త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nariman House | యూదులే ల‌క్ష్యంగా నారిమ‌న్ హౌస్ వ‌ద్ద రెక్కీ.. 20 ఏండ్ల యువ‌కుడు అరెస్ట్‌

Nariman House | దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో (Mumbai) యూదులే ల‌క్ష్యంగా ఉగ్రకుట్ర‌ను ముంబై పోలీసులు భ‌గ్నం చేశారు. కొలాబాలో ఉన్న యూదు మత కేంద్రం నారిమ‌న్ హౌస్ (Nariman House) సహా పలు సున్నితమైన ప్రాంతాల్లో రెక్కీ (Recce) నిర్వహించిన 20 ఏండ్ల‌ యువకుడిని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) పోలీసులు అరెస్టు చేశారు.

G

National | Published On Nov 15, 2026, 8.00 am IST

Nariman House | యూదులే ల‌క్ష్యంగా నారిమ‌న్ హౌస్ వ‌ద్ద రెక్కీ.. 20 ఏండ్ల యువ‌కుడు అరెస్ట్‌
Advertisement

Nariman House | త్రినేత్ర న్యూస్‌: దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో (Mumbai) యూదులే ల‌క్ష్యంగా ఉగ్రకుట్ర‌ను ముంబై పోలీసులు భ‌గ్నం చేశారు. కొలాబాలో ఉన్న యూదు మత కేంద్రం నారిమ‌న్ హౌస్ (Nariman House) సహా పలు సున్నితమైన ప్రాంతాల్లో రెక్కీ (Recce) నిర్వహించిన 20 ఏండ్ల‌ యువకుడిని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని న‌వీ ముంబైలోని ఐరోలికి చెందిన య‌శ్ సింగ్‌గా గుర్తించారు. 2008 న‌వంబ‌ర్ 26 నుంచి 28 వ‌ర‌కు (26/11) సాగిన ఉగ్రదాడుల్లో (Mumbai terror attacks) టెర్ర‌రిస్టులు లక్ష్యంగా చేసుకున్న ప్రధాన ప్రదేశాల్లో నారిమ‌న్ హౌస్ ఒకటి. పాకిస్థాన్ కేంద్రంగా ప‌నిచేస్తున్న ల‌ష్క‌ర్-ఏ-తోయిబా (LeT) ఉగ్ర‌సంస్థ చేసిన‌ ఈ దాడుల్లో 166 మంది మ‌ర‌ణించ‌గా, 300 మందికిపైగా గాయ‌ప‌డ్డారు.

అంతర్జాతీయ క్రైం నెట్‌వర్క్‌తో సంబంధాలు

కాగా, విదేశీ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు పనిచేస్తున్న య‌శ్ సింగ్.. మ‌హాన‌గ‌రంలోని యూదు పౌరులు (Jewish Religious), విదేశీయులు, వారి వ్యాపారాలకు సంబంధించిన ఫోటోలు, వాహనాల వివరాలు, కచ్చితమైన లొకేషన్ సమాచారాన్ని సేకరించి తన కాంటాక్ట్స్‌కు పంపిస్తున్నాడ‌ని పోలీసులు తెలిపారు. అంతర్జాతీయ క్రైం నెట్‌వర్క్‌లతో సంబంధాలు ఉన్నాయనే సమాచారంతో ATS పోలీసులు అత‌డిని అరెస్టు చేశారు. విచారణలో భాగంగా కేరళలోని త్రిసూర్‌లో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద నమోదైన ఒక కేసుతో కూడా య‌శ్‌కు సంబంధం ఉన్నట్లు గుర్తించారు.

ముంబైలోని సున్నితమైన ప్రాంతాలు, ముఖ్యంగా కొలాబాలోని నారిమన్ హౌస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి రెక్కీ నిర్వహించాలని సింగ్‌కు ఆదేశాలు అందినట్లు తెలిపారు. అదేవిధంగా యూదు పౌరులు, వారి సంస్థలు, న‌గ‌రంలో ఉంటున్న విదేశీయుల ఫోటోలు, వాహనాల వివరాలు, భౌగోళిక సమాచారాన్ని సేకరించాలని నిందితుడికి సూచించార‌ని వెల్ల‌డించారు.

నారిమన్ హౌస్ ఎందుకు టార్గెట్‌?

2008 నవంబర్‌లో LeTకి చెందిన 10 మంది ఉగ్రవాదులు అరేబియా సముద్రం మార్గంలో ముంబైలోకి ప్రవేశించి నగరవ్యాప్తంగా కాల్పులు, బాంబు దాడులకు పాల్పడ్డారు. సముద్ర మార్గంలో వచ్చిన ఉగ్రవాదులు కొలాబాలోని నారిమన్ హౌస్‌కు సమీపంలో ఉన్న ఒక ఫిషింగ్ జెట్టీ వద్ద దిగారు. మూడు రోజుల పాటు సాగిన ఈ మారణహోమంలో కనీసం 166 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 300 మంది గాయపడ్డారు.

తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ (Taj Mahal Palace Hotel), ఒబెరాయ్-ట్రైడెంట్ హోటల్ కాంప్లెక్స్, ఛత్రపతి శివాజీ టెర్మినస్‌తో పాటు నారిమన్ హౌస్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. చాబాద్-లుబావిచ్ యూదు కేంద్రం ఉన్న నారిమన్ హౌస్‌లోకి చొర‌బ‌డిన‌ ఇద్దరు ఉగ్రవాదులు భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కేంద్రం మతగురువు రబ్బీ గావ్రియేల్ హోల్ట్జ్‌బెర్గ్, ఆయన గర్భిణి భార్య రివ్కా సహా మరో ఇద్దరు ఇజ్రాయెలీలు, ఒక అమెరికన్, ఒక మెక్సికన్ (వీరంతా యూదులే), అలాగే భారత భద్రతా సిబ్బంది టెర్ర‌రిస్టుల దాడిలో మ‌ర‌ణించారు.

Advertisement
Advertisement