త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Danam Nagender | దానం నాగేంద‌ర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

Danam Nagender | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender)కు సుప్రీంకోర్టు (Supreme Court)లోనూ చుక్కెదురైంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దానంను  ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు స‌మ‌ర్థించింది.

D

Telangana | Published On Sep 24, 2026, 12.31 pm IST

Danam Nagender | దానం నాగేంద‌ర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
Advertisement

Danam Nagender | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు (Danam Nagender) సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఇచ్చిన అనర్హత వేటు తీర్పును సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానంలో ఊరట దక్కలేదు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. ఈ మేర‌కు హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ దానం వేసిన పిటిష‌న్‌ను సుప్రీం ధ‌ర్మాస‌నం కొట్టివేసింది. అన‌ర్హ‌త ప‌డిన నేప‌థ్యంలో మ‌ళ్లీ ఎన్నిక‌కు వెళ్లాల‌ని ఆదేశించింది.

అసలు వివాదం ఏమిటి ?

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే, 2024 పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఒక పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి, రాజీనామా చేయకుండానే మరో పార్టీ తరఫున ఎంపీగా బరిలోకి దిగడం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం) ఉల్లంఘనేనని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ ఆ పిటిషన్లను తోసిపుచ్చడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు సంచలన తీర్పు

ఈ పిటిషన్లపై సమగ్ర విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు నామినేషన్ దాఖలు చేసిన తేదీ (ఏప్రిల్ 23, 2024) నుంచే దానం నాగేందర్ అనర్హుడని స్పష్టం చేస్తూ తీర్పునిచ్చింది. ఈ ఉత్తర్వుల అమలుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో, ఆ తీర్పును సవాల్‌ చేస్తూ దానం నాగేందర్ అత్యవసరంగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఇవాళ విచార‌ణ చేప‌ట్టింది. ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉండి.. మరో పార్టీ నుంచి ఎన్నికలకు పోటీ చేయడమంటే తన సభ్యత్వాన్ని వదులుకోవడమేనని సీజేఐ ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది. అన‌ర్హ‌త ప‌డిన నేప‌థ్యంలో మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని సూచించింది. సుప్రీం తీర్పుతో ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది.

విచార‌ణ సంద‌ర్భంగా దానం త‌ర‌ఫున న్యాయవాది ముకుల్ రోహత్గీ వాద‌న‌లు వినిపిస్తూ.. ఆయన సాంకేతికంగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, విప్‌లను సైతం పాటించారని పేర్కొన్నారు. అయితే, ప్రత్యర్థి పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడమే పార్టీని వీడినట్లు ప్రాథమిక ఆధారమని న్యాయస్థానం పరిగణించింది. హైకోర్టు తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు, దానంకు ప్రజాతీర్పు కోరడం మినహా వేరే మార్గం లేదని, ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుతో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం అధికారికంగా ఖాళీ అయినట్లైంది. త్వరలోనే ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కావడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ తీర్పు ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

జ‌స్టిస్ బాగ్చి, రోహ‌త్గీ మ‌ధ్య వాడీవేడీ చ‌ర్చ‌

విచార‌ణ సంద‌ర్భంగా న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బాగ్చి, పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది ముకుల్ రోహత్గీ మ‌ధ్య వాడీవేడీ వాద‌న‌లు జ‌రిగాయి. దానం విష‌యంలో స్పీక‌ర్ తీర్పుపై జ‌స్టిస్ బాగ్చి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. స్పీక‌ర్ ఆదేశాల శైలి, స్ప‌ష్ట‌త త‌న‌ను నిజంగా ఆక‌ట్టుకున్నాయ‌ని వ్యాఖ్యానించారు.

  • జస్టిస్ బాగ్చి: స్పీకర్ ఆదేశాల శైలి, స్పష్టత నన్ను నిజంగా ఆకట్టుకున్నాయి.
  • దానం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ : క్షమాపణ అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా...
  • జస్టిస్ బాగ్చి: అంటే ఘర్ వాపసీ గురించా?
  • ముకుల్ రోహత్గీ: అవును, నా క్లయింట్ కేసు ముమ్మాటికీ ఘర్ వాపసీ లాంటిదే. ఆయన ఇప్పటికీ తన సొంత పార్టీతోనే ఉన్నారు. పార్టీ సమావేశాలకు హాజరయ్యారు, పార్టీ కూడా ఆయనపై ఎలాంటి వ్యతిరేక చర్యా తీసుకోలేదు.
  • జస్టిస్ బాగ్చి: ఈ ఘర్ వాపసీ మిమ్మల్ని అనర్హత నుంచి కాపాడుతుందా..? స్వచ్ఛందంగా ఒక పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకున్న క్షణమే సభ సభ్యత్వాన్ని శాశ్వతంగా కోల్పోతారు. మీరు తిరిగి మీ పార్టీలోకి వెళ్లవచ్చు.. కానీ అసెంబ్లీ సభ్యత్వం మాత్రం మళ్లీ తిరిగి రాదు.
  • ముకుల్ రోహత్గీ: ఆ మచ్చను లేదా తప్పును తుడిచిపెట్టేందుకే ఘర్ వాపసీ అవకాశం కల్పించారు.
  • జస్టిస్ బాగ్చి: అది క్లాజ్ 'బి'కి సంబంధించిన అంశం...
  • ముకుల్ రోహత్గీ: ఘర్ వాపసీ అనేది కేవలం ఒక విభాగానికి మాత్రమే వర్తించదు. ఒక వ్యక్తి తిరిగి తన సొంత పార్టీకి రావడానికి రాజ్యాంగం అనుమతిస్తుంది.
  • జస్టిస్ బాగ్చి: అయితే మీ పార్టీ వాళ్లు మిమ్మల్ని రాజ్యసభకు పంపుకుంటారులెండి.

Also Read..

జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. మంత్రి కుమార్తె సహా నలుగురు మృతి

ఎన్‌ఎస్‌ఈ షేర్లకు అదిరిపోయే ర్యాలీ.. 5 శాతం జంప్.. ప్రాఫిట్ బుక్ చేయాలా..?

రానున్న 24 గంట‌ల్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు..

Advertisement
Advertisement