త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NSE IPO | ఎన్‌ఎస్‌ఈ షేర్లకు అదిరిపోయే ర్యాలీ.. 5 శాతం జంప్.. ప్రాఫిట్ బుక్ చేయాలా..?

NSE IPO | దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా షేర్లు గురువారం దలాల్ స్ట్రీట్‌లో స్వల్ప ప్రీమియంతో నమోదైన అనంతరం పుంజుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ షేర్లు బీఎస్‌ఈలో లిస్టయ్యాయి. లిస్టింగ్ అనంతరం భారీ కొనుగోళ్లతో షేర్ ధర 5 శాతానికి పైగా పెరిగింది.

S

Business | Published On Sep 24, 2026, 12.26 pm IST

NSE IPO | ఎన్‌ఎస్‌ఈ షేర్లకు అదిరిపోయే ర్యాలీ.. 5 శాతం జంప్.. ప్రాఫిట్ బుక్ చేయాలా..?
Advertisement

NSE IPO | దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా షేర్లు గురువారం దలాల్ స్ట్రీట్‌లో స్వల్ప ప్రీమియంతో నమోదైన అనంతరం పుంజుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ షేర్లు బీఎస్‌ఈలో లిస్టయ్యాయి. లిస్టింగ్ అనంతరం భారీ కొనుగోళ్లతో షేర్ ధర 5 శాతానికి పైగా పెరిగింది. ఎన్‌ఎస్‌ఈ షేర్లు ఇష్యూ ధర రూ.1,785తో పోలిస్తే 0.84 శాతం ప్రీమియంతో రూ.1,800 వద్ద బీఎస్‌ఈలో లిస్టయ్యాయి. ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతుతో రూ.1,878 గరిష్ఠ స్థాయిని తాకాయి. దీంతో ఇష్యూ ధరతో పోలిస్తే షేర్ గరిష్ఠంగా 5.21 శాతం లాభపడింది. దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ సెప్టెంబర్ 17 నుంచి 21 వరకు అందుబాటులో ఉంది. అన్ని వర్గాల పెట్టుబడిదారుల నుంచి ఈ ఐపీఓకు బలమైన స్పందన లభించింది. మొత్తం 5.71 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. రూ.22,568.94 కోట్ల ఇష్యూ పరిమాణానికి గాను రూ.90,287.33 కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి.

బ‌ల‌హీనంగా న‌మోదైనా..

అయితే ఎన్‌ఎస్‌ఈ షేర్ల లిస్టింగ్ మార్కెట్ అంచనాల కంటే కొంత బలహీనంగా నమోదైంది. లిస్టింగ్‌కు ముందు గ్రే మార్కెట్ ప్రీమియం సుమారు 2.2 శాతం ప్రీమియం లిస్టింగ్‌ను సూచించింది. కానీ వాస్తవంగా షేర్లు 0.84 శాతం ప్రీమియంతో ప్రారంభమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ షేర్లపై బ్రోకరేజీ సంస్థలు మాత్రం సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేశాయి. ఎక్స్ఛేంజ్‌లో ఎన్‌ఎస్‌ఈకి ఉన్న ఆధిపత్య స్థానం, లాభదాయకత, సాపేక్షంగా సమంజసమైన విలువల కారణంగా దీర్ఘకాలికంగా షేర్లకు అవకాశాలు ఉన్నాయని బ్రోకరేజీలు పేర్కొన్నాయి. మ్యాక్వారీ ఎన్‌ఎస్‌ఈ షేర్లపై కవరేజీ ప్రారంభించి అవుట్‌పర్ఫార్మ్ రేటింగ్ ఇచ్చింది. ఒక్కో షేర్‌కు రూ.1,965 టార్గెట్ ధరను నిర్ణయించింది. ఇది రూ.1,785 ఇష్యూ ధరతో పోలిస్తే సుమారు 10 శాతం పెరుగుదల అవకాశాన్ని సూచిస్తోంది. మార్కెట్ వాటా, అధిక లిక్విడిటీ, సాంకేతిక సామర్థ్యాలు, బలమైన నెట్‌వర్క్ ఎఫెక్ట్ కారణంగా ఎన్‌ఎస్‌ఈని ది డామినేటర్ గా మ్యాక్వారీ అభివర్ణించింది.

12 శాతం వార్షిక వృద్ధి..

ఆర్థిక సంవత్సరం 2026 నుంచి 2030 మధ్య ఎన్‌ఎస్‌ఈ ఆదాయంలో సుమారు 12 శాతం వార్షిక వృద్ధి నమోదవుతుందని మ్యాక్వారీ అంచనా వేసింది. లావాదేవీలకు సంబంధించిన ఆదాయంతోపాటు ఇతర ఆదాయ వనరులు, కొత్త ఉత్పత్తులు ఈ వృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొంది. క్యాష్ ఈక్విటీస్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగాల్లో మార్కెట్ వాటా కొంత తగ్గినా, ఇతర ఆదాయ వనరులు దాన్ని కొంత భర్తీ చేస్తాయ‌ని తెలిపింది. ఎన్‌ఎస్‌ఈ నిర్వహణ మార్జిన్లు 70 శాతం మధ్య స్థాయిలో కొనసాగుతాయని కూడా మ్యాక్వారీ అంచనా వేసింది. ఎన్‌ఎస్‌ఈకి ఉన్న భారీ స్థాయి కార్యకలాపాలు, ఆపరేటింగ్ లీవరేజ్ దీనికి మద్దతు ఇస్తాయని పేర్కొంది. దేశీయ బ్రోకరేజీ సంస్థ ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఎన్‌ఎస్‌ఈపై కవరేజీ ప్రారంభించింది. బై రేటింగ్‌తోపాటు సెప్టెంబర్ 2027కు రూ.2,050 టార్గెట్ ధరను నిర్ణయించింది. ఇది ఇష్యూ ధరతో పోలిస్తే 15 శాతం పెరుగుదల అవకాశాన్ని సూచిస్తోంది.

టార్గెట్ ధ‌ర రూ.1950..

పీఎల్ క్యాపిటల్ ఎన్‌ఎస్‌ఈ షేర్లపై అక్యుములేట్ రేటింగ్ ఇచ్చి ఒక్కో షేర్‌కు రూ.1,950 టార్గెట్ ధరను నిర్ణయించింది. ఆర్థిక సంవత్సరం 2026లో 71 శాతంగా ఉన్న ఈబీటీడీఏ మార్జిన్ ఆర్థిక సంవత్సరం 2029 నాటికి 76 శాతానికి కోలుకుంటుందని అంచనా వేసింది. అదే సమయంలో పన్నుల అనంతర లాభాల్లో సుమారు 11 శాతం వార్షిక వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. ఐపీఓ విలువ ఆధారంగా ఎన్‌ఎస్‌ఈ మార్కెట్ విలువ సుమారు రూ.4.4 లక్షల కోట్లుగా ఉందని, ఆర్థిక సంవత్సరం 2029 అంచనా ఆదాయాల ఆధారంగా పీఈ నిష్పత్తి సుమారు 32 రెట్లు ఉంటుందని పీఎల్ క్యాపిటల్ తెలిపింది. ఈ విలువ ఇప్పటికే ఎన్‌ఎస్‌ఈకి ఉన్న ప్రీమియంను చాలా వరకు ప్రతిబింబిస్తోందని పేర్కొంది. కీలక విభాగాల్లో ఆధిపత్య స్థానం, అధిక ప్రవేశ అడ్డంకులు, లాభాల్లో వృద్ధి, కొత్త డెరివేటివ్ ఉత్పత్తులు, కొలోకేషన్ ఆదాయం వంటి అంశాలు భవిష్యత్తులో విలువకు మద్దతు ఇస్తాయ‌ని అంచనా వేసింది.

వేచి ఉంటే మంచిది..

సామ్కో సెక్యూరిటీస్ మార్కెట్ పర్స్పెక్టివ్స్ అండ్ రీసెర్చ్ హెడ్ అపూర్వ శేత్ మాత్రం లిస్టింగ్ రోజున ఎన్‌ఎస్‌ఈ షేర్లను విక్రయించేందుకు తొందరపడాల్సిన అవసరం లేదని సూచించారు. అయితే లిస్టింగ్ లాభాల కోసమే ఐపీఓలో పెట్టుబడి పెట్టిన వారికి పరిస్థితి భిన్నంగా ఉంటుంద‌ని తెలిపారు. దీర్ఘకాలికంగా ఎన్‌ఎస్‌ఈలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు కనీసం కొన్ని ట్రేడింగ్ సెషన్ల పాటు వేచి ఉండి షేర్ ధర స్థిరపడే వరకు పరిశీలించడం మంచిదని అపూర్వ శేత్ సూచించారు. ఒకేసారి మొత్తం పెట్టుబడి పెట్టకుండా దశలవారీగా షేర్లను కొనుగోలు చేసే విధానాన్ని ఆయన సూచించారు.

Advertisement
Advertisement