త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!

Pushpayagam 2026 | సుగంధభరిత పుష్పాలు.. రంగురంగుల పూలమాలలు.. పవిత్ర పత్రాలతో కలియుగ దైవం వేంకటేశ్వరస్వామికి విశేష పుష్పార్చన నిర్వహించనున్నారు. ఏడాది పొడవునా శ్రీవారి ఆలయంలో నిర్వహించే నిత్య, వార, మాస, వార్షిక ఉత్సవాల్లో తెలిసీ తెలియక జరిగిన దోషాలకు పరిహారంగా పుష్పయాగ మహోత్సవాన్ని వైభవంగా చేపట్టనున్నారు.

P

Devotional | Published On Nov 15, 2026, 8.03 am IST

Pushpayagam 2026 | పుష్పాలతో శ్రీవారికి అపురూప అర్చన.. పుష్పయాగం వెనుక అసలు విశిష్టత ఇదే!
Advertisement

Pushpayagam 2026 | సుగంధభరిత పుష్పాలు.. రంగురంగుల పూలమాలలు.. పవిత్ర పత్రాలతో కలియుగ దైవం వేంకటేశ్వరస్వామికి విశేష పుష్పార్చన నిర్వహించనున్నారు. ఏడాది పొడవునా శ్రీవారి ఆలయంలో నిర్వహించే నిత్య, వార, మాస, వార్షిక ఉత్సవాల్లో తెలిసీ తెలియక జరిగిన దోషాలకు పరిహారంగా పుష్పయాగ మహోత్సవాన్ని వైభవంగా చేపట్టనున్నారు. వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం నిర్వహించే ఈ విశిష్ట వైదిక క్రతువులో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారికి వివిధ రకాల పుష్పాలు, పవిత్ర పత్రాలతో అర్చన చేస్తారు. లోకకల్యాణం, సకాలంలో వర్షాలు, ప్రజల సుఖసంతోషాలు, సకల జీవరాశుల శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ఈ వేడుకను నిర్వహించడం విశేషం. పుష్పాలతో స్వామివారిని అర్చించే ఈ మహోత్సవం తిరుమల ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది.

దోష పరిహారానికి పుష్పయాగం..

తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశిష్ట వైదిక ఉత్సవాల్లో పుష్పయాగానికి ప్రత్యేక స్థానం ఉంది. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే నిత్య పూజలు, ఉత్సవాలు, బ్రహ్మోత్సవాల సమయంలో తెలిసీ తెలియక జరిగిన లోపాలు, దోషాల నివారణ కోసం ఈ యాగాన్ని నిర్వహిస్తారు. కేవలం పుష్పాలతో స్వామివారిని అలంకరించే వేడుకగానే కాకుండా.. పుష్పాలను భగవంతుడికి సమర్పిస్తూ లోకక్షేమాన్ని ఆకాంక్షించే పవిత్ర క్రతువుగా దీనికి గుర్తింపు ఉంది. సకాలంలో వర్షాలు కురవాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ పుష్పయాగాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.

15వ శతాబ్దం నుంచే పుష్పయాగ సంప్రదాయం

తిరుమలలో పుష్పయాగానికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. చారిత్రక ఆధారాల ప్రకారం 15వ శతాబ్దం నుంచే ఈ ఉత్సవం నిర్వహణలో ఉన్నట్లు తెలుస్తోంది. పూర్వం వార్షిక బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం జరిగిన ఏడో రోజున స్వామివారికి పుష్పయాగం నిర్వహించేవారు. కొన్ని కారణాలతో మధ్యలో ఈ ఉత్సవం నిలిచిపోయింది. అనంతరం టీటీడీ 1980 నవంబర్‌ 14న పుష్పయాగ మహోత్సవాన్ని పునరుద్ధరించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం సందర్భంగా ఈ వేడుకను నిర్వహిస్తూ వస్తోంది.

పాలు, పెరుగు, తేనెతో స్నపన తిరుమంజనం

పుష్పయాగంలో భాగంగా ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర పవిత్ర ద్రవ్యాలతో స్వామివారికి విశేష అభిషేకం చేస్తారు. అనంతరం వివిధ రకాల పుష్పాలు, పవిత్ర పత్రాలతో పుష్పార్చన చేపడతారు. మల్లె, సంపెంగ, తామర, లిల్లీ, చామంతి వంటి సుగంధభరిత పుష్పాలతోపాటు తులసి, మారేడు వంటి పవిత్ర పత్రాలను స్వామివారికి సమర్పిస్తారు. పలు రంగులు, రకాల పుష్పాలతో జరిగే ఈ అర్చన పుష్పయాగంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ప్రతి ఏడాది సమర్పించే పుష్పాల రకాలు, పరిమాణం మారుతూ ఉంటాయి.

మాడ వీధుల్లో మలయప్పస్వామివారి విహారం

పుష్పయాగ మహోత్సవం ముగిసిన అనంతరం స్వామివారికి సహస్రదీపాలంకార సేవ నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు తిరుమల ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. పుష్పార్చన స్వీకరించిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.

నేడు అంకురార్పణ.. రేపు పుష్పయాగం

ఈ విశిష్ట మహోత్సవానికి నేడు అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది. ఆదివారం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణ క్ర‌తువు కొన‌సాగుతుంది. వైదిక సంప్రదాయం ప్రకారం ముఖ్యమైన యాగాలు, ఉత్సవాలకు ముందు అంకురార్పణ చేపడతారు. ఉత్సవం నిర్విఘ్నంగా పూర్తికావాలని భగవంతుడిని ప్రార్థిస్తూ సంకల్పం చేస్తారు. 16న శ్రీవారి ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం పూర్తయిన తర్వాత ఉత్సవమూర్తులను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ స్నపన తిరుమంజనం నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం జరుగుతుంది.

మూడు ఆర్జిత సేవలు రద్దు

పుష్పయాగ మహోత్సవం నేపథ్యంలో నవంబర్‌ 16న తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది. ప్రత్యేక వైదిక కార్యక్రమాలు, ఉత్సవ ఏర్పాట్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ రోజు తిరుమలకు వెళ్లే భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది.

Advertisement
Advertisement