త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delimitation Bill 2026 | అవసరమైంది ఆరుగురు లేదా 9 మంది గైర్హాజరు

డీలిమిటేషన్ బిల్లు ఆమోదంపై ఎంతో పట్టుదలగా ఉన్న ఎన్డీఏకు మరో 6 గురు ఎంపీలు మద్దతిస్తే చాలు ప్రత్యేక మెజారిటీకి అవసరమైన బలం వచ్చినట్టే. లేదా తొమ్మిది మంది గైర్హాజరైనా ఎన్డీఏకు ఆ మెజారిటీ దక్కినట్టే. Delimitation Bill 2026: Six additional votes or nine opposition absences could secure the required Lok Sabha majority if regional parties extend their support.

C

News | Published On Nov 27, 2026, 7.00 pm IST

Delimitation Bill 2026 | అవసరమైంది ఆరుగురు లేదా 9 మంది గైర్హాజరు

డీలిమిటేషన్‌ బిల్లు.. ప్రాంతీయ పార్టీల మద్దతు లభిస్తే ప్రత్యేక మెజారిటీకి మరో ఆరు ఓట్లు చాలు.. తొమ్మిది మంది ప్రతిపక్ష ఎంపీలు గైర్హాజరైనా సరే!

సంక్షిప్త సారాంశం

డీలిమిటేషన్‌ బిల్లు ఆమోదానికి ఎన్డీఏ రంగం సిద్ధం చేస్తున్నది. స్టాలిన్‌, శరద్‌ పవార్‌, జగన్‌ పార్టీల మద్దతు లభిస్తే లోక్‌సభలో ప్రత్యేక మెజారిటీకి మరో ఆరు ఓట్లు చాలు. ఒకవేళ ఆరుగురు ఎంపీలు కలిసిరాని నేపథ్యంలో.. తొమ్మిది మంది ప్రతిపక్ష ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నా బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. మరోవైపు అన్ని రాష్ట్రాల్లోనూ 50 శాతం లోక్‌సభ స్థానాల పెంపు, 2051 వరకు ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తి కొనసాగింపునకు కేంద్ర కేబినెట్‌ శుక్రవారం ఆమోదం తెలిపింది. The Union Cabinet has approved the revised Delimitation Bill 2026, proposing a uniform 50% increase in Lok Sabha seats and protection of existing state representation until 2051. If DMK, NCP-SP and YSRCP extend support, the NDA could be just six votes short of the required Lok Sabha special majority. The absence of nine additional opposition MPs could also change the voting arithmetic.

Advertisement
  • డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి రంగం సిద్ధం చేసిన ఎన్డీఏ

  • సమ్మతి తెలిపేందుకు సిద్ధమైన స్టాలిన్‌, శరద్‌ పవార్‌, జగన్‌

  • 7 నెలల్లో 293 నుంచి 354 వరకు మద్దతు సమీకరణాలు

  • వేగంగా మారిన రాజకీయ సమీకరణాలు

  • ప్రత్యేక మెజారిటీకి ఇంకో ఆరుగురు సభ్యులు చాలు

  • డీలిమిటేషన్‌ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

  • అన్ని రాష్ట్రాల్లోనూ 50 శాతం లోక్‌సభ స్థానాల పెంపునకు ప్రతిపాదన

  • 2051 వరకు రాష్ట్రాల ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తి యథాతథం

  • ప్రతిపక్ష శిబిరంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు

  • కాంగ్రెస్‌లోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం

త్రినేత్ర న్యూస్‌ ప్రత్యేక కథనం | 2026 నవంబర్‌ 27:

కేవలం ఆరుగురు ఎంపీలు కలిసొస్తే చాలు.. ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఎన్డీఏకు లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీ (Two-Thirds Majority) సమకూరనున్నది. డీలిమిటేషన్‌ బిల్లు (Delimitation Bill 2026), మహిళా రిజర్వేషన్‌ బిల్లు (Women Reservation Bill) ఆమోదానికి ఎన్డీఏ రంగం సిద్ధం చేస్తున్నది. గత ఏప్రిల్‌ నెలలో వీగిపోయిన బిల్లును తిరిగి ఆమోదింపజేసుకునేందుకు రాజకీయ వ్యూహాలను అమలు చేసి అనేక పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నది. నాడు లోక్‌సభలో 293గా ఉన్న ఎన్డీఏ బలం, ప్రాంతీయ పార్టీల మద్దతుతో కలిపి ప్రస్తుతం 354కు చేరే పరిస్థితి కనిపిస్తున్నది. నవంబరు 30 నుంచి డిసెంబరు 3 వరకు జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో (Parliament Special Session 2026) ఈ బిల్లులు ఓటింగ్‌కు రానున్నాయి.

డీలిమిటేషన్‌ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియ ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లుకు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారం ఆమోదం తెలిపింది. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు (Constitutional Amendment Bill) కూడా కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

దక్షిణాది రాష్ట్రాల ప్రధాన డిమాండ్‌కు అనుగుణంగా లోక్‌సభ స్థానాల వాటాను అన్ని రాష్ట్రాల్లో ఏకరీతిగా 50 శాతం పెంచడంతోపాటు రాష్ట్రాల మధ్య ఉన్న ప్రస్తుత సీట్ల నిష్పత్తిని (Pro-Rata Share) మరో 25 ఏళ్లపాటు అంటే 2051 వరకూ యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. జనగణనతో సంబంధం లేకుండా ఈ పునర్విభజన ప్రక్రియ చేపట్టేలా బిల్లులోని విధివిధానాల్లో పలు మార్పులు చేశారు. దీనివల్ల ప్రతి రాష్ట్రానికి అదనపు సీట్లు దక్కడంతోపాటు, లోక్‌సభలో ఉన్న ప్రస్తుత వాటా దాదాపు అలాగే కొనసాగుతుంది.

తక్కువ జనాభా వృద్ధి ఉన్న దక్షిణాది రాష్ట్రాల (Southern States) ప్రాతినిధ్యం తగ్గిపోతుందన్న అభ్యంతరాలను పరిష్కరించే దిశగా కేంద్రం ఈ కీలక మార్పును చేపట్టింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో డీలిమిటేషన్‌ సంబంధిత రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీ లభించకపోవడంతో వీగిపోయిన విషయం తెలిసిందే. ఈ సవరణలతో కూడిన బిల్లును ఆమోదించేందుకు నవంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 3 వరకు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కీలక బిల్లులకు కేబినెట్‌ ఇవాళ ఆమోదముద్ర వేసింది. కేబినెట్‌ ఆమోదం పొందిన ఈ బిల్లులను పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టి చర్చకు పెట్టనున్నారు.

లోక్‌సభ స్థానాలు 850

2029 ఎన్నికల (Lok Sabha Elections 2029) నాటికి పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రం పట్టుదలతో ఉన్నది. ప్రస్తుతమున్న 543 లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచుతూ, గరిష్ఠ సభ్యుల సంఖ్యను 850కి పెంచేలా రాజ్యాంగ సవరణ బిల్లును రూపొందించారు. రాజ్యాంగ సవరణ బిల్లు నెగ్గాలంటే లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. లోక్‌సభలో మొత్తం 543 స్థానాలు ఉండగా ప్రస్తుతం మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 540 మంది సభ్యుల సంఖ్య ఆధారంగా మూడింట రెండొంతుల మెజారిటీకి 360 ఓట్లు అవసరమవుతాయి. అయితే స్పీకర్‌, సభ్యుల హాజరు, ఓటింగ్‌లో పాల్గొనే సభ్యుల సంఖ్యను బట్టి ఈ లెక్క మారుతుంది. ఈ చట్టం అమలును తదుపరి జనగణనతో ముడిపెట్టడాన్ని విపక్షాలు వ్యతిరేకించాయి. దీంతో గత సెషన్‌లో ఈ బిల్లు వీగిపోయింది.

బిల్లులో కీలక అంశాలు ఇవే

  • అన్ని రాష్ట్రాల్లోనూ లోక్‌సభ స్థానాలు 50 శాతం పెంపు (50% Lok Sabha Seat Increase).

  • 2051 వరకు రాష్ట్రాల మధ్య ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తి కొనసాగింపు (Delimitation Freeze).

  • లోక్‌సభ గరిష్ఠ సభ్యుల సంఖ్యను 850కి పెంచే ప్రతిపాదన.

  • మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలుకు చర్యలు (Women Reservation).

  • నియోజకవర్గాల పునర్విభజనకు డీలిమిటేషన్‌ కమిషన్‌ (Delimitation Commission) ఏర్పాటు.

డీఎంకే, ఎన్సీపీ, వైఎస్సార్‌సీపీ సుముఖం

మరోవైపు గతంలో ఈ బిల్లును వ్యతిరేకించిన డీఎంకే (DMK), శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ (NCP-SP) తాజాగా కొన్ని షరతులతో మద్దతిచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేస్తున్నాయి. ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుప్రియా సూలే (Supriya Sule) మూడు ప్రధాన అంశాలను కేంద్రం ముందుంచారు. మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలి. అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా 50 శాతం లోక్‌సభ స్థానాలను పెంచాలి. డీలిమిటేషన్‌ కమిషన్‌లో ప్రతిపక్షాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి.

జనాభా పెరుగుదలతో లోక్‌సభ నియోజకవర్గాల పరిధి విస్తరిస్తున్నదని, ఎంపీలు ప్రజలకు సేవలందించడం కష్టమవుతున్నదని సూలే అభిప్రాయపడ్డారు. తమ డిమాండ్లకు అనుగుణంగా బిల్లు ఉంటే మద్దతిచ్చే అవకాశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు.

మరోవైపు లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను పెంచితే తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 7.18 శాతం ప్రాతినిధ్యం తగ్గకూడదని డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌ (MK Stalin) స్పష్టం చేశారు. 1971 జనాభా లెక్కల ఆధారంగా కొనసాగుతున్న రాష్ట్రాల ప్రాతినిధ్య నిష్పత్తిని మరో 25 ఏళ్లపాటు మార్చకూడదని డిమాండ్‌ చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ (YSRCP) కూడా డీలిమిటేషన్‌ బిల్లుకు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.

7 నెలల్లో 293 నుంచి 354 వరకు

గత ఏడు నెలల్లో దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు (Political Realignment) మారిపోయాయి. బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఓడిపోవడంతో ఆ శిబిరం నుంచి 20 మంది ఎంపీలు నేషనలిస్ట్‌ సిటిజన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (NCPI)లో విలీనమై ఎన్డీఏకు మద్దతు ప్రకటించారు. మరోవైపు ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు.

ఇప్పుడు డీఎంకే (22), ఎన్సీపీ (8), వైఎస్సార్‌సీపీ (4) సభ్యులు మద్దతు పలికితే ఎన్డీఏకు అనుకూలంగా ఉన్న సభ్యుల సంఖ్య దాదాపుగా 354కు చేరనున్నది.

మారిన రాజకీయ సమీకరణాలు

గతంలో ఎన్డీఏ బలం  - 293

ప్రస్తుతం ఎన్డీఏ అంచనా బలం - 320
ప్రాంతీయ పార్టీల మద్దతు లభిస్తే - 354

కాంగ్రెస్‌లోనూ భిన్నాభిప్రాయాలు?

డీలిమిటేషన్‌ విషయంలో కాంగ్రెస్‌ (Congress) పార్టీలోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. అన్ని రాష్ట్రాల్లోనూ సమాన నిష్పత్తిలో లోక్‌సభ స్థానాలను పెంచుతూ, ప్రస్తుత ప్రాతినిధ్యాన్ని పరిరక్షిస్తే బిల్లును వ్యతిరేకించాల్సిన అవసరం ఏమిటన్న చర్చ కాంగ్రెస్‌లోని కొందరు నేతల మధ్య జరుగుతున్నట్లు ప్రచారం సాగుతున్నది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ వైపు నుంచి కొందరు ఎంపీలు క్రాస్‌ ఓటింగ్‌ (Cross Voting) చేసే అవకాశం ఉన్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. అయితే దీనికి సంబంధించి అధికారిక నిర్ధారణ లేదు. కాంగ్రెస్‌ పార్టీ తమ సభ్యులకు విప్‌ (Party Whip) జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుత 543 లోక్‌సభ స్థానాల పరిధిలోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కాంగ్రెస్‌ కోరుతున్నది. మహిళా రిజర్వేషన్ల అమలును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నది.

9 మంది ప్రతిపక్ష ఎంపీలు ఓటింగ్‌కు రాకుంటే.. బిల్లుకు అవసరమైన మెజారిటీ

డీఎంకే, శరద్‌ పవార్‌ ఎన్సీపీ, వైఎస్సార్‌సీపీ మద్దతుతో 353 అనుకూల ఓట్లు లభించి, తొమ్మిది మంది ప్రతిపక్ష ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉంటే రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన ప్రత్యేక మెజారిటీ (Special Majority) లభిస్తుంది.

లోక్‌సభలో మొత్తం 543 స్థానాలు ఉండగా ప్రస్తుతం 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో సభ్యుల సంఖ్య 540గా ఉన్నది. స్పీకర్‌ ఓం బిర్లా (Om Birla), సస్పెన్షన్‌లో ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీని మినహాయిస్తే 538 మంది ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉన్నది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి 359 ఓట్లు అవసరం.

స్పీకర్‌ను మినహాయిస్తే ఎన్డీఏ ఓటింగ్‌ బలం 319గా ఉన్నది. డీఎంకేకు చెందిన 22 మంది, శరద్‌ పవార్‌ ఎన్సీపీకి చెందిన ఎనిమిది మంది, వైఎస్సార్‌సీపీకి చెందిన నలుగురు ఎంపీలు మద్దతిస్తే అనుకూల ఓట్ల సంఖ్య 353కు చేరుతుంది. అప్పుడు మరో ఆరు ఓట్లు అవసరమవుతాయి. లేదా అదనంగా తొమ్మిది మంది ప్రతిపక్ష ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉంటే ప్రత్యేక మెజారిటీకి అవసరమైన ఓట్ల సంఖ్య 353కు తగ్గుతుంది.

 

లోక్‌సభలో సంఖ్యాబలం (Lok Sabha Strength)

లోక్‌సభ మొత్తం స్థానాలు 543
ఖాళీగా ఉన్న స్థానాలు 3
ప్రస్తుతం ఉన్న సభ్యులు 540
స్పీకర్‌ ఓటు మినహాయింపు 1
సస్పెన్షన్‌లో ఉన్న సభ్యుడు 1
ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉన్నవారు 538
మూడింట రెండొంతుల మెజారిటీ 359

ఎన్డీఏకు ప్రాంతీయ పార్టీలు మద్దతిస్తే..

ఎంపీలు గైర్హాజరైతే మారనున్న మెజారిటీ లెక్కలు

 

 

రాజ్యసభలో ఎన్డీఏకు మరో 9 ఓట్లు అవసరం

లోక్‌సభలో డీలిమిటేషన్‌ బిల్లుకు (Delimitation Bill) ప్రత్యేక మెజారిటీ లభించినా రాజ్యసభలోనూ (Rajya Sabha) కేంద్ర ప్రభుత్వం అదే తరహా మెజారిటీ సాధించాల్సి ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 368 (Article 368) ప్రకారం రాజ్యాంగ సవరణ బిల్లుకు ఉభయ సభలు విడివిడిగా ఆమోదం తెలపాలి. సభ మొత్తం సభ్యత్వంలో సగానికి మించిన మెజారిటీతోపాటు హాజరై ఓటేసిన సభ్యుల్లో కనీసం మూడింట రెండొంతుల మంది మద్దతు (Two-Thirds Majority) అవసరం. అందువల్ల రాజ్యసభలో సభ్యుల హాజరు కూడా కీలకం కానున్నది.

రాజ్యసభలో మొత్తం 245 స్థానాలు ఉండగా ప్రస్తుతం ఒక స్థానం ఖాళీగా ఉన్నది. దీంతో సభ్యుల సంఖ్య 244గా ఉన్నది. వీరంతా ఓటింగ్‌లో పాల్గొంటే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి 163 ఓట్లు అవసరం. ప్రస్తుతం ఎన్డీఏకు 154 మంది సభ్యుల మద్దతు ఉన్నట్లు హిందుస్థాన్‌ టైమ్స్‌ (Hindustan Times) వెల్లడించింది. దీంతో ప్రత్యేక మెజారిటీ సాధించేందుకు మరో తొమ్మిది మంది సభ్యుల మద్దతు అవసరం కానున్నది.

రాజ్యసభలో ప్రస్తుత సంఖ్యాబలం (Rajya Sabha Strength)

వివరాలు సభ్యుల సంఖ్య
మొత్తం స్థానాలు 245
ఖాళీ స్థానాలు 1
ప్రస్తుత సభ్యులు 244
ప్రత్యేక మెజారిటీ 163
ఎన్డీఏ బలం 154
అదనంగా అవసరమైన ఓట్లు 9

లోక్‌సభ మాదిరిగానే రాజ్యసభలోనూ డీఎంకే (DMK), వైఎస్సార్‌సీపీ (YSRCP) వైఖరి ప్రాధాన్యం సంతరించుకున్నది. రాజ్యసభలో డీఎంకేకు 8 మంది, వైఎస్సార్‌సీపీకి నలుగురు సభ్యులు ఉన్నారు. ఈ రెండు పార్టీలు మద్దతు పలికితే ఎన్డీఏకు అనుకూలంగా ఓటేసే సభ్యుల సంఖ్య 166కు చేరుతుంది. అంటే అవసరమైన ప్రత్యేక మెజారిటీ కంటే మూడు ఓట్లు అధికంగా లభిస్తాయి.

బీజేడీ మద్దతు కూడా కీలకమే

రాజ్యసభలో నవీన్‌ పట్నాయక్‌ (Naveen Patnaik) నేతృత్వంలోని బిజూ జనతాదళ్‌ (BJD)కు ఐదుగురు సభ్యులు ఉన్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన నలుగురు, బీజేడీకి చెందిన ఐదుగురు సభ్యుల మద్దతు లభించినా రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన 163 ఓట్లు సమకూరుతాయి. అయితే ఆయా పార్టీల తుది నిర్ణయాలు ఇంకా స్పష్టం కావాల్సి ఉన్నది.

13 మంది గైర్హాజరైతే ప్రస్తుత బలంతోనే ప్రత్యేక మెజారిటీ

రాజ్యసభలో ఎన్డీఏకు ప్రస్తుతం ఉన్న 154 మంది సభ్యులంతా అనుకూలంగా ఓటేస్తే, ఇతర పార్టీలకు చెందిన 13 మంది సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్న సందర్భంలో అదనపు అనుకూల ఓట్లు అవసరం ఉండదు. ప్రస్తుతమున్న 244 మంది సభ్యుల్లో 13 మంది గైర్హాజరైతే ఓటింగ్‌లో పాల్గొనే సభ్యుల సంఖ్య 231కి తగ్గుతుంది. అప్పుడు మూడింట రెండొంతుల మెజారిటీకి సరిగ్గా 154 ఓట్లు అవసరమవుతాయి. అయితే గైర్హాజరయ్యే సభ్యుల్లో ఎన్డీఏ సభ్యులు ఉండకూడదు.

Advertisement
Advertisement