవాలి

KP Vivekananda | సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అవినీతిపై రాష్ట్ర‌ప‌తి త‌క్ష‌ణ‌మే జోక్యం చేసుకొని బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ఎల్పీ విప్ కె.పి. వివేకానంద విజ్ఞ‌ప్తి చేశారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) రాజ్యాంగం బుక్కు ప‌ట్టుకొనొచ్చి స‌మాధానం చెప్పాల‌న్నారు.

S

Telangana | Published On Oct 5, 2026, 5.30 pm IST

KP Vivekananda | సీఎం రేవంత్‌ అవినీతిపై రాష్ట్రపతి తక్షణమే జోక్యం చేసుకోవాలి
Advertisement
  • ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలి
  • రాహుల్ గాంధీ రాజ్యాంగం బుక్కు పట్టుకుని తెలంగాణకొచ్చి స‌మాధానం చెప్పాలి
  • రేవంత్ అవినీతి చిట్టా రాస్తుంటే చేతులే నొస్తున్న‌య్‌
  • ఆయ‌న 24 గంట‌ల్లో స‌మాధానం చెప్పాలి.. లేదంటే ప్ర‌త్య‌క్ష పోరాట‌మే ఇక‌
  • కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ఎల్పీ విప్ కె.పి. వివేకానంద ఫైర్‌

KP Vivekananda | త్రినేత్ర న్యూస్: సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అవినీతిపై రాష్ట్ర‌ప‌తి త‌క్ష‌ణ‌మే జోక్యం చేసుకొని బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ఎల్పీ విప్ కె.పి. వివేకానంద విజ్ఞ‌ప్తి చేశారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) రాజ్యాంగం బుక్కు ప‌ట్టుకొనొచ్చి స‌మాధానం చెప్పాల‌న్నారు. రేవంత్ అవినీతి చిట్టా రాస్తుంటే చేతులే నొస్తున్నాయ‌ని వ్యాఖ్యానించారు. ఆయ‌న 24 గంట‌ల్లో స‌మాధానం చెప్ప‌కుంటే బీఆర్ఎస్ ప్ర‌త్య‌క్ష పోరాటానికి దిగుతుంద‌ని హెచ్చ‌రించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో సోమ‌వారం వివేకానంద మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌పై నిప్పులు చెరిగారు. రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి (Thirupathi Reddy).. రెస్టారెంట్ యాజమానులను బెదిరించి ఆస్తులను సొంతం చేసుకుంటున్నాడని ఆరోపించారు.

రెండున్నర సంవత్సరాల్లోనే సీఎంగా రేవంత్ చేసిన అవినీతి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. సీఎంగా మూడో సంవత్సరం పూర్తి చేసుకుంటున్న రేవంత్ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామనుకుంటున్నారు. మళ్ళీ సీఎం అయ్యేది లేదని.. పదవిలో ఉన్నపుడే దండుకోవాలన్నది ఆయ‌న‌ సిద్ధాంతం. అన్నదమ్ములు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తూ అంతులేని సంపాదన కొల్ల‌గొడుతున్నారు. రెండేళ్ల క్రితం నష్టాల్లో ఉన్న మెడికోవర్ ఆస్పత్రి 13200 కోట్ల రూపాయల లాభం ఎట్లా ఆర్జించింది? సీఎం చిల్లర సభలు పెట్టుకోవడం కాదు.. తన మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిందే.

బీఆర్ఎస్ రేవంత్ అవినీతి, అక్రమాలను వదిలిపెట్టదు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగిన చందంగా రేవంత్ తన అవినీతిని ఎవరూ చూడటం లేదనుకుంటున్నారు. అన్నీ నోట్ చేస్తున్నాం. తప్పు చేసిన పిల్లి అడ్డంగా దొరికిపోయింది. సీఎం ఆయన కుటుంబ సభ్యుల విచ్చలవిడి సంపాదన అధికార దుర్వినియోగం కిందకే వస్తుంది. సీఎం కొరియా వెళ్లొచ్చి త‌న‌ భార్య పేరు మీద ఐదు హ్యుందాయ్ కార్ల షో రూమ్ లు పెట్టుకున్నారు. కొరియా వెళ్ళింది మూసీ ప్రక్షాళన కోసం కాదు.. సొంత ఆస్తులను పెంచుకోవడం కోసం అని ఇప్పుడు తెలిసింది.

కుటుంబం చేత, కుటుంబం యొక్క, కుటుంబం కోసం..

ఇంటర్నేషనల్ స్కూళ్ళు పెట్టడానికి రేవంత్ బిడ్డకు అన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడ్నుంచి వచ్చాయి? మా ప్రతినిధి క్రిశాంక్ అన్ని ఆధారాలతోనే మాట్లాడారు. భాద్యత గల బీఆర్ఎస్ఎల్పీ విప్ గా అడుగుతున్నా.. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే సమాధానం చెప్పాలి. రేవంత్ కుంభకోణాల చిట్టాతో బుక్కులకు బుక్కులు నిండిపోతున్నాయి. కుటుంబం చేత, కుటుంబం యొక్క, కుటుంబం కోసం అన్నట్టు రేవంత్ పాలన నడుస్తోంది. సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి రాజ్యాంగేతర శక్తిలా మారి కొడంగల్ లో అధికారులను శాసిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారు.

రాజ్యాంగాన్ని పాలిస్తున్నరు

పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌ను రేవంత్ తోలు బొమ్మలా ఆడిస్తున్నాడు. హైకమాండ్ నుంచి హైదరాబాద్ దాకా కాంగ్రెస్ పార్టీని రేవంత్ డమ్మీ చేశారు. మేం ప్రశ్నిస్తుంటే కేసులు పెడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ కు సీఎం అనుకుంటున్నారు. రేవంత్ రాజ్యాంగం ప్రకారం చేసిన పదవీ ప్రమాణాన్ని ఉల్లంఘిస్తున్నారు. పక్షపాత వైఖరితో పాలించనని ప్రమాణం చేసి పూర్తి పక్షపాతంతో పాలన చేస్తున్నారు. రాగ ద్వేషాలు లేని పాలన చేస్తానని ప్రమాణం చేసి రేవంత్ యథేచ్ఛగా రాజ్యాంగాన్ని పాలిస్తున్నారు. రేవంత్ కు రాగాలు పెరిగాయి, ద్వేషాలు పెరిగాయి.

రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి రెస్టారెంట్ యాజమానులను బెదిరించి ఆస్తులను సొంతం చేసుకుంటున్నాడు. తమ్ముడి షెల్ కంపెనీకి 200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఏడు కోట్ల రూపాయలకే ఎలా కేటాయిస్తారు? మరో తమ్ముడి స్వచ్ బయో కంపెనీకి వెయ్యి కోట్ల ప్రభుత్వ ధనాన్ని రేవంత్ దోచి పెట్టారు. బీఆర్ఎస్ లేవనెత్తిన అవినీతి ఆరోపణలపై రేవంత్ రెడ్డి 24 గంటల్లో సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకపోతే బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటానికి దిగుతుంది.

ఎవని పాలయ్యేరో తెలంగాణ

ఎవని పాలయ్యేరో తెలంగాణ అనే పాటకు సరైన అర్థం వచ్చేలా రేవంత్ పాలిస్తున్నారు. రేవంత్ రూపంలో శనిని నెత్తిన పెట్టుకున్నామని అన్ని వర్గాల ప్రజలు అనుకుంటున్నారు. రేవంత్ కుటుంబ సభ్యులు పుట్ట గొడుగుల్లా కంపెనీలు తెరచి ప్రభుత్వ సొమ్ము కొల్లగొడుతున్నారు. రేవంత్ ను సీఎం పదవి నుంచి బర్తరఫ్ అయినా చేయాలి.. లేదంటే కాంగ్రెస్ హైకమాండ్ ఆయన్ను పదవి నుంచైనా తప్పించాలి అని వివేకానంద డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement