MK Stalin | తమ్ముడు విజయ్.. మీరు చెప్పింది నిజమే.. పోలీసుల దాష్టీకానికి నా దవడ పగిలింది : ఎంకే స్టాలిన్
MK Stalin | తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay)పై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మాటతీరులో, బాడీ లాంగ్వేజ్‌లో హుందాతనం ఉండాలని హితవుపలికారు. ఎమర్జెన్సీ సమయం నాటి సంగతులను గుర్తు చేస్తూ ఎక్స్ వేదికగా వీడియో రిలీజ్ చేశారు. ఆ సమయంలో తాను జైల్లో చిత్రహింసలకు గురయ్యానని చెప్పారు. తీవ్రమైన పోలీసు దౌర్జన్యాలను ఎదుర్కొన్నానని స్టాలిన్ పేర్కొన్నారు. నాడు జైల్లో పోలీసులు చేసిన దాష్టీకానికి సంబంధించిన గాయాల తాలూకు ఆనవాళ్లు నేటికీ తన శరీరంపై సజీవంగా ఉన్నాయని గుర్తుచేశారు.
MK Stalin | త్రినేత్ర.న్యూస్ : అసెంబ్లీ సమావేశాల వేళ తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. అసెంబ్లీ వేదికగా డీఎంకే కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) చేసిన విమర్శలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా స్టాలిన్‌ను బాడీషేమింగ్ చేయడం చర్చకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే (DMK) అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin) తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ మేరకు సీఎంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మాటతీరులో, బాడీ లాంగ్వేజ్‌లో హుందాతనం ఉండాలని హితవుపలికారు.
మీరు చెప్పింది నిజమే..
అదే సమయంలో ఎమర్జెన్సీ సమయం నాటి సంగతులను గుర్తు చేస్తూ ఎక్స్ వేదికగా వీడియో రిలీజ్ చేశారు. ఆ సమయంలో తాను జైల్లో చిత్రహింసలకు గురయ్యానని చెప్పారు. తీవ్రమైన పోలీసు దౌర్జన్యాలను ఎదుర్కొన్నానని స్టాలిన్ పేర్కొన్నారు. నాడు జైల్లో పోలీసులు చేసిన దాష్టీకానికి సంబంధించిన గాయాల తాలూకు ఆనవాళ్లు నేటికీ తన శరీరంపై సజీవంగా ఉన్నాయని గుర్తుచేశారు. "తమ్ముడు విజయ్.. మీరు చెప్పింది నిజమే. అందులో ఎలాంటి తప్పూ లేదు. జైల్లో నేను ఎన్నో రకాల చిత్రహింసలు అనుభవించాను. పోలీసులు రాత్రిపూట మమ్మల్ని నిద్రపోనిచ్చేవారే కాదు. మమ్మల్ని లాఠీలతో చితకబాదేవారు. బూట్ల కాళ్లతో కిందపడేసి తన్నేవారు. మాపై దాడులు చేయడానికి జీవితఖైదు అనుభవిస్తున్న ఖైదీలను తీసుకొచ్చేవారు. పోలీసుల చిత్రహింసలు తట్టుకోలేక డీఎంకే నేత, మాజీ ఎంపీ చిట్టిబాబు జైల్లోనే ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల దాడిలో నా దవడ ఎముకలు విరిగిపోయాయి. ఆ గాయాల తాలూకు మచ్చలు ఇప్పటికీ నా శరీరంపై అలాగే ఉన్నాయి" అని స్టాలిన్ తెలిపారు.
అణచివేతను ఎదిరించడం కొత్తేమీ కాదు..
అలాగే ఎమర్జెన్సీ కాలం నాటి తన అరెస్టును స్టాలిన్ గుర్తు చేసుకున్నారు. 1976లో ఎమర్జెన్సీని, మీసాను వ్యతిరేకించినందుకు తన తండ్రి కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వాన్ని కేంద్ర రద్దు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ వెంటనే తనను అరెస్ట్ చేయడానికి పోలీసులు గోపాలపురంలోని ఇంటికి వచ్చినట్లు చెప్పారు. అయితే, ఆరోజు తాను ఇంట్లో లేనని స్టాలిన్ వివరించారు. ''నా కొడుకు ప్రచారానికి వెళ్లాడు. రేపు తిరిగి వస్తాడు. రాగానే నేను స్వయంగా మీకు ఫోన్ చేస్తా. అప్పుడు వచ్చి అరెస్ట్ చేసుకోండి'' అని తన తండ్రి పోలీసులకు చెప్పి పంపించారని స్టాలిన్ వెల్లడించారు. ఆ మరసటి రోజే తాను రాగానే పోలీసులను పిలిపించి ఆయనే స్వయంగా తనను అప్పగించారని పేర్కొన్నారు. అణచివేతను ఎదిరించడం, ఆ పోరాటంలో వచ్చే పరిణామాలను భరించడం తమకు కొత్తేమీ కాదని స్టాలిన్ వెల్లడించారు.
చరిత్ర ఎప్పటికీ మారదు
పదవుల కోసం కాకుండా తమిళుల హక్కుల కోసం పోరాడిన చరిత్ర తమదని స్టాలిన్ స్పష్టం చేశారు. చరిత్ర ఎప్పటికీ మారదని చెప్పుకొచ్చారు. శాసనసభ లైబ్రరీలో అన్ని రికార్డులు ఉన్నాయని.. అక్కడికి వెళ్లి నా పోరాట చరిత్ర చదివితే అసలు నిజాలు తెలుస్తాయని స్టాలిన్ వ్యాఖ్యానించారు. అదేసమయంలో వ్యక్తిగత వివాదాలు, రాజకీయాలను పక్కనపెట్టి అంతా ప్రజా సమస్యలపై దృష్టిపెట్టాలని స్టాలిన్ ఈ సందర్భంగా సూచించారు.
నువ్వు ఇప్పుడు సీఎం.. ఎలా మాట్లాడాలి..?
సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత విజయ్ తన నివాసానికి వచ్చిన విషయాన్ని కూడా స్టాలిన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎన్నికల ప్రచార సమయంలో తనను విమర్శించినందుకు విజయ్ క్షమాపణలు చెప్పినట్లు స్టాలిన్ తెలిపారు. అయితే, తాను ఏదీ మనసులో పెట్టుకోలేదని చెప్పానన్నారు. "మీరు ఇప్పుడు ఒక రాష్ట్రానికి సీఎం. మాట్లాడేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. పదవికి తగ్గ గౌరవంతో, హుందాగా వ్యవహరించాలి. ప్రజలకు మీరే ఓ రోల్ మోడల్" అని స్టాలిన్ చెప్పుకొచ్చారు.
ఇదీ వివాదం..
అసెంబ్లీలో పోలీస్ శాఖ గ్రాంట్లపై చర్చ జరుగుతున్న సమయంలో వివాదం రాజుకుంది. ప్రస్తుత అవినీతి ఆరోపణలను కప్పిపుచ్చుకునేందుకు డీఎంకే ఎప్పుడూ 'మీసా' పోరాటాలను తెరపైకి తెస్తోందంటూ విజయ్ విమర్శించారు. ఆ సమయంలో స్టాలిన్ అరెస్టును ప్రస్తావిస్తూ విజయ్ తన దవడపై చెయ్యి వేసి చేసిన సైగ తీవ్ర దుమారానికి దారితీసింది. సీఎం తీరుపై ప్రతిపక్ష డీఎంకే తీవ్రస్థాయిలో మండిపడింది. స్టాలిన్ జైలు గాయాన్ని కించపరిచేలా సీఎం వ్యవహరించారంటూ ఘాటుగా విమర్శించింది.
అయితే తాను ఉద్దేశపూర్వకంగా ఆ హావభావాలు చేయలేదని విజయ్ స్పష్టం చేశారు. మాట్లాడేటప్పుడు అనుకోకుండా చేయి దవడపైకి వెళ్లిందని స్పష్టతనిచ్చారు. ఎవరి వ్యక్తిగత మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఈ వివాదం నేపథ్యంలో స్టాలిన్ తాజాగా స్పందించారు. కాగా, ఎమర్జెన్సీ కాలంలో కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం రద్దైన తర్వాత 1976 ప్రారంభంలో అప్పటి యూత్ వింగ్ లీడర్‌గా ఉన్న ఎంకే స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 1977లో ఎమర్జెన్సీ పరిస్థితులు ముగిసే వరకూ ఆయన మద్రాస్ సెంట్రల్ జైలులో పోలీసుల నిర్బంధంలో ఉన్నారు. ఆ సమయంలో స్టాలిన్ అనేక చిత్రహింసలను ఎదుర్కొన్నారు.
Also Read..
బీఆర్ఎస్ నేతలు బుద్ధి మార్చుకోకపోతే.. ప్రజలే మిమ్మల్ని శుద్ధి చేస్తారు: ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన బంగారం ధర.. మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి..
తెలంగాణ ప్రజలకు లైఫ్‌లైన్ ఆర్టీసీ.. జాగ్రత్తగా విలీన ప్రక్రియ: మంత్రి పొన్నం ప్రభాకర్
సంబంధిత వార్తలు

Kangana Ranaut | టార్గెట్ ఎప్పుడూ మహిళే.. ఆ ధోరణి ఎప్పుడు మారుతుందో..? : త్రిష వివాదంపై కంగన రనౌత్
సెప్టెంబర్ 8, 2026

CM Vijay | మహిళలను కించపరిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు.. ఉదయనిధి డబుల్ మీనింగ్ వ్యాఖ్యలపై సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
సెప్టెంబర్ 7, 2026

CM Vijay | చెన్నైలో మెగా ఒలింపిక్ సిటీ, ఫార్ములా-1 రేసింగ్.. తమిళనాడు సీఎం విజయ్ సంచలన ప్రకటన
సెప్టెంబర్ 3, 2026
తాజావార్తలు
- ●Balmoor Venkat | బీఆర్ఎస్ నేతలు బుద్ధి మార్చుకోకపోతే.. ప్రజలే మిమ్మల్ని శుద్ధి చేస్తారు: ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన బంగారం ధర.. మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి..
- ●Ponnam Prabhakar | తెలంగాణ ప్రజలకు లైఫ్‌లైన్ ఆర్టీసీ.. జాగ్రత్తగా విలీన ప్రక్రియ: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●BRS | మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తన.. బీఆర్ఎస్ కీలక నిర్ణయం!
- ●Harish Rao | సిగ్గుచేటు.. ఫేక్ అకౌంట్ గురించి అసెంబ్లీలో చెప్పిన సీఎం రేవంత్: హరీశ్ రావు
- ●Apple iPhone Duo | రూ.2.99 లక్షల నుంచి ఐఫోన్ డ్యుయో.. యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ ఇదే..

Balmoor Venkat | బీఆర్ఎస్ నేతలు బుద్ధి మార్చుకోకపోతే.. ప్రజలే మిమ్మల్ని శుద్ధి చేస్తారు: ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన బంగారం ధర.. మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి..

Ponnam Prabhakar | తెలంగాణ ప్రజలకు లైఫ్‌లైన్ ఆర్టీసీ.. జాగ్రత్తగా విలీన ప్రక్రియ: మంత్రి పొన్నం ప్రభాకర్

BRS | మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తన.. బీఆర్ఎస్ కీలక నిర్ణయం!



