త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mutual Funds | మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబ‌డిదారుల‌కు అల‌ర్ట్‌.. భారీగా నిధుల ఉప‌సంహ‌ర‌ణ‌.. కార‌ణాలేమిటి..?

Mutual Funds | భారత స్టాక్ మార్కెట్లకు గత మూడేళ్లుగా అండగా నిలుస్తున్న మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో క్రమంగా బలహీనత కనిపిస్తోందని బెర్న్‌స్టెయిన్ విశ్లేషించింది. అక్టోబర్ లో నికర పెట్టుబడుల ప్రవాహాలు తగ్గగా, నవంబర్ తొలి రెండు వారాల్లో ఈ ధోరణి మరింత స్పష్టమైందని తెలిపింది.

S

Business | Published On Nov 19, 2026, 2.40 pm IST

Mutual Funds | మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబ‌డిదారుల‌కు అల‌ర్ట్‌.. భారీగా నిధుల ఉప‌సంహ‌ర‌ణ‌.. కార‌ణాలేమిటి..?
Advertisement

Mutual Funds | భారత స్టాక్ మార్కెట్లకు గత మూడేళ్లుగా అండగా నిలుస్తున్న మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో క్రమంగా బలహీనత కనిపిస్తోందని బెర్న్‌స్టెయిన్ విశ్లేషించింది. అక్టోబర్ లో నికర పెట్టుబడుల ప్రవాహాలు తగ్గగా, నవంబర్ తొలి రెండు వారాల్లో ఈ ధోరణి మరింత స్పష్టమైందని తెలిపింది. కొత్త పెట్టుబడులు తగ్గడం కంటే, రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్ ర్యాలీ నేపథ్యంలో లాభాలను స్వీకరించేందుకు యూనిట్లను విక్రయించడం దీనికి ప్రధాన కారణమని అంచనా వేసింది.

దేశీయ పెట్టుబ‌డిదారులు నిధుల ఉప‌సంహ‌ర‌ణ‌..

భారత ఈక్విటీ మార్కెట్లకు దేశీయ మదుపరుల నుంచి వస్తున్న మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు గత ఐదేళ్లలో సుమారు 200 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. విదేశీ పెట్టుబడిదారులు అమ్మకాలకు దిగిన సమయంలోనూ దేశీయ మార్కెట్లకు ఈ పెట్టుబడులు అండగా నిలిచాయి. ఈ నిరంతర కొనుగోళ్ల మద్దతును బెర్న్‌స్టెయిన్ మ్యూచువల్ ఫండ్ పుట్ గా అభివర్ణించింది. అయితే అక్టోబర్ లో మ్యూచువల్ ఫండ్లలో నికర పెట్టుబడుల ప్రవాహాలు బలహీనపడగా, నవంబర్ తొలి అర్ధభాగంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు విశ్లేషకులు మనస్ అగర్వాల్, హిమాంక్ సంగై వెల్లడించారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (ఎస్ఐపీ) ద్వారా వచ్చే పెట్టుబడులు గణనీయంగా కొనసాగుతున్నందున కొత్త పెట్టుబడులు ఒక్కసారిగా తగ్గాయని భావించడం లేదని, పెట్టుబడిదారులు తమ యూనిట్లను వెనక్కి తీసుకోవడం (రిడెంప్షన్స్) పెరగడమే ప్రధాన కారణమని అంచనా వేశారు. గత కొన్ని నెలలుగా లార్జ్ క్యాప్, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ పథకాలలో ఈ విక్రయాల ఒత్తిడి కనిపిస్తోందని, ఇటీవలి మార్కెట్ రికవరీ సమయంలోనూ లాభాల స్వీకరణ కొనసాగినట్లు తెలిపారు.

మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ ఫండ్ల‌లోనూ మంద‌గ‌మ‌నం..

చిన్న, మధ్య తరహా కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్లలోనూ పెట్టుబడుల ప్రవాహం మందగించిందని బెర్న్‌స్టెయిన్ పేర్కొంది. గత నెలలో మార్జిన్ ట్రేడింగ్ పొజిషన్లను తగ్గించడం కూడా దీనికి కొంత కారణమై ఉంటుంద‌ని తెలిపింది. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల ప్రవాహాలు దీర్ఘకాలం పాటు బలహీనంగా కొనసాగితే అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (ఏఎంసీలు), వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థలు, డిపాజిటరీలు, రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్లు (ఆర్టీఏలు) ప్రభావితమయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇటీవలి మార్కెట్ రికవరీలో ఏఎంసీ షేర్లు మంచి పనితీరు కనబరిచి, వాటి విలువలు గత స్థాయిలకు చేరుకున్నప్పటికీ, పెట్టుబడుల ప్రవాహం తగ్గితే ఈ రంగంలోని కంపెనీలపై ఇన్వెస్టర్లు తమ అంచనాలను పునఃసమీక్షించవచ్చని అభిప్రాయపడింది.

మ్యూచువల్ ఫండ్ మార్కెట్ వాటాపై తక్కువగా ఆధారపడే సంస్థలు, అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టే స్థిరమైన మదుపరులకు సేవలందించే సంస్థలు మెరుగైన స్థితిలో ఉంటాయ‌ని పేర్కొంది. డిస్ట్రిబ్యూటర్ల వ్యాపారం కూడా ఇతర ఏఎంసీల మార్కెట్ వాటా, పెట్టుబడుల పనితీరుపై తక్కువగా ఆధారపడడం వల్ల వారికి కొంత ప్రయోజనం ఉంటుందని తెలిపింది. ఈ పరిణామాలు ఐపీఓలు, ప్రమోటర్లు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థల వాటాల విక్రయాలపైనా ప్రభావం చూపిస్తాయ‌ని విశ్లేషించింది.

పెట్టుబ‌డుద‌ల త‌గ్గుద‌ల ఎక్కువ‌గానే..?

నవంబర్ నెలకు సంబంధించి ప్రాథమిక పెట్టుబడుల అంచనాలపై వెంటనే నిర్ణయానికి రావద్దని బెర్న్‌స్టెయిన్ సూచించింది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) విడుదల చేసిన ఆస్తుల నిర్వహణ విలువ (ఏయూఎం) గణాంకాల్లో కొన్ని అసాధారణ మార్పులు కనిపించాయని తెలిపింది. పథకాల వారీగా ఏయూఎం మార్పులు, నెట్ అసెట్ వాల్యూ (ఎన్ఏవీ) మార్పులను పోల్చి నికర పెట్టుబడులు, ఉపసంహరణలను అంచనా వేస్తామని వివరించింది. అయితే ఇటీవలి రోజుల్లో ఏయూఎం గణాంకాల్లో అసమానతల కారణంగా వాస్తవానికి ఉన్నదానికంటే పెట్టుబడుల తగ్గుదల ఎక్కువగా కనిపించి ఉంటుంద‌ని పేర్కొంది. పరిశ్రమ వర్గాలతో జరిపిన చర్చల్లో పెట్టుబడుల ప్రవాహం మందగించినట్లు నిర్ధారణ అయినప్పటికీ, గణాంకాలు చూపిస్తున్నంత తీవ్రంగా పరిస్థితి లేదని తెలిపింది.

పెరుగుతున్న ఖ‌ర్చులే కార‌ణ‌మా..?

పండుగల సీజన్‌లో ఖర్చులు పెరగడం కూడా మ్యూచువల్ ఫండ్ యూనిట్ల ఉపసంహరణలకు కారణమై ఉంటుంద‌ని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో నవంబర్ నెల గణాంకాలను మరింత నిశితంగా పరిశీలించిన తర్వాతే పెట్టుబడిదారుల ప్రవర్తనలో ఇది దీర్ఘకాలిక మార్పునకు సంకేతమా కాదా అన్నది తేలుస్తామని వెల్లడించింది. కాగా, అసెట్ మేనేజ్‌మెంట్, వెల్త్ మేనేజ్‌మెంట్ రంగాల్లో హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్, నిప్పాన్ లైఫ్ ఇండియా ఏఎంసీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ, 360 వన్ వెల్త్, నువామా వెల్త్ మేనేజ్‌మెంట్ షేర్లకు బెర్న్‌స్టెయిన్ అవుట్‌పెర్ఫామ్ రేటింగ్ కొనసాగించింది. ఆనంద్ రాఠీ వెల్త్‌కు మాత్రం మార్కెట్ పర్ఫార్మ్ రేటింగ్ ఇచ్చింది.

Advertisement
Advertisement