త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్‌.. హైదరాబాద్‌ నుంచి ఐఆర్‌సీటీసీ స్పెష‌ల్‌ ప్యాకేజీ

IRCTC Tour | చలికాలంలో ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. హైదరాబాద్‌ నుంచి తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన ఊటీ, కూనూర్‌ సందర్శనకు ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని ప్రకటించింది. ‘ULTIMATE OOTY EX HYDERABAD (SHR094)’ పేరుతో రూపొందించిన ఈ ప్యాకేజీలో ఐదు రాత్రులు, ఆరు రోజుల పాటు పర్యటించే అవకాశం కల్పిస్తోంది.

P

Tourism | Published On Nov 21, 2026, 1.30 pm IST

IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్‌.. హైదరాబాద్‌ నుంచి ఐఆర్‌సీటీసీ స్పెష‌ల్‌ ప్యాకేజీ
Advertisement

IRCTC Tour | చలికాలంలో ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. హైదరాబాద్‌ నుంచి తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన ఊటీ, కూనూర్‌ సందర్శనకు ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని ప్రకటించింది. ‘ULTIMATE OOTY EX HYDERABAD (SHR094)’ పేరుతో రూపొందించిన ఈ ప్యాకేజీలో ఐదు రాత్రులు, ఆరు రోజుల పాటు పర్యటించే అవకాశం కల్పిస్తోంది. రైలు ప్రయాణం, హోటల్‌ వసతి, అల్పాహారం, పర్యాటక ప్రాంతాల సందర్శన వంటి సదుపాయాలతో ఈ యాత్రను రూపొందించింది. ముఖ్యంగా శీతాకాలంలో నీలగిరి కొండల అందాలు, పచ్చని తేయాకు తోటలు, చల్లని వాతావరణం, పొగమంచు తెరల మధ్య సాగే ఊటీ ప్రయాణం పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించనుంది. ప్రతి మంగళవారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.

కనువిందు చేసే ప్రకృతి అందాలు

శీతాకాలంలో ఊటీ పర్యటనకు ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. నీలగిరి పర్వత ప్రాంతంలో ఉండే చల్లని వాతావరణం, ఉదయం వేళల్లో కొండలను కమ్మేసే పొగమంచు, పచ్చదనంతో నిండిన ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. తేయాకు తోటల మధ్య నుంచి సాగే ప్రయాణం, లోయల అందాలు, జలపాతాల హోరు, సరస్సుల పరిసరాల్లోని ప్రశాంతత పర్యటనకు మరింత ప్రత్యేకతను తీసుకొస్తాయి. నగరాల రద్దీకి దూరంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి కొద్ది రోజులు ప్రకృతి ఒడిలో గడపాలనుకునే వారికి ఈ యాత్ర మంచి అవకాశం. ముఖ్యంగా డిసెంబర్‌లో క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకల సెలవులను పురస్కరించుకుని ఊటీ వెళ్లాలనుకునే వారు ఈ ప్యాకేజీని పరిశీలించవచ్చు.

సికింద్రాబాద్‌ నుంచి ప్రయాణం.. కోయంబత్తూరు మీదుగా ఊటీకి

  • ఈ పర్యటన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రారంభమవుతుంది. 20629 నంబర్‌ సబరి ఎక్స్‌ప్రెస్‌లో మ‌ధ్యాహ్నం 2.25 గంట‌ల‌కు కోయంబత్తూరుకు బయలుదేరాలి. రెండో రోజు ఉదయం సుమారు 9.10 గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సుమారు 90 కిలోమీటర్ల దూరంలోని ఊటీకి తీసుకెళ్తారు. హోటల్‌లో బస ఏర్పాటు చేసిన అనంతరం స్థానిక పర్యాటక ప్రాంతాల సందర్శన ప్రారంభమవుతుంది. మొదటిరోజు రైలు ప్రయాణంతో గడుస్తుంది.
  • రెండో రోజు ఊటీ చేరుకున్న అనంతరం బొటానికల్‌ గార్డెన్స్‌, ఊటీ సరస్సును సందర్శిస్తారు. పచ్చని చెట్లు, అందమైన పూల మొక్కలతో విరాజిల్లే బొటానికల్‌ గార్డెన్స్‌ ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుంది. అనంతరం ఊటీ సరస్సు పరిసరాల్లో విహరించే అవకాశం ఉంటుంది. రాత్రి ఊటీలోనే బస చేస్తారు.
  • మూడో రోజు ఉదయం అల్పాహారం అనంతరం డొడ్డబెట్ట శిఖరం, టీ మ్యూజియం, పైకారా జలపాతాలను సందర్శిస్తారు. నీలగిరి పర్వత ప్రాంతంలోని ఎత్తయిన ప్రదేశాల్లో ఒకటైన డొడ్డబెట్ట శిఖరం నుంచి చుట్టుపక్కల కొండలు, లోయల అందాలను వీక్షించవచ్చు. టీ మ్యూజియంలో తేయాకు సాగు, తయారీకి సంబంధించిన విశేషాలను తెలుసుకోవచ్చు. ఇక పైకారా జలపాతం ప్రకృతి సోయగాలను ఆస్వాదించేందుకు అనువైన ప్రదేశం. ఈ ప్రాంతాల సందర్శన అనంతరం రాత్రి ఊటీలో బస చేస్తారు.
  • నాలుగో రోజు కూనూర్‌ పర్యటన ఉంటుంది. తేయాకు తోటలు, పచ్చని కొండలు, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన కూనూర్‌ పర్యాటకులను ఆకర్షిస్తుంది. చల్లని వాతావరణంలో కొండ ప్రాంతాల అందాలను ఆస్వాదిస్తూ ఈ ప్రాంతంలో పర్యటించవచ్చు. అనంతరం తిరిగి ఊటీకి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.
  • ఐదో రోజు ఉదయం అల్పాహారం చేసిన అనంతరం మధ్యాహ్నం 12 గంటలలోపు హోటల్‌ నుంచి చెక్‌అవుట్‌ చేయాలి. అక్కడి నుంచి కోయంబత్తూరు రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. సాయంత్రం 3.40 గంటలకు బయలుదేరే 20630 నంబర్‌ సబరి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఆరో రోజు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో ఆరు రోజుల పర్యటన ముగుస్తుంది.

స్లీపర్‌, థర్డ్‌ ఏసీ సదుపాయాలు

పర్యాటకుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే రెండు కేటగిరీల్లో ప్యాకేజీని అందిస్తోంది. స్టాండర్డ్‌ కేటగిరీలో స్లీపర్‌ క్లాస్‌ (ఎస్‌ఎల్‌), కంఫర్ట్‌ కేటగిరీలో థర్డ్‌ ఏసీ (3ఏ) ప్రయాణ సదుపాయం ఉంటుంది. ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఒక గదిలో బస చేసే విధానాన్ని బట్టి ప్యాకేజీ ధరలు మారుతాయి. ఐదేళ్ల నుంచి 11 ఏళ్లలోపు చిన్నారులకు బెడ్‌తో, బెడ్‌ లేకుండా వేర్వేరు ధరలు నిర్ణయించారు. సెప్టెంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 15, 2026 వరకు నిర్ణయించిన ధరల ప్రకారం కంఫర్ట్‌ కేటగిరీలో ఒక్కరు ప్రయాణిస్తే రూ.33,590 చెల్లించాలి. ఇద్దరు కలిసి ఒక గదిలో బస చేస్తే ఒక్కొక్కరికి రూ.18,890, ముగ్గురు కలిసి ఉంటే ఒక్కొక్కరికి రూ.17,170 చొప్పున ప్యాకేజీ ధర ఉంటుంది. స్టాండర్డ్‌ కేటగిరీలో సింగిల్‌ షేరింగ్‌కు రూ.31,050, ఇద్దరు కలిసి బస చేస్తే ఒక్కొక్కరికి రూ.16,360, ముగ్గురు కలిసి ఉంటే ఒక్కొక్కరికి రూ.14,630గా నిర్ణయించారు. ఐదేళ్ల నుంచి 11 ఏళ్లలోపు చిన్నారులకు కంఫర్ట్‌ కేటగిరీలో బెడ్‌తో రూ.8,840, బెడ్‌ లేకుండా రూ.6,490 చార్జీ ఉంటుంది. స్టాండర్డ్‌ కేటగిరీలో బెడ్‌తో రూ.6,300, బెడ్‌ లేకుండా రూ.3,950 చెల్లించాలి.

డిసెంబర్‌ ప్రత్యేక ధరలు

క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకల సమయంలో ఊటీ పర్యటనకు వెళ్లాలనుకునేవారి కోసం డిసెంబర్‌ 22, 29 తేదీలకు ప్రత్యేక ధరలను ప్రకటించారు. ఈ తేదీల్లో కంఫర్ట్‌ కేటగిరీలో సింగిల్‌ షేరింగ్‌కు రూ.35,510, ఇద్దరు కలిసి బస చేస్తే ఒక్కొక్కరికి రూ.20,810, ముగ్గురు కలిసి ఉంటే ఒక్కొక్కరికి రూ.19,090 చెల్లించాలి. స్టాండర్డ్‌ కేటగిరీలో ఈ ధరలు వరుసగా రూ.32,970, రూ.18,280, రూ.16,550గా ఉన్నాయి. ఈ ప్రత్యేక తేదీల్లో ఐదేళ్ల నుంచి 11 ఏళ్లలోపు చిన్నారులకు కంఫర్ట్‌ కేటగిరీలో బెడ్‌తో రూ.10,760, బెడ్‌ లేకుండా రూ.8,400, స్టాండర్డ్‌ కేటగిరీలో బెడ్‌తో రూ.8,220, బెడ్‌ లేకుండా రూ.5,870 చొప్పున చెల్లించాలి.

ప్యాకేజీలో మూడు రోజుల అల్పాహారం.. వసతి

ఈ టూర్‌లో భాగంగా ఊటీలో మూడు రాత్రుల పాటు నాన్‌ ఏసీ హోటల్‌ వసతి కల్పిస్తారు. మూడు రోజుల అల్పాహారం, ప్రయాణ బీమా, షెడ్యూల్‌లో పేర్కొన్న పర్యాటక ప్రాంతాల సందర్శన, విహారయాత్రలు ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. టోల్‌ ఛార్జీలు, పార్కింగ్‌ రుసుములు, వర్తించే జీఎస్‌టీ కూడా ప్యాకేజీలోనే చేర్చారు. అయితే బోటింగ్‌, గుర్రపు స్వారీ, ఇతర వినోద కార్యక్రమాలకు అయ్యే ఖర్చులను ప్రయాణికులే భరించాలి. టూర్‌ గైడ్‌ సేవలు, ప్యాకేజీలో ప్రత్యేకంగా పేర్కొనని ఇతర సేవలు ఇందులో ఉండవు.

ప్రయాణికులు నిబంధనలు..

హోటల్‌ గదికి గరిష్ఠంగా ఒక అదనపు వ్యక్తికి మాత్రమే అనుమతి ఉంటుంది. ముగ్గురు షేరింగ్‌ లేదా అదనపు వ్యక్తి విషయంలో నేలపై అదనపు పరుపు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అయితే అదనపు మంచం తప్పనిసరిగా లభిస్తుందని హామీ లేదు. ఇది హోటల్‌ నిబంధనలు, అందుబాటుపై ఆధారపడి ఉంటుంది. 12 ఏళ్లలోపు చిన్నారులకు అదనపు బెడ్‌ అవసరమైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. హోటల్‌లో చెక్‌ఇన్‌ సమయం మధ్యాహ్నం 12 గంటలు కాగా, ముందస్తు చెక్‌ఇన్‌ సదుపాయం అందుబాటును బట్టి ఉంటుంది. ఆన్‌లైన్‌ టికెట్లు ప్రయాణానికి నాలుగు రోజుల ముందు జారీ చేస్తారు. టికెట్‌ జనరేషన్‌ అనంతరం బెర్త్‌ ప్రాధాన్యతలు లేదా మార్పుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోరు. ప్రయాణికులకు రైల్వే నిబంధనల ప్రకారం బెర్త్‌లు కేటాయిస్తారు.

రద్దు చేసుకుంటే ఛార్జీల కోత ఇలా..

అనివార్య కారణాలతో పర్యటన రద్దు చేసుకోవాల్సి వస్తే ఐఆర్‌సీటీసీ నిబంధనల ప్రకారం ఛార్జీలు మినహాయిస్తారు. ప్రయాణ తేదీకి 15 రోజుల కంటే ముందుగా టికెట్‌ రద్దు చేసుకుంటే ఒక్కో ప్రయాణికుడికి రూ.250 చొప్పున కోత విధిస్తారు. ప్రయాణానికి 8 నుంచి 14 రోజుల మధ్య రద్దు చేసుకుంటే ప్యాకేజీ ధరలో 25 శాతం, నాలుగు నుంచి ఏడు రోజుల మధ్య రద్దు చేసుకుంటే 50 శాతం మినహాయిస్తారు. ప్రయాణానికి నాలుగు రోజుల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు రద్దు చేసుకుంటే ప్యాకేజీ ధరలో 100 శాతం కోత విధిస్తారు. టికెట్‌ రద్దు చేసుకోవాలనుకునేవారు ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి, సంబంధిత టూర్‌ కన్ఫర్మేషన్‌ నంబర్‌ను ఎంపిక చేసుకుని ఆన్‌లైన్‌లోనే ప్రక్రియ పూర్తి చేయాలి. పీఆర్‌ఎస్‌ కౌంటర్లలో ఈ ప్యాకేజీ టికెట్ల రద్దుకు అవకాశం లేదు.

ముందస్తు అవగాహన అవసరం

రైళ్ల రాకపోకల్లో ఆలస్యం కారణంగా పర్యటన షెడ్యూల్‌లో పేర్కొన్న ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సేవలు అందుబాటులో లేకపోతే ఐఆర్‌సీటీసీ బాధ్యత వహించదని నిబంధనల్లో స్పష్టం చేసింది. ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేసిన బస్సును ఏదైనా ప్రాంతంలో మిస్‌ అయితే తదుపరి పర్యాటక ప్రాంతానికి ప్రయాణికులే సొంతంగా చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే తమ వ్యక్తిగత వస్తువులు, సామాన్లను ప్రయాణికులే జాగ్రత్తగా చూసుకోవాలి. వస్తువులు పోయినా, దొంగతనానికి గురైనా ఐఆర్‌సీటీసీ బాధ్యత వహించదు.

రిజర్వేషన్‌ అవసరం

ఈ ప్యాకేజీ ప్రతి మంగళవారం అందుబాటులో ఉండగా, సీట్ల కేటాయింపు పరిమితంగా ఉంది. స్లీపర్‌ క్లాస్‌లో 12 సీట్లు, థర్డ్‌ ఏసీలో ఆరు సీట్లు మాత్రమే కేటాయించినట్లు ప్యాకేజీ వివరాల్లో పేర్కొన్నారు. ఊటీ, కూనూర్‌ అందాలను శీతాకాలంలో ఆస్వాదించాలనుకునేవారు ప్రయాణ తేదీలు, సీట్ల లభ్యత, ప్యాకేజీ ధరలు, ఇతర నిబంధనలను ముందుగానే పరిశీలించి రిజర్వేషన్‌ చేసుకోవడం మంచిది. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

Advertisement
Advertisement