BRS Party | పల్నాడు ప్రాజెక్టును అడ్డుకోవాలి
BRS Party | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న పల్నాడు మంచినీటి ప్రాజెక్టును తక్షణమే నిలిపివేయాలని భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కీలకమైన 510 అడుగుల నీటిమట్టాన్ని దెబ్బతీసేలా 493.47 అడుగుల నుంచే నీటిని తరలించేందుకు చేపడుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని కృష్ణా నది యాజమాన్య బోర్డుకు విజ్ఞప్తి చేసింది.
- సాగర్ నీళ్లను దోచుకుంటుంటే చోద్యం చూస్తారా?
- పల్నాడు ప్రాజెక్టులను తక్షణం నిలిపివేయాలి
- హైదరాబాద్ తాగునీటి భద్రతకు ముప్పు
- కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం
BRS Party | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న పల్నాడు మంచినీటి ప్రాజెక్టును తక్షణమే నిలిపివేయాలని భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కీలకమైన 510 అడుగుల నీటిమట్టాన్ని దెబ్బతీసేలా 493.47 అడుగుల నుంచే నీటిని తరలించేందుకు చేపడుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని కృష్ణా నది యాజమాన్య బోర్డుకు విజ్ఞప్తి చేసింది. తెలంగాణ నీటి హక్కులు, భవిష్యత్తు అవసరాలను పక్కనపెట్టి పల్నాడు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం సమంజసం కాదని స్పష్టం చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో జలసౌధలో కేఆర్ఎంబీ చైర్మన్‌ను నల్గొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, డీ సుధీర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, కేపీ వివేకానంద్, జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కలిశారు. నాగార్జున సాగర్ వద్ద ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఫిర్యాదు చేసింది.
అక్రమంగా ప్రాజెక్టు నిర్మాణం
నాగార్జునసాగర్ జలాశయం నుంచి పల్నాడు మంచినీటి ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపడుతోందని బీఆర్‌ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం హైదరాబాద్ మహానగర తాగునీటి భద్రత, భవిష్యత్తు నీటి అవసరాలకు తీవ్ర విఘాతం కలిగించే ప్రమాదముందని పేర్కొన్నారు. నగర జనాభా, పట్టణీకరణ, పారిశ్రామిక, వాణిజ్య అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో సాగర్ నీటిపై తెలంగాణ ఆధారపడటం మరింత పెరగనుందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఏపీ చేపడుతున్న ప్రాజెక్టు తెలంగాణ ప్రయోజనాలకు గండికొట్టేలా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు.
493.47 అడుగుల నుంచే తరలింపా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచే నాగార్జునసాగర్ ద్వారా హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా జరుగుతోంది. నగర అవసరాలకు నీటిని అందించేందుకు 510 అడుగుల నీటిమట్టం కీలకమైన కనీస స్థాయిగా ఉంది. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పల్నాడు ప్రాజెక్టులో 150.45 మీటర్లు (493.47 అడుగులు) వద్దే నీటిని తరలించేలా ఇన్‌టేక్ పాయింట్ల నిర్మాణం చేపడుతున్నట్లు బీఆర్‌ఎస్ నేతలు ప్రస్తావించారు. ఈ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కీలకమైన నీటిమట్టం కంటే దిగువ నుంచే నీటిని తరలించుకునే అవకాశం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నగరం ఇప్పటికే భారీగా విస్తరించిందని, భవిష్యత్తులో జనాభా మరింత పెరగనున్న నేపథ్యంలో తాగునీటి డిమాండ్ కూడా పెరుగుతుందని తెలిపింది. అలాంటి సమయంలో సాగర్ నీటిని ఇతర అవసరాలకు తరలిస్తే హైదరాబాద్ తాగునీటి భద్రత ప్రశ్నార్థకమవుతుందని హెచ్చరించింది.
మళ్లీ కొత్త ప్రాజెక్టు ఎందుకు?
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తాగునీటి కోసం నాగార్జునసాగర్ నుంచి జరిగిన నీటి వినియోగాన్ని బచావత్ ట్రిబ్యునల్‌కు సమర్పించిన నివేదికల్లో తెలంగాణ వాటా కింద పరిగణించిన అంశాన్ని కూడా బోర్డు పరిరక్షించాలని బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు కోరారు. తెలంగాణకు ఉన్న చారిత్రక నీటి వినియోగ హక్కులు, భవిష్యత్తు అవసరాలను పక్కనపెట్టి పల్నాడు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం సమంజసం కాదన్నారు. పైగా పులిచింతల నుంచి 80 టీఎంసీల నీటి వినియోగంతో కృష్ణా జిల్లాల తాగునీటి అవసరాలకు వాడుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో.. సాగర్ నుంచి అదనపు జలాల విడుదల, కొత్త ప్రాజెక్టు నిర్మాణం అవసరమేంటని ప్రశ్నించింది. తెలంగాణకు ఉన్న చారిత్రక నీటి వినియోగ హక్కులు, హైదరాబాద్ పెరుగుతున్న తాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
అనుమతుల్లేకుండా ప్రాజెక్టు నిర్మాణం ఎలా?
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014 ప్రకారం కృష్ణా నది జలాల వినియోగం, అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి నిర్దేశిత అనుమతులు, సాంకేతిక పరిశీలనలు తప్పనిసరి. పల్నాడు ప్రాజెక్టుకు కేఆర్‌ఎంబీ, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), అపెక్స్ కౌన్సిల్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు పొందినట్లు స్పష్టమైన వివరాలు లేవని నేతలు తెలిపారు. అయినప్పటికీ నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు కొనసాగించడం సమంజసం కాదని, కేఆర్‌ఎంబీ తక్షణమే జోక్యం చేసుకుని నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరారు. ప్రాజెక్టు డీపీఆర్‌లు, నీటి కేటాయింపులు, ఇన్‌టేక్ పాయింట్ల నిర్మాణం, నీటి తరలింపు సామర్థ్యంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
కేఆర్‌ఎంబీకి బీఆర్‌ఎస్ డిమాండ్లు
- పల్నాడు మంచినీటి ప్రాజెక్టు నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలి.
- హైదరాబాద్ తాగునీటి భద్రత, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని సాగర్ నీటి వినియోగంపై తెలంగాణకు రక్షణ కల్పించాలి.
- ప్రాజెక్టు డీపీఆర్‌లు, నీటి కేటాయింపులు, సాంకేతిక అనుమతులు, ఇన్‌టేక్ పాయింట్ల నిర్మాణంపై సమగ్ర విచారణ జరపాలి.
- 493.47 అడుగుల దిగువ నుంచి నీటిని తరలించేలా చేపడుతున్న నిర్మాణాలపై పూర్తి వివరాలు సేకరించాలి.
- తెలంగాణకు ఉన్న చారిత్రక నీటి వినియోగ హక్కులు, హైదరాబాద్ పెరుగుతున్న జనాభా, భవిష్యత్తు అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి.
- పులిచింతల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాన్ని అధికారికంగా తీసుకుని రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం నిర్వహించాలి.
- హైదరాబాద్ దిశగా జరిగే అనధికారిక నీటి తరలింపులపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి.
తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణే లక్ష్యం
హైదరాబాద్ మహానగరం ఐటీ, పారిశ్రామిక, వాణిజ్య, విద్యా కేంద్రంగా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో తాగునీటి భద్రత అత్యంత కీలకమని నేతలు పేర్కొన్నారు. ప్రస్తుత అవసరాలకే కాకుండా రాబోయే తరాల నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నాగార్జునసాగర్ నీటి వినియోగంపై తెలంగాణకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేఆర్‌ఎంబీపై ఉందని స్పష్టం చేశారు. పల్నాడు ప్రాజెక్టు పేరుతో తెలంగాణ నీటి హక్కులకు భంగం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు కోరారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●NCERT | పాఠ్యపుస్తకాల నాసిరకం ముద్రణపై NCERT సీరియస్.. బాధ్యులపై కఠిన చర్యలకు హామీ
- ●Jagadish Reddy | బీఆర్ఎస్ నేతల అరెస్టులపై జగదీశ్‌రెడ్డి ఫైర్
- ●Srisailam Temple | శ్రీశైలంలో భక్తజన సందోహం.. అభిషేకాలు, స్పర్శ దర్శనాలు నిలిపివేత!
- ●Bisleri Water | మా నీరు తాగేందుకు పూర్తిగా సురక్షితమే.. FSSAI చర్యలపై బిస్లరీ వివరణ
- ●Dimple Hayathi | నాకింకా పెళ్లి కాలేదు - నెటిజన్ కామెంట్‌పై డింపుల్ హయతి రిప్లై
- ●WTC 2027 Final | డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో టీమిండియాకు చావోరేవో..!

NCERT | పాఠ్యపుస్తకాల నాసిరకం ముద్రణపై NCERT సీరియస్.. బాధ్యులపై కఠిన చర్యలకు హామీ

Jagadish Reddy | బీఆర్ఎస్ నేతల అరెస్టులపై జగదీశ్‌రెడ్డి ఫైర్

Srisailam Temple | శ్రీశైలంలో భక్తజన సందోహం.. అభిషేకాలు, స్పర్శ దర్శనాలు నిలిపివేత!

Bisleri Water | మా నీరు తాగేందుకు పూర్తిగా సురక్షితమే.. FSSAI చర్యలపై బిస్లరీ వివరణ




