త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | ప్ర‌జ‌ల ఆశీర్వాద‌మే నా బ‌లం.. ప్రతి అనుభవం ఓ పాఠమే : ప్ర‌ధాని మోదీ

PM Modi | 25 ఏళ్ల ప్రజా సేవ ప్ర‌స్థానంలో ప్ర‌జ‌ల ఆశీర్వాద‌మే త‌న‌కు ప్ర‌ధాన బ‌లంగా నిలిచింద‌ని ప్ర‌ధాని మోదీ (PM Modi) తెలిపారు. ఈ సందర్భంగా "మనం సాధించి తీరుతాం" (We will do it) అనే నినాదంతో భారతదేశ భవిష్యత్తు కోసం మూడు అత్యంత భారీ లక్ష్యాలను నిర్దేశించారు.

D

National | Published On Oct 7, 2026, 12.23 pm IST

PM Modi | ప్ర‌జ‌ల ఆశీర్వాద‌మే నా బ‌లం.. ప్రతి అనుభవం ఓ పాఠమే : ప్ర‌ధాని మోదీ
Advertisement

PM Modi | త్రినేత్ర న్యూస్ : త‌న రాజ‌కీయ జీవితంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) కీల‌క మైలురాయిని అధిగ‌మించారు. ప్రజా జీవితంలోకి (public office) అడుగుపెట్టి నేటితో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఢిల్లీలో జరిగిన 'వికసిత్ భారత్ సంకల్ప్ సభ'ను ఉద్దేశించి ప్రధాని మోదీ కీల‌క ప్ర‌సంగం చేశారు. ఇంత సుదీర్ఘ‌మైన ప్రజా సేవ ప్ర‌స్థానంలో ప్ర‌జ‌ల ఆశీర్వాద‌మే త‌న‌కు ప్ర‌ధాన బ‌లంగా నిలిచింద‌ని చెప్పారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి, అందిస్తున్న నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.

"2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. ఈ మైలురాయిని చేరుకుంటానని నేనెప్పుడూ ఊహించలేదు. నేడు నేను నిరంతర ప్రజా సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. ఇది నా వ్య‌క్తిగ‌త విజ‌యం కాదు. ప్రజల నిరంతర ఆశీస్సులు, మద్దతు ఫలితమే. దేశ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎన్నిక‌లు ఏవైనా.. ప్రజలు నన్ను దేశానికి సేవ చేసేందుకే ఎన్నుకున్నారు" అని ప్ర‌ధాని భావోద్వేగంతో ప్ర‌సంగించారు.

వియ్‌ విల్‌ డూ ఇట్‌..

ఈ సందర్భంగా "మనం సాధించి తీరుతాం" (We will do it) అనే నినాదంతో భారతదేశ భవిష్యత్తు కోసం మూడు అత్యంత భారీ లక్ష్యాలను ప్ర‌ధాని నిర్దేశించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించి తీరుతామ‌ని స్ప‌ష్టం చేశారు. "2047 నాటికి వికసిత్ భారత్ సాధించి తీరుతాం. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ ల‌క్ష్యాన్ని చేరుకుంటాం. భార‌త‌దేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారుస్తాం. భ‌విష్య‌త్తులో విశ్వ‌క్రీడా వేదికైన ఒలింపిక్స్‌కు ఆతిథ్య‌మిస్తాం. అంత‌రిక్ష రంగంలోనూ కొత్త శిఖ‌రాల‌ను అధిరోహిస్తాం" అని ప్ర‌ధాని ధీమా వ్య‌క్తం చేశారు.

ఎప్పటికీ ఒక విద్యార్థినే

తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ప్ర‌ధాని భావోద్వేగానికి గుర‌య్యారు. జీవితంలో నిత్యం నేర్చుకోవడంలో తాను ఎప్పటికీ ఒక విద్యార్థినేనని చెప్పారు. ప్ర‌తీ రోజూ ఏదో ఒక్క కొత్త విష‌యం నేర్చుకునేందుకే ప్ర‌య‌త్నిస్తాన‌న్నారు. ఎంత ఎక్కువ నేర్చుకుంటే దేశానికి సేవ చేసే సామ‌ర్థం అంత పెరుగుతుంద‌ని చెప్పుకొచ్చారు. త‌న 25 ఏళ్ల ప్ర‌జా సేవ‌లో ఎన్నో ఆటుపోట్ల‌ను ఎదుర్కొన్న‌ట్లు చెప్పారు. జీవితం వృథాగా పోలేద‌ని.. ప్రతి అనుభవం తనకు ఏదో ఒక పాఠం నేర్పిందన్నారు. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధ్యమేన‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు.

దేశమే తొలి ప్రాధాన్యం

రాజకీయాల్లో వెలగాలన్న‌ది త‌న ల‌క్ష్యం కాద‌న్నారు. తాను రాజకీయాలను కేవలం అధికారం కోసం కాకుండా ఒక మిషన్‌గా, బాధ్యతగా భావిస్తానని తెలిపారు. అదే స‌మ‌యంలో విమ‌ర్శ‌ల‌పై కూడా ప్ర‌ధాని స్పందించారు. ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు విమర్శలు స‌ర్వ‌సాధార‌ణ‌మ‌ని చెప్పారు. విమర్శలను పట్టించుకుంటే ముందుకెళ్లలేమ‌న్నారు. త‌న‌ను రాజకీయంగా మ‌రింత బలోపేతం చేసేది ప్రత్యర్థులేన‌ని వ్యాఖ్యానించారు. గత పాతికేళ్ల తన ప్రజా పాలనలో దేశ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యంగా పనిచేశానని చెప్పారు. వేల ఏళ్ల చరిత్ర, గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉన్న దేశానికి సేవ చేసే అవకాశం తనకు లభించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. రానున్న రోజుల్లో మరింత రెట్టింపు ఉత్సాహంతో భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు అహర్నిశలు శ్రమిస్తానని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు.

Also Read..

సీఈసీకి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌.. రాహుల్‌, ప్రియాంక‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు

25 ఏళ్ల ప్ర‌జాప్ర‌స్థానం.. వినాయ‌కుడికి ప్ర‌ధాని ప్ర‌త్యేక పూజ‌లు

ఆర్బీఐ నిర్ణయానికి ముందు మార్కెట్లలో ఒత్తిడి.. సెన్సెక్స్ 462 పాయింట్లు పతనం..

Advertisement
Advertisement