త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Komatireddy Venkat Reddy | మౌలిక వ‌స‌తుల ప్రాజెక్టులకు సహ‌క‌రించండి

Komatireddy Venkat Reddy | తెలంగాణ కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాల‌ని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. ఎల్‌బీనగర్‌-హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ వెంటనే మంజూరు చేయాలన్నారు.

S

National | Published On Oct 5, 2026, 6.03 pm IST

Komatireddy Venkat Reddy | మౌలిక వ‌స‌తుల ప్రాజెక్టులకు సహ‌క‌రించండి
Advertisement
  • ఎల్‌బీనగర్‌-హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ వెంటనే మంజూరు చేయండి
  • పర్వతమాల కింద 5 రోప్‌వేలు, CRIF కింద 33 పనులు, 3 ROB/RUBలకు మంజూరు కోరిన మంత్రి
  • హైదరాబాద్‌-శ్రీశైలం NH-765పై ఎలివేటెడ్‌ కారిడార్‌కు ప్రత్యేక విజ్ఞప్తి
  • NH-65 6+2 లేన్ల విస్తరణ, RRR ఉత్తర-దక్షిణ భాగాలు, హైదరాబాద్‌-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వేపై చర్చ
  • చింతన్ శివిర్‌లో నితిన్‌ గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ప్రత్యేక భేటీ

Komatireddy Venkat Reddy | త్రినేత్ర న్యూస్: తెలంగాణ కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాల‌ని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. ఎల్‌బీనగర్‌-హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ వెంటనే మంజూరు చేయాలన్నారు. హైద‌రాబాద్‌-శ్రీ‌శైలం జాతీయ ర‌హ‌దారిపై ఎలివేటెడ్ కారిడార్‌కు స‌హ‌క‌రించాల‌న్నారు. గుజరాత్‌ రాష్ట్రం నర్మద జిల్లాలోని ఎక్తానగర్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాంగణంలో జరుగుతున్న చింతన్‌ శివిర్‌-2026 రెండు రోజుల కార్యక్రమాన్ని సోమవారం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nithin Gadkari)తో కలిసి ఆయ‌న‌ జ్యోతి ప్రజ్వలన చేసి అట్టహాసంగా ప్రారంభించారు.

మొదటి రోజు సమావేశంలో పలు రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టుల్లో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం వంటి వివిధ అంశాలపై జరిగిన చర్చ అనంతరం.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి కోమటి రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు, నిధుల మంజూరీలు, జాతీయ రహదారుల అభివృద్ధి అంశాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్ ఇన్ఫ్రా పై ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి వివరించారు.

తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి, సేతు బంధన్, CRIF పనులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడంతో పాటు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడం, రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం, ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేసేలా పలు కీలక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సహకారం అందించాలని నితిన్‌ గడ్కరీని కోరారు.

డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌

హైదరాబాద్‌ తూర్పు ప్రాంతంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపేందుకు ఎల్‌బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు సుమారు 6 కి.మీ. మేర డబుల్‌ డెక్కర్‌ విధానంలో ఎలివేటెడ్‌ కారిడార్‌ను నిర్మించాలని మంత్రి కోరారు. ఇప్పటికే ఎన్‌హెచ్‌-65లో ఎల్‌బీనగర్‌-మల్కాపూర్‌ సెక్షన్‌ను సర్వీస్‌ రోడ్లతో సహా ఆరు (6+2) లేన్లుగా అభివృద్ధి చేసేందుకు రూ.545 కోట్లతో కేంద్రం అనుమతులు ఇచ్చిందని తెలిపారు. ఎక్కువగా నిర్మాణాలు ఉన్న ప్రాంతాల్లో ఆర్‌ఈ వాల్‌కు బదులుగా వయాడక్ట్‌ విధానంలో నిర్మాణం చేపట్టాలని ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని వివరించారు.

మియాపూర్‌-ఎల్‌బీనగర్‌ మెట్రో రైలు కారిడార్‌ను రెండో దశలో హయత్‌నగర్‌ వరకు పొడిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, మెట్రోతో సమన్వయం ఉండేలా డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌కు 2026-27 వార్షిక ప్రణాళికలో చోటు కల్పించి మంజూరు చేయాలని కోరారు.

పర్వతమాల కింద 5 రోప్‌వేలు

తెలంగాణలో పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ కల్పించేందుకు పర్వతమాల పథకం కింద రూ.1,230 కోట్ల అంచనా వ్యయంతో ఐదు రోప్‌వే ప్రాజెక్టులకు మంజూరు ఇవ్వాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, నల్గొండ హనుమాన్‌ హిల్‌, నాగార్జునసాగర్‌-నాగార్జునకొండ, పెద్దపల్లి జిల్లా మంథని రామగిరి కోట, నిజామాబాద్‌ కిల్లా రామాలయం ప్రాంతాల్లో ఈ రోప్‌వేలను ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇవి భక్తులు, పర్యాటకులు, స్థానిక ప్రయాణికులకు సౌకర్యం కల్పించడంతో పాటు పర్యావరణహిత రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి దోహదపడతాయని వివరించారు.

2026-27 ఆర్థిక సంవత్సరానికి సేతు బంధన్‌ పథకం కింద మూడు కీలక ROB/RUB ప్రాజెక్టులకు మంజూరు ఇవ్వాలని మంత్రి కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం బైపాస్‌ వద్ద నాలుగు లేన్ల ROB, పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్‌ వద్ద రెండు లేన్ల ROB, నల్గొండ జిల్లాలో పగిడిపల్లి-నడికుడి రైల్వే సెక్షన్‌లో నాలుగు లేన్ల ROB నిర్మాణ ప్రతిపాదనలను కేంద్రం పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

NH-65 ఆరు లేన్ల విస్తరణ..

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను కలిపే హైదరాబాద్‌-విజయవాడ-మచిలీపట్నం NH-65ను ఆరు(6+2) లేన్లుగా విస్తరించే ప్రాజెక్టును వేగవంతం చేయాలని మంత్రి కోమటి రెడ్డి.. నితిన్ గ‌డ్క‌రీని కోరారు. ప్రస్తుతం ఈ రహదారిపై ట్రాఫిక్‌ 1.20 లక్షలకు పైగా PCUsకు చేరిందని, అనేక ప్రమాదకర ప్రాంతాలు, బ్లాక్‌స్పాట్లు ఉన్నాయని తెలిపారు. పెరుగుతున్న ట్రాఫిక్‌ అవసరాలకు అనుగుణంగా రహదారిని విస్తరించడంతో పాటు రోడ్డు భద్రతను మెరుగుపరచడం అత్యవసరమని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు అలైన్‌మెంట్‌ ఆమోదం, PATSC, PPPAC ఆమోదాలు ఇప్పటికే లభించాయని, CCEA ఆమోదం కోసం సిఫారసు చేసిన నేపథ్యంలో త్వరగా తుది ఆమోదం లభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

హైదరాబాద్‌–శ్రీశైలం NH-765లో టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతంలో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి మంజూరు ఇవ్వాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అటవీ ప్రాంతంలో రహదారి విస్తరణకు ఎదురవుతున్న సమస్యలకు ఎలివేటెడ్‌ కారిడార్‌ పరిష్కారంగా నిలుస్తుందని, శ్రీశైలం వెళ్లే భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడంతో పాటు నల్లమల అటవీ ప్రాంత పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఇది దోహదపడుతుందని వివరించారు.

2026-27 ఆర్థిక సంవత్సరానికి (CRIF) పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో 33 రహదారి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కోరారు. మొత్తం 511.68 కి.మీ. పొడవుతో చేపట్టనున్న ఈ పనులకు రూ.1,227.75 కోట్ల అంచనా వ్యయం అవుతుందని తెలిపారు. గౌరవ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన ఈ పనులు రాష్ట్రవ్యాప్తంగా సమతుల్య ప్రాంతీయ అభివృద్ధికి ఎంతో కీలకమని, వీటిని పరిశీలించి 2026-27 CRIF పథకం కింద మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కోరారు.

RRR ఉత్తర భాగానికి ఆర్థిక, కేబినెట్‌ ఆమోదం కోరిన మంత్రి

హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌ రోడ్డులోని ఉత్తర భాగానికి ఆర్థిక, కేంద్ర మంత్రివర్గ ఆమోదం త్వరగా ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కోరారు. సంగారెడ్డి-నర్సాపూర్‌-తూప్రాన్‌-గజ్వేల్‌-జగదేవ్‌పూర్‌-భువనగిరి-చౌటుప్పల్‌ మార్గంలో 161.518 కి.మీ. మేర నిర్మించనున్న RRR ఉత్తర భాగానికి భూసేకరణ వ్యయంలో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. NHAI టెండర్లు కూడా ఆహ్వానించినందున వీలైనంత త్వరగా ఆర్థిక, కేబినెట్‌ ఆమోదాలు ఇవ్వాలని కోరారు.

అదే సమయంలో హైదరాబాద్‌ చుట్టూ పూర్తి రింగ్‌ను ఏర్పాటు చేసేందుకు RRR దక్షిణ భాగాన్ని కూడా ఉత్తర భాగంతో సమానంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. భారత్ ఫ్యూచర్‌ సిటీ, పారిశ్రామిక పార్కులు, రేడియల్‌ రోడ్లు తదితర భవిష్యత్‌ మౌలిక వసతులకు దక్షిణ RRR కీలకంగా మారుతుందని వివరించారు.

హైదరాబాద్‌-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య భవిష్యత్‌ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసే హైదరాబాద్‌–అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేకు సంబంధించి డీపీఆర్‌ ప్రక్రియను వేగవంతం చేసి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని మంత్రి కోరారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వేను తెలంగాణలోని డ్రైపోర్టుతో అనుసంధానం చేయడం ద్వారా సరుకు రవాణా సులభతరం అవుతుందని, ఆర్థిక కార్యకలాపాలు, పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని తెలిపారు. బందర్‌ పోర్టుకు స్పర్‌ కనెక్టివిటీ కల్పించే అవకాశం కూడా ఉందని వివరించారు.

తెలంగాణ అభివృద్ధికి కీలకమైన ఈ ప్రాజెక్టులన్నింటినీ సానుకూలంగా పరిశీలించి, కేంద్ర స్థాయిలో అవసరమైన అనుమతులు, నిధుల మంజూరీలు, కేబినెట్‌ ఆమోదాలను త్వరితగతిన పూర్తి చేసి రాష్ట్రానికి సహకరించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కోరారు. మంత్రి రాష్ట్ర ప్రాజెక్టుల కోసం చేసిన విజ్ఞప్తుల పట్ల నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు.

మంత్రి వెంట ఆర్ అండ్ బీ స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, చీఫ్ ఇంజినీర్లు బి.వి రావు, ధర్మారెడ్డి, వసంత్ నాయక్ పలువురు అధికారులు ఉన్నారు.

Advertisement
Advertisement