త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | ‘ఇండియా ఫస్ట్’ నినాదంతో ముందుకు సాగాలి.. పరిశ్రమలకు ప్రధాని మోదీ పిలుపు

PM Modi | రాబోయే 20 ఏళ్ల దీర్ఘకాలిక పెట్టుబడి నిర్ణయాల్లో 'ఇండియా ఫస్ట్' విధానాన్ని పునాదిగా చేసుకోవాలని పరిశ్రమల‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న ఉత్పత్తులను రూపొందించాలని (build products the world wants), తద్వారా భారతీయ ఉత్పత్తులను దేశ గుర్తింపులో కీలక భాగంగా నిలపాలని ఆయన కోరారు.

D

National | Published On Nov 19, 2026, 2.48 pm IST

PM Modi | ‘ఇండియా ఫస్ట్’ నినాదంతో ముందుకు సాగాలి.. పరిశ్రమలకు ప్రధాని మోదీ పిలుపు
Advertisement
  • ప్రపంచానికి ఏమి అందించగలమో చూడాలి
  • అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న ఉత్పత్తులను రూపొందించాలి
  • గ‌త లోపాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ నిరంత‌రం మెరుగుప‌డాలి
  • వికసిత భారత్ లక్ష్య సాధ‌న‌కు పరిశ్రమల పాత్ర అత్యంత కీలకం

PM Modi | త్రినేత్ర న్యూస్ : స్వయం సమృద్ధి వైపు పయనిస్తున్న వేళ.. భారతీయ పరిశ్రమలు తమ వ్యాపార వ్యూహాలకు 'ఇండియా ఫస్ట్' సూత్రాన్ని (India First principle) మూలంగా చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పిలుపునిచ్చారు. దేశీయ మార్కెట్లకే పరిమితం కాకుండా, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న ఉత్పత్తులను రూపొందించాలని, తద్వారా భారతీయ ఉత్పత్తులను దేశ గుర్తింపులో కీలక భాగంగా నిలపాలని ఆయన కోరారు.

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) వార్షిక సర్వసభ్య సమావేశ ప్రారంభోత్సవంలో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. "కేవలం దేశీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా.. ప్రపంచ అవసరాలను తీర్చడానికి పరిశ్రమలు సిద్ధం కావాలి. మనం ప్రపంచానికి ఏమి అందించగలమో చూడాలి. విదేశాల్లో డిమాండ్ ఉన్న ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించాలి. అప్పుడే భారత ఉత్పత్తులు మన గుర్తింపులో ప్రధాన భాగమవుతాయి. ఈ విధంగా ముందుకు సాగే క్రమంలో 'ఇండియా ఫస్ట్' మీ సూత్రం కావాలి. రాబోయే 20 ఏళ్ల దీర్ఘకాలిక పెట్టుబడి నిర్ణయాల్లో 'ఇండియా ఫస్ట్' విధానాన్ని పునాదిగా చేసుకోవాలి. అలా చేసినప్పుడే భారత్ 'ఆత్మనిర్భర్' గా మారుతుంది" అని ప్ర‌ధాని సూచించారు.

గత 100 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు

ఈ సంద‌ర్భంగా గ‌త శ‌తాబ్ద కాలంలో భార‌త్ ఆర్థిక ప్ర‌యాణాన్ని ప్ర‌ధాని ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించారు. స్వాతంత్య్రం తర్వాత దశాబ్దాల పాటు అమలైన లైసెన్స్-కోటా రాజ్, బ్యాంకులు, ఇతర రంగాల జాతీయీకరణ విఫల ప్రయోగాల వల్ల దేశ ఆర్థిక ప్రగతి కుంటుపడిందని ప్రధాని పేర్కొన్నారు. "గత 100 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ అనేక ఒడిదుడుకులను చూసింది. మనం లైసెన్స్ కోటా రాజ్‌ను చూశాం. ఒక దశలో ప్రపంచ 'ఫ్రాజైల్ ఫైవ్'లో చేరే స్థాయికి పడిపోయాం. కానీ, ఆ పరిస్థితులను దాటుకుని భారత్ ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. సుమారు 7% వృద్ధి రేటును కొనసాగించే దిశగా పయనిస్తోంది. అదే సమయంలో పేదరికం నుంచి (Poverty) బయటపడే వేగం కూడా అద్భుతంగా ఉంది" అని ప్ర‌ధాని వివ‌రించారు.

పేదరిక నిర్మూలన

ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం గత 12-13 ఏళ్లలో భారత్‌లో సుమారు 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధాని గుర్తుచేశారు. 1970లలో పేదరిక నిర్మూలన ప్రధాన రాజకీయ నినాదంగా ఉన్నప్పటికీ, అప్పట్లో జనాభా తక్కువగా ఉన్నా తగినంత పురోగతి సాధించలేకపోయామని చెప్పారు. "70వ దశకంలో పేదరిక నిర్మూలన ప్రధాన నినాదంగా ఉన్నప్పుడు దేశ జనాభా కేవలం 70 కోట్లే. అప్పుడే పేదరికాన్ని నిర్మూలించగలిగేవారు. సరైన విధానాలు లేక పేదరికం తగ్గలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వ చిత్తశుద్ధితో మార్పు సాధ్యమైంది." అని వివరించారు.

పరిశ్రమల పాత్ర అత్యంత కీలకం

2047 నాటికి 'వికసిత భారత్' లక్ష్యాన్ని చేరుకోవడంలో పరిశ్రమల పాత్ర అత్యంత కీలకమని ప్ర‌ధాని స్పష్టం చేశారు. తన 100 ఏళ్ల ప్రయాణంలో FICCI ద్వారా భారత పరిశ్రమలు ఎన్నో మైలురాళ్లు సాధించాయ‌ని చెప్పారు. రాబోయే 10 నుంచి 20 ఏళ్లలో వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా మరింత పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవాలని పిలుపునిచ్చారు. గ‌త లోపాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ నిరంత‌రం మెరుగుప‌డాల‌ని పరిశ్ర‌మ‌ల నేత‌ల‌కు పిలుపునిచ్చారు. "మన తప్పుల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. నిరంతరం మరింత మెరుగ్గా మారడానికి కృషి చేయాలి. నిజాయతీతో కూడిన ఆత్మపరిశీలనతోనే తదుపరి ముందడుగు మొదలవుతుంది" అని ప్రధాని త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

Also Read..

భార‌త్ స‌మ్మిట్‌లో ఓట్ చోరీ నినాదంపై పిల్‌.. విచార‌ణ‌కు సుప్రీం ఓకే

బంగ్లాదేశ్‌లో అల్ల‌ర్లు.. యూన‌స్ ఇంటికి నిప్పు

మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబ‌డిదారుల‌కు అల‌ర్ట్‌.. భారీగా నిధుల ఉప‌సంహ‌ర‌ణ‌.. కార‌ణాలేమిటి..?

Advertisement
Advertisement