త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Asaduddin Owaisi | నెహ్రూ నుంచి మోదీ వ‌ర‌కూ.. అన్ని ప్ర‌భుత్వాలూ ముస్లింల‌ను ఓటు బ్యాంకుగానే చూశాయి : ఒవైసీ

Asaduddin Owaisi | దేశంలో ముస్లింల‌ను (Muslims) కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారే తప్ప, వారిని సమాన రాజకీయ భాగస్వాములుగా చూడటం లేద‌ని ఏఐఎంఐఎం (AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) విమ‌ర్శించారు. ఏ రాజకీయ పార్టీ కూడా ముస్లింలకు స్వతంత్ర రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలని కోరుకోవడం లేద‌న్నారు.

D

National | Published On Sep 29, 2026, 4.04 pm IST

Asaduddin Owaisi | నెహ్రూ నుంచి మోదీ వ‌ర‌కూ.. అన్ని ప్ర‌భుత్వాలూ ముస్లింల‌ను ఓటు బ్యాంకుగానే చూశాయి : ఒవైసీ
Advertisement

Asaduddin Owaisi | త్రినేత్ర న్యూస్ : ఏఐఎంఐఎం (AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ముస్లింల‌ను (Muslims) కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారే తప్ప, వారిని సమాన రాజకీయ భాగస్వాములుగా చూడటం లేద‌ని విమ‌ర్శించారు. ఏ రాజకీయ పార్టీ కూడా ముస్లింలకు స్వతంత్ర రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలని కోరుకోవడం లేద‌న్నారు. తమను తాము లౌకికవాదులుగా చెప్పుకునే పార్టీలకు కూడా మైనారిటీల పక్షాన నిలబడి, వారికి రాజకీయంగా సాధికారత కల్పించే 'మేధోపరమైన నిజాయితీ' కొరవడిందని ఆరోపించారు.

కేరళలోని కొచ్చిలో జరిగిన 'ఇండియా టుడే కాన్‌క్లేవ్ సౌత్' కార్యక్రమంలో ఒవైసీ పాల్గొని మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీల‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ముస్లింలకు అర్థవంతమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో బీజేపీ, కాంగ్రెస్ రెండూ విఫలమయ్యాయని ఆరోపించారు. "భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరునికి సమానత్వం, ప్రాథమిక హక్కులు, లౌకిక విలువలను అందించింది. కానీ భారతదేశాన్ని పాలించిన పార్టీలు మమ్మల్ని రాజకీయంగా పూర్తిగా అణచివేశాయి. మా అధికారాలను హరించాయి. మా ఎదుగుదలను అడ్డుకున్నాయి. మాకు రాజకీయ న్యాయాన్ని నిరాకరించాయి" అని ఒవైసీ ఆరోపించారు.

ముస్లింల రాజకీయ అణచివేత సమస్యకు ఏ ఒక్క ప్రభుత్వాన్ని లేదా పార్టీని నిందించ‌లేమ‌ని అన్నారు. వరుస ప్రభుత్వాలు త‌మ‌ వర్గానికి సరైన ప్రాతినిధ్యం కల్పించడంలో విఫలమయ్యాయని చెప్పారు. జవహర్‌లాల్ నెహ్రూ కాలం నుంచి నేటి నరేంద్ర మోదీ ప్రభుత్వం వరకూ ఏ ప్ర‌భుత్వ‌మూ కూడా ముస్లింలకు తగిన రాజకీయ న్యాయం చేయలేద‌న్నారు. వారిని కేవలం ఓటర్లుగా మాత్ర‌మే ప‌రిమితం చేశాయ‌ని ఆరోపించారు. ముస్లింలకు బలమైన స్వతంత్ర రాజకీయ ప్ర‌త్యామ్నాయం లేకపోవడం వల్లే వారు దశాబ్దాలుగా కాంగ్రెస్ వంటి ఇత‌ర పార్టీలకు ఓటు వేయాల్సి వ‌స్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

దేశంలో 18 కోట్ల మంది ముస్లిం జ‌నాభా ఉంటే.. పార్లమెంటులో వారి ప్రాతినిధ్యం కేవలం 4 శాతానికే పరిమితమైంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇది మ‌న ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌పై అనేక ప్ర‌శ్న‌ల‌ను లేవ‌నెత్తుతోంద‌న్నారు. దేశంలో బ్రాహ్మణులు, ఠాకూర్లు, నాయర్లు, దళితులకు తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి సొంత నాయకత్వం, వేదికలు ఉన్నాయని.. కానీ ముస్లింలకు మాత్రం అటువంటి స్వతంత్ర రాజకీయ వేదిక లేకుండా చేశార‌ని మండిప‌డ్డారు. సెక్యుల‌ర్ పార్టీలు ముస్లింల ఓట్లు కావాలి.. కానీ, వారికి స్వ‌తంత్ర నాయ‌క‌త్వం ఉండ‌కూడ‌ద‌నేలా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని దుయ్య‌బ‌ట్టారు. రాజ‌కీయ న్యాయం ల‌భించ‌నంత కాలం ముస్లింల‌కు సామాజిక‌, ఆర్థిక న్యాయం సాధ్యం కాదని ఒవైసీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

Also Read..

భారత్-అమెరికా సంబంధాల్లో ఉగ్ర‌వాదం కీల‌క అంశం : జైశంకర్

సిరిసిల్ల‌కు త‌ర‌లిరండి.. సీఎం స‌భ‌ను స‌క్సెస్ చేయండి

ముడి చ‌మురు ధ‌ర‌ల సెగ‌.. న‌ష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Advertisement
Advertisement