త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | ఈసీ నియామ‌కాల‌పై భిన్న తీర్పులు.. ప‌రిశీలిస్తామ‌న్న సీజేఐ ధ‌ర్మాస‌నం

Supreme Court | ఈసీ నియామ‌కాల‌పై వెలువ‌డిన భిన్న తీర్పుల‌ను పునఃసమీక్షించేందుకు ప్రధాన న్యాయ‌మూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant) నేతృత్వంలోని త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం అంగీక‌రించింది. ఈ పిటిషన్‌ను పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకుంటామని స్ప‌ష్టం చేసింది.

D

National | Published On Oct 7, 2026, 1.06 pm IST

Supreme Court | ఈసీ నియామ‌కాల‌పై భిన్న తీర్పులు.. ప‌రిశీలిస్తామ‌న్న సీజేఐ ధ‌ర్మాస‌నం
Advertisement

Supreme Court | త్రినేత్ర న్యూస్ : ఈసీ నియామకాల చట్టంపై సుప్రీంకోర్టు (Supreme Court)లో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మైన (SC Delivers Split Verdict) విష‌యం తెలిసిందే. 2023 నాటి చట్టంపై సవాళ్లను పెద్ద రాజ్యాంగ బెంచ్‌కు రిఫర్ చేయాలా వద్దా అనే అంశంపై జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా (Justices Dipankar Datta), జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ (Satish Chandra Sharma)తో కూడిన ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం వేర్వేరు అభిప్రాయాల‌ను వెలువ‌రించింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. ప్రధాన న్యాయ‌మూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant), జస్టిసెస్ జాయ్‌మల్య బాగ్చి, వి. మోహనాలతో కూడిన త్రిస‌భ్య ధర్మాసనం ముందు సీనియర్ అడ్వొకేట్ గోపాల్ శంకరనారాయణన్ ఈ అంశాన్ని ప్ర‌స్తావించారు. స్పందించిన సీజేఐ ధ‌ర్మాస‌నం ఈ పిటిషన్‌ను పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకుంటామని స్ప‌ష్టం చేసింది.

కాగా, 2023లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం ప్రకారం.. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC), ఎన్నికల కమిషనర్ల (EC) ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, ఒక కేంద్ర కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. అంతకుముందు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ ప్యానెల్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) ఉండాలి. కానీ, కొత్త చట్టంలో సీజేఐ స్థానంలో ప్ర‌ధాని నామినేట్ చేసిన‌ కేబినెట్ మంత్రిని చేర్చారు. ఈ మార్పు వ‌ల్ల ఎన్నిక‌ల క‌మిష‌న్ స్వ‌తంత్ర‌త దెబ్బ‌తింటుంద‌ని, ప్యానెల్‌లో ప్ర‌భుత్వ ప‌క్షానికే మెజారిటీ ఉంటుంద‌ని పేర్కొంటూ ప‌లువురు సుప్రీంకోర్టులో పిటిష‌న్లు వేశారు.

పిటిష‌న్ల‌పై జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా (Justices Dipankar Datta), జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ (Satish Chandra Sharma) విచారించారు. ఈ పిటిషన్లను విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి (Constitution Bench) పంపాలనే అంశంపై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏకీభవించలేకపోయింది. ఈ కేసును ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను జస్టిస్ దీపాంకర్ దత్తా తోసిపుచ్చారు. ఎన్నికల సంఘం స్వతంత్రత, తటస్థతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. "ప్ర‌ధాని నియ‌మించిన ఒక కేబినెట్ మంత్రి ప్ర‌భుత్వం లేదా త‌న‌ను నియమించిన నేత నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తార‌ని ఆశించ‌డం అత్యాశే అవుతుంది. దీని వ‌ల్ల ఈ ప్రక్రియ కేవలం అలంకారప్రాయంగా మిగిలిపోతుంది. ఒక తటస్థ వ్యక్తి (సీజేఐ వంటి వారు) ఉంటేనే వ్యవస్థకు స్వతంత్రత, సమతుల్యత లభిస్తుంది" అని ద‌త్తా అభిప్రాయ‌ప‌డ్డారు. ఎన్నికల సంఘం కేవలం స్వతంత్రంగా ఉండటమే కాదు, అది స్వతంత్రంగా పనిచేస్తున్నట్లు ప్రజలకు కనిపించాల‌ని వ్యాఖ్యానించారు.

అయితే, ద‌త్తా అభిప్రాయాల‌తో జస్టిస్ సతీష్ చంద్ర శర్మ విభేదించారు. ఈ వ్యవహారంలో ఒక ప్రధానమైన చట్టపరమైన ప్రశ్న ఇమిడి ఉందని.. ఈ అంశాన్ని పెద్ద ధ‌ర్మాస‌నం ప‌రిశీలించాల‌ని అభిప్రాయపడ్డారు. ఈ అంశంలో ఇద్ద‌రు న్యాయ‌మూర్తుల మ‌ధ్య భిన్నాభిప్రాయాలు త‌లెత్త‌డంతో ఈ విషయాన్ని సీజేఐ ఎదుట ఉంచాలని నిర్ణయించారు. రాజ్యాంగపరమైన సమస్యలను పరిష్కరించేందుకు శాశ్వతంగా ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని ద్విసభ్య ధర్మాసనం సీజేఐని కోరింది.

ఈ సంద‌ర్భంగా జ‌స్టిస్ ద‌త్తా మాట్లాడుతూ.. ఐదు రోజులుగా ఈ పిటిష‌న్ల‌పై తాము వాద‌న‌లు విన్నట్లు చెప్పారు. సంస్థాగత ఐక్యత దృష్ట్యా ఈ అంశంపై ఇద్ద‌రి మ‌ధ్య ఏకాభిప్రాయం కుదిరి ఉంటే బాగుండేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు భిన్నాభిభిప్రాయాలు వ్య‌క్త‌మైన‌ట్లు చెప్పారు. పాల‌కులు చ‌ట్టానికి లోబ‌డి ఉండాలే కానీ.. చ‌ట్టానికి అతీతులు కాద‌న్న‌ది మన రాజ్యాంగ వ్యవస్థలో అత్యంత కీలకమైన ప్రాథమిక సూత్రం అని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలోనే భిన్న తీర్పును పునఃసమీక్షించేందుకు సీజేఐ ధ‌ర్మాస‌నం తాజాగా అంగీక‌రించింది.

Also Read..

ప్ర‌జ‌ల ఆశీర్వాద‌మే నా బ‌లం.. ప్రతి అనుభవం ఓ పాఠమే : ప్ర‌ధాని మోదీ

రెండోసారి త‌ల్లికాబోతున్న స్టార్ న‌టి

సీఈసీకి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌.. రాహుల్‌, ప్రియాంక‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు

Advertisement
Advertisement