త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heavy rain | ముంబైలో వ‌ర్ష బీభ‌త్సం.. విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు… ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వే మూసివేత‌.. రైలు స‌ర్వీసులు ర‌ద్దు

Heavy rain | ముంబైపై వ‌రుణుడు త‌న ప్ర‌తాపాన్ని చూపుతున్నాడు. ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న కుండ‌పోత‌ వ‌ర్షాల‌కు న‌గ‌రం, శివారు ప్రాంతాలు అత‌లాకుత‌ల‌మ‌వుతున్నాయి. సోమ‌వారం తెల్ల‌వారుజామున కురిసిన కుండ‌పోత వ‌ర్షానికి ఆర్థిక‌ రాజ‌ధాని పూర్తిగా స్తంభించిపోయింది. కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో (Landslides) ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేని అధికారులు మూసివేశారు. అదేవిధంగా రైలు స‌ర్వీసులు కూడా ర‌ద్ద‌య్యాయి.

D

National | Published On Jul 6, 2026, 11.07 am IST

Heavy rain | ముంబైలో వ‌ర్ష బీభ‌త్సం.. విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు… ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వే మూసివేత‌.. రైలు స‌ర్వీసులు ర‌ద్దు
Advertisement

Heavy rain | నైరుతి రుతుప‌వ‌నాల ప్ర‌భావంతో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు (Heavy Rains) ప‌లు రాష్ట్రాలు అత‌లాకుత‌ల‌మ‌వుతున్నాయి. గ‌త కొన్ని రోజులుగా దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబై (Mumbai)పై వ‌రుణుడు త‌న ప్ర‌తాపాన్ని చూపుతున్నాడు. ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న కుండ‌పోత‌ వ‌ర్షాల‌కు న‌గ‌రం, శివారు ప్రాంతాలు అత‌లాకుత‌ల‌మ‌వుతున్నాయి. ఈ వ‌ర్షాల దెబ్బ‌కు ఆర్థిక రాజ‌ధాని పూర్తిగా స్తంభించిపోయింది.

ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వే మూసివేత..

భారీ వ‌ర్షాల‌కు లోత‌ట్టు ప్రాంతాలు నీట‌మునిగాయి. ప్ర‌ధాన ర‌హ‌దారులు న‌దుల‌ను త‌ల‌పిస్తున్నాయి. ఫ‌లితంగా ర‌వాణా వ్య‌వ‌స్థ ఎక్క‌డిక‌క్క‌డ స్తంభించిపోయింది. ప‌లు ప్రాంతాల్లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డుతున్నాయి. సోమ‌వారం కురిసిన కుండ‌పోత వ‌ర్షాల కార‌ణంగా ముంబై-పూణె న‌గ‌రాల మ‌ధ్య కొండ‌చ‌రియ‌లు (Landslides) విరిగిప‌డ్డాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు ఆ ర‌హ‌దారిని మూసివేశారు (Pune-Mumbai Expressway Shut).

ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వే రెండు వైపులా, అలాగే పాత ముంబై-పూణె హైవేపై తదుపరి నోటీసులు వచ్చే వరకూ ట్రాఫిక్‌ను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఫ‌లితంగా వాహ‌నాలు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోవ‌డంతో ప్ర‌యాణికులు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. రెండు న‌గ‌రాల మ‌ధ్య ర‌వాణా వ్య‌వ‌స్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌యాణికుల‌కు అధికారులు కీల‌క సూచ‌న‌లు చేశారు. ప‌రిస్థితి సాధార‌ణ స్థితికి వ‌చ్చే వ‌ర‌కూ ముంబై-పూణె మ‌ధ్య ప్ర‌యాణాల‌ను పెట్టుకోవ‌ద్ద‌ని కోరారు.

నిలిచిపోయిన రైళ్లు..

ఇక ముంబై-పూణె మధ్య రైలు సర్వీసులు కూడా నిలిచిపోయాయి (Trains Cancelled). సెంట్ర‌ల్ రైల్వే అధికారుల స‌మాచారం ప్ర‌కారం.. తెల్ల‌వారుజామున 3:05 గంట‌ల ప్రాంతంలో క‌ర్జాత్‌-లోనావాలా భోర్ ఘాట్ సెక్ష‌న్‌లోని ఠాకూర్వాడి, ఖండాలా-మంకీ హిల్ మ‌ధ్య కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. దీంతో రైలు స‌ర్వీసుల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది. దాదాపు 16 రైళ్ల‌ను అధికారులు ర‌ద్దు చేశారు. మ‌రో తొమ్మిది రైళ్ల‌ను దారి మ‌ళ్లించారు.

భోర్ ఘాట్ సెక్షన్‌లోని మూడు రైల్వే ట్రాక్‌లు, ముంబై వైపు వెళ్లే అప్ లైన్, పుణే వైపు వెళ్లే డౌన్ లైన్, మిడిల్ లైన్ పూర్తిగా దెబ్బ‌తిన్నాయ‌ని సెంట్ర‌ల్ రైల్వే చీఫ్ ప‌బ్లిక్ రిలేష‌న్స్ ఆఫీస‌ర్ స్వ‌ప్నిల్ నీలా తెలిపారు. ప్రస్తుతం దెబ్బ‌తిన్న‌ రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ పనులు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న శ‌ర‌వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు రైళ్ల సమాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు చూసుకోవాల‌ని సూచించారు. ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్స్​లో ప్రత్యేక హెల్ప్‌లైన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు.

ఐఎండీ హెచ్చ‌రిక‌లు.. పాఠ‌శాల‌ల‌కు సెల‌వు

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో భార‌త వాతావ‌ర‌ణ శాఖ (IMD) కీల‌క హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ముంబై, పూణె, థాణె, రాయగ‌ఢ్‌, నవీ ముంబై జిల్లాలకు రెడ్‌ అల‌ర్ట్ ఇచ్చింది. పాల్ఘర్ జిల్లాకు ఆరెంజ్ అల‌ర్ట్ ఇచ్చింది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంట‌కు 70-80 కిలోమీట‌ర్ల వేగంతో బ‌ల‌మైన ఈదురు గాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేసింది. ఐఎండీ హెచ్చ‌రిక‌ల‌తో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు నేడు పాఠ‌శాల‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు. ఇక ఈ వ‌ర్షాల కార‌ణంగా జ‌రిగిన వేర్వేరు ప్ర‌మాదాల్లో ఇప్ప‌టి వ‌ర‌కూ 10 మందికిపైగా మ‌ర‌ణించారు.

Also Read..

మెక్సికోపై ఇంగ్లండ్ విజ‌యం

సెబీ కీలక నిర్ణయం.. ఓపెన్ మార్కెట్ షేర్ బైబ్యాక్‌లకు మళ్లీ గ్రీన్ సిగ్నల్..

స్టాక్ మార్కెట్లలో జోష్.. సెన్సెక్స్ 367 పాయింట్లు జంప్, నిఫ్టీ పరుగులు..

Advertisement
Advertisement