త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | తెలంగాణ ప్ర‌జ‌ల‌కు లైఫ్‌లైన్ ఆర్టీసీ.. జాగ్ర‌త్త‌గా విలీన ప్ర‌క్రియ: మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

Ponnam Prabhakar | పేద, మధ్యతరగతి ప్రజలకు రైల్వేలు దేశవ్యాప్తంగా లైఫ్‌లైన్ అయితే.. తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ లైఫ్‌లైన్ అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) అన్నారు. ప్రతిరోజూ సుమారు 30 లక్షల కిలోమీటర్లు బస్సులు తిరుగుతున్నాయ‌ని, 65 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయని వెల్ల‌డించారు.

G

Telangana | Published On Sep 10, 2026, 11.47 am IST

Ponnam Prabhakar | తెలంగాణ ప్ర‌జ‌ల‌కు లైఫ్‌లైన్ ఆర్టీసీ.. జాగ్ర‌త్త‌గా విలీన ప్ర‌క్రియ: మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్‌: పేద, మధ్యతరగతి ప్రజలకు రైల్వేలు దేశవ్యాప్తంగా లైఫ్‌లైన్ అయితే.. తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ లైఫ్‌లైన్ అని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) అన్నారు. ప్రతిరోజూ సుమారు 30 లక్షల కిలోమీటర్లు బస్సులు తిరుగుతున్నాయ‌ని, 65 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయని వెల్ల‌డించారు. గత ప్రభుత్వం పదేండ్ల‌లో ఆర్టీసీని (TGS RTC) నిర్లక్ష్యం చేసి సంస్థను నిర్వీర్యం చేశార‌ని మండిప‌డ్డారు. రిటైర్డ్ ఈడీని ఎండీగా నియమించి సంస్థ నిర్వహణను బలహీనపరిచారని చెప్పారు. కొత్త బస్సులు కొనుగోలు చేయకుండా ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టారని విమ‌ర్శించారు. కార్మికుల సమస్యలను కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేద‌న్నారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఆర్టీసీపై ప‌లువురు స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ స‌మాధానం ఇచ్చారు.

`2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త‌ర్వాత డిసెంబర్ 9న మహాలక్ష్మి (Maha Lakshmi Scheem) పథకాన్ని ప్రారంభించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (Free Bus For Women) కల్పించాం. ఇది మహిళల ఆర్థిక భారం తగ్గించడంతో పాటు ఆర్టీసీకి కూడా కొత్త ఊపునిచ్చింది. మహాలక్ష్మి పథకం తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ గణనీయంగా పెరిగింది. బస్ స్టేషన్లు, బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటివరకు 347.47 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించి, రూ.12,171 కోట్లు ఆదా చేసుకున్నారు. మహిళలు ద‌వాఖాన‌లకు, దేవాలయాలకు, బంధువుల ఇండ్ల‌కు, పిల్లల చదువుల కోసం ప్రయాణించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతున్న‌ది.

గత శాసనసభ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాం. నియోజకవర్గాల వారీగా బస్సుల అవసరాలు, ప్రజల సమస్యలపై వినతులు తీసుకున్నాం. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా కొత్త సర్వీసులు, అదనపు ట్రిప్పులు ప్రారంభిస్తున్నాం. కరోనా సమయంలో రద్దైన సర్వీసులను కూడా అవసరమైన చోట పునరుద్ధరిస్తున్నాం. ప్రతిరోజూ 65 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో డ్రైవర్లు, కండక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి కష్టాన్ని, సేవలను ఈ సభ అభినందించాలి. గతంలో ఆపరేషనల్ లాస్‌లతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆర్టీసీ ఇప్పుడు నష్టాల నుంచి లాభాల దిశగా పయనిస్తోంది. సంస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోంది.

అందుబాటులోకి కొత్త బ‌స్సులు..

పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇప్పటివరకు 2,932 కొత్త బస్సులను కొనుగోలు చేశాం. 15 ఏండ్లు దాటిన బస్సులను ఆర్టీసీలో కొనసాగించకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 340 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా రెట్రోఫిట్ చేశాం. హైదరాబాద్ నగరంలో పీఎం ఈ డ్రైవ్‌ కింద 2,200 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నాం. ఆర్టీసీ పరిధిలో నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల్లో ఇప్పటికే క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు ఏర్పాటు చేశాం. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రీమియం కేటగిరీ బస్సులతో పాటు ఎలక్ట్రిక్ బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఆదిలాబాద్‌లో జిల్లా ఎస్పీ సహకారంతో బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్‌లో అవసరమైన అన్ని బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్‌లో లాస్ట్ మైల్ కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తున్నాం. మెట్రో, ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేలా అదనపు బస్సు రూట్లు ఏర్పాటు చేస్తున్నాం.

అన్ని గ్రామాల‌కు బ‌స్సులు..

ప్రస్తుతం హైదరాబాద్‌లో 370 కొత్త రూట్లలో బస్సులు నడుపుతున్నాం. అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సులు చేరాలా కార్యచరణ తీసుకున్నాం. ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త రూట్లను కూడా పెంచుతున్నాం. గతంలో 97 డిపోలు ఉండగా ప్రస్తుతం 99 డిపోలకు పెంచాం. పెద్దపల్లి, ములుగు డిపోలను ఏర్పాటు చేశాం. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లను పరిశీలించి అవసరమైన చోట కొత్త డిపోలు ఏర్పాటు చేస్తాం. మహాలక్ష్మి పథకం తర్వాత బస్ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. అందుకు అనుగుణంగా బస్ స్టేషన్లలో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నాం. అవసరమైన చోట CSR, ఇతర నిధుల సహకారంతో కూడా అభివృద్ధి పనులు చేపడతాం. యాదాద్రి ఆలయానికి వెళ్లే ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు వంగర వద్ద ఎక్స్‌ప్రెస్ బస్సులు నిలిపేలా చర్యలు తీసుకుంటాం. ప్రజల అవసరాలు, ఎమ్మెల్యేల సూచనల మేరకు బస్సుల స్టాపేజీలను పరిశీలిస్తున్నాం.

ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే విధానం మా ప్రభుత్వంలో లేదు. ఆర్టీసీ ఆస్తులను కాపాడుతూ సంస్థ అభివృద్ధికి వినియోగిస్తాం. గాజులరామారం, శంషాబాద్, ఫ్యూచర్ సిటీ ప్రాంతాల్లో బస్ టెర్మినల్స్ అభివృద్ధికి అవసరమైన స్థలాలను తీసుకున్నాం. పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్టీసీ స్థలాలు తీసుకుంటే, అదే విధంగా ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వ స్థలాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో కార్మికులు 60 రోజుల పాటు సమ్మె చేసినా పట్టించుకోలేదు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ కుటుంబానికి ఉద్యోగం, ఇల్లు అందించే చర్యలు చేపట్టాం. పూర్తిస్థాయి సర్వీసు నుంచి తొలగించబడిన 244 మంది కార్మికులను తిరిగి తీసుకున్నాం. 1,430 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాం. ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది.

విలీన ప్ర‌క్రియ‌..

ఎన్నికలు పూర్తయిన తర్వాత గెలిచిన సంఘం ప్రతినిధులను అధికారుల కమిటీలో చేర్చి విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తాం. ఇతర రాష్ట్రాల్లో విలీనం తర్వాత ఎదురైన ఇబ్బందులు తెలంగాణలో పునరావృతం కాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నాం. మహిళా సాధికారతలో భాగంగా 600 బస్సులకు మహిళలను యజమానులుగా చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా మరింత సాధికారత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.

మ‌రింత బ‌లోపేతం చేస్తాం..

ఆర్టీసీని కాపాడటం మాత్రమే కాదు.. ఆర్టీసీని మరింత బలోపేతం చేయడం మా లక్ష్యం. ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, నాణ్యమైన ప్రజా రవాణా అందించాలి. కార్మికులను గౌరవిస్తూ, ప్రయాణికుల అవసరాలను తీర్చుతూ సంస్థను అభివృద్ధి చేస్తాం. ఆర్టీసీని కాపాడటం అంటే తెలంగాణ ప్రజల జీవనాడిని కాపాడటం. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో పాటు ఆర్టీసీకి కొత్త జీవం పోశాం. కొత్త బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు, సీసీ కెమెరాలు, కొత్త రూట్లు, ఆధునిక బస్ స్టేషన్లు, కార్మిక సంక్షేమం ద్వారా తెలంగాణ ఆర్టీసీని దేశంలోనే ఆదర్శ ప్రజా రవాణా సంస్థగా తీర్చిదిద్దుతాం.` అని పొన్నం ప్ర‌భాక‌ర్ చెప్పారు.

Advertisement
Advertisement