త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | ఆ విష‌యం తేల్చ‌కుండా.. ఇళ్ల కొనుగోలుదారుల‌పై బ‌ల‌వంత‌పు రిక‌వ‌రీలు వ‌ద్దు

Supreme Court | అసంపూర్తి హౌసింగ్ ప్రాజెక్టుల విషయంలో బిల్డర్లు (builders), బ్యాంకుల (Banks) మధ్య కుమ్మక్కును తేల్చకుండా గృహ రుణాల‌ను (housing loans) తిరిగి చెల్లించాల‌ని కొనుగోలుదారుల‌పై ఒత్తిడి తేవొద్ద‌ని దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు కమర్షియల్ కోర్టులు (commercial courts), నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ), నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్ఏటీ)లకు కీల‌క ఆదేశాలు జారీ చేసింది.

D

National | Published On Nov 20, 2026, 5.10 pm IST

Supreme Court | ఆ విష‌యం తేల్చ‌కుండా.. ఇళ్ల కొనుగోలుదారుల‌పై బ‌ల‌వంత‌పు రిక‌వ‌రీలు వ‌ద్దు
Advertisement

Supreme Court | త్రినేత్ర న్యూస్ : అసంపూర్తి గృహ నిర్మాణ ప్రాజెక్టుల కారణంగా ఆర్థికంగా నష్టపోతున్న ఫ్లాట్ల కొనుగోలుదారులకు (homebuyers) దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) భారీ ఊర‌టనిచ్చింది. ఇలాంటి హౌసింగ్ ప్రాజెక్టుల విషయంలో బిల్డర్లు (builders), బ్యాంకుల (Banks) మధ్య కుమ్మక్కును తేల్చకుండా గృహ రుణాల‌ను (housing loans) తిరిగి చెల్లించాల‌ని కొనుగోలుదారుల‌పై ఒత్తిడి తేవొద్ద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు బ‌ల‌వంత‌పు రిక‌వ‌రీ చ‌ర్య‌లు చేప‌ట్టొద్ద‌ని కమర్షియల్ కోర్టులు (commercial courts), నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ), నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్ఏటీ)లను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

గురుగ్రామ్ ప్రాంతానికి చెందిన 'కృష్ణ హౌసింగ్ స్కీమ్' ప్రాజెక్ట్ బిల్డర్ (housing projects) నిర్మాణాన్ని పూర్తి చేయకుండానే దివాలా (Insolvency) ప్రక్రియలోకి వెళ్ళాడు. ఫ్లాట్లు చేతికి అందకపోయినా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొనుగోలుదారులపై రుణ రికవరీ చర్యలు ప్రారంభించింది. దీంతో బాధితులు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఈ పిటిష‌న్‌పై ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్‌, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది.

బ్యాంకు అధికారులు, బిల్డ‌ర్ మ‌ధ్య కుమ్మ‌క్కు జ‌రిగిందా, త్రైపాక్షిక ఒప్పందానికి (Tripartite Agreement) అనుగుణంగానే రుణాల విడుద‌ల జ‌రిగిందా లేదా అనేది నిర్ధారించ‌డం క‌మ‌ర్షియ‌ల్ కోర్టు బాధ్య‌త అని ధ‌ర్మాస‌నం పేర్కొంది. ఇలాంటి ఒప్పందాల ప్ర‌కారం నిర్మాణ పురోగతికి అనుగుణంగా బ్యాంకులు నేరుగా డెవలపర్లకు నిధులు విడుదల చేయాల్సి ఉంటుందని తెలిపింది. కానీ చాలా సందర్భాల్లో, నిర్మాణం జరగక ముందే బ్యాంకులు నిధులు విడుదల చేస్తుండటంతో ప్రాజెక్టులు ఏళ్ల తరబడి అసంపూర్తిగా మిగిలిపోతున్నాయ‌ని పేర్కొంది. దీనివల్ల కొనుగోలుదారులు అటు ఇంటి అద్దె, ఇటు ఈఎంఐలు చెల్లిస్తూ తీవ్రంగా నష్టపోతున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది.

నిబంధనలను ఉల్లంఘించి బ్యాంకులు ముందే ఎక్కువ నిధులు విడుదల చేశాయా లేదా అనే విషయాన్ని కమర్షియల్ కోర్టులు, ఎన్‌సీఎల్‌టీ (NCLT), ఎన్‌సీఎల్ఏటీ (NCLAT) ముందుగా నిర్ధారించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొనుగోలుదారులు నిజంగానే రుణ చెల్లింపుల్లో విఫలమయ్యారని (Default) స్పష్టమైన నిర్ధారణకు రానంత వరకు వారిపై ఎలాంటి బలవంతపు రికవరీ (Loan recovery) చర్యలు తీసుకోకూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ కేసుతోపాటూ బెంగళూరులోని 'GM ఇన్ఫినిట్ గ్లోబల్ టెక్కీస్ టౌన్' ప్రాజెక్టుకు చెందిన 4,000 మందికి పైగా కొనుగోలుదారులకు కూడా ఫ్లాట్లు అప్పగించే వరకు ఎలాంటి రికవరీ చర్యలు తీసుకోకుండా అత్యున్న‌త న్యాయ‌స్థానం రక్షణ కల్పించింది. ఈ సంద‌ర్భంగా సీజేఐ ధ‌ర్మాస‌నం ఫ్లాట్ల కొనుగోలు దారుల‌కు కీల‌క సూచ‌న‌లు చేసింది. ప్రతి బిల్డర్ వివాదంపై ఆర్టికల్ 32 కింద నేరుగా సుప్రీంకోర్టుకు రాకుండా.. సంబంధిత హైకోర్టులు, కమర్షియల్ కోర్టులు, ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌లను ఆశ్రయించి తమ అభ్యంతరాలను తెలపాలని సూచించింది.

Also Read..

మేన‌రిక వివాహాల‌పై చ‌ట్టం తెచ్చే అవ‌స‌రాన్ని ప‌రిశీలించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

ఆల్‌టైమ్ హై దిశగా సెన్సెక్స్, నిఫ్టీ.. భారీ ర్యాలీతో ముగిసిన సూచీలు..

హైదరాబాద్‌ నీటి కష్టాలకు చెక్‌!

Advertisement
Advertisement