త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

LPG cylinder | ఇన్‌స్టామార్ట్ ద్వారా బుక్ చేసిన 10 నిమిషాల్లోనే గ్యాస్ సిలిండ‌ర్ డెలివ‌రీ.. దేశంలోనే తొలిసారి

LPG cylinder | వినియోగ‌దారుల‌కు గుడ్ న్యూస్‌.. గృహ అవ‌స‌రాల‌కు ఉప‌యోగించే గ్యాస్ సిలిండ‌ర్ (LPG cylinde) బుకింగ్ ఇప్పుడు మ‌రింత సుల‌భ‌త‌రమైంది. బుక్ చేసిన 10 నిమిషాల్లోనే సిలిండ‌ర్ మ‌న ఇంటికి డెలివ‌రీ అవుతుంది. HPCL భాగ‌స్వామ్యంతో ప్ర‌ముఖ క్విక్ కామ‌ర్స్ సంస్థ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ (Instamart) ఈ సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చింది.

D

National | Published On Jul 15, 2026, 3.52 pm IST

LPG cylinder | ఇన్‌స్టామార్ట్ ద్వారా బుక్ చేసిన 10 నిమిషాల్లోనే గ్యాస్ సిలిండ‌ర్ డెలివ‌రీ.. దేశంలోనే తొలిసారి
Advertisement

LPG cylinder | గ్యాస్ సిలిండ‌ర్ బుకింగ్ ఇప్పుడు మ‌రింత సుల‌భ‌త‌రం కానుంది. ప్ర‌ముఖ క్విక్ కామ‌ర్స్ సంస్థ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ (Instamart).. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) భాగస్వామ్యంతో భారతదేశంలోనే తొలిసారిగా ఆన్-డిమాండ్ ఎల్‌పీజీ (LPG) సిలిండర్ డెలివరీ సేవలను ప్రారంభించింది. ఈ విష‌యాన్ని రెండు సంస్థ‌లు అధికారికంగా ప్ర‌క‌టించాయి.

ప్ర‌స్తుతం ఈ సేవను ప్రయోగాత్మకంగా బెంగళూరు (Bengaluru)లో అందుబాటులోకి రానున్నాయి. బుక్ చేసుకున్న ప‌ది నిమిషాల్లోనే సిలిండ‌ర్‌ను పొంద‌వ‌చ్చు. హెచ్‌పీసీఎల్ కొత్త‌గా మార్కెట్‌లోకి తీసుకొచ్చిన 10 కేజీల కాంపోజిట్ హెచ్‌పీ నవ్య (HP Navya), 5 కేజీల మెటల్ సిలిండర్లను ఇన్‌స్టామార్ట్ యాప్ ద్వారా ఆర్డర్ చేసుకోవ‌చ్చు. మ‌రో విశేషం ఏంటంటే.. ఈ సిలిండర్లను కొనుగోలు చేయడానికి ఇప్పటికే గృహ LPG కనెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు. కొత్తగా LPG ఉపయోగించాలనుకునే వారు కూడా ఇన్‌స్టామార్ట్ యాప్ ద్వారా ఈ సిలిండర్లను ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంటుంది.

మొదటిసారి చేసే ఆర్డర్‌ను కొత్త సిలిండర్ కొనుగోలుగా పరిగణిస్తారు. ఆ స‌మ‌యంలో ఐడెంటిటీ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత రీఫిల్ అవసరమైనప్పుడు వినియోగదారులు ఖాళీ HPCL సిలిండర్‌ను డెలివరీ సమయంలో తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం కొత్తగా నింపిన సిలిండర్ అందజేస్తారు. ఈ విధానం ద్వారా సిలిండర్ మార్పిడి ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు భద్రతా ప్రమాణాలను కూడా పాటించనున్నారు.

త‌మ సంస్థ కేవ‌లం కిరాణా సామ‌గ్రిని డెలివ‌రీ చేయ‌డానికి ప‌రిమితం కాకుండా.. వినియోగ‌దారుల రోజువారీ జీవితంలో భాగ‌మైంద‌ని ఇన్‌స్టామార్ట్ సీఈవో అమితేష్ ఝా తెలిపారు. ఇప్పుడు హెచ్‌పీసీఎల్ భాగ‌స్వామ్యంతో త‌మ సేవ‌ల‌ను విస్త‌రించిన‌ట్లు వెల్ల‌డించారు. మ‌రోవైపు భ‌ద్ర‌త‌, న‌మ్మ‌కానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తూ న‌యా భార‌త్ కోసం ఎల్‌పీజీని మరింత అందుబాటులోకి తీసుకురావ‌డంపై దృష్టి సారిస్తున్న‌ట్లు హెచ్‌పీసీఎల్ మార్కెటింగ్ డైరెక్ట‌ర్ అమిత్ గార్గ్ తెలిపారు. క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా LPG సిలిండర్లను అందుబాటులోకి తీసుకురావడం భారత్‌లో ఇదే తొలిసారి అని రెండు సంస్థలు వెల్లడించాయి.

పైలట్ ప్రాజెక్ట్ కింద‌ బెంగ‌ళూరు న‌గ‌రంలోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్ర‌మే వీటిని ప్రారంభించారు. అక్కడ వచ్చే స్పందనను బట్టి త్వరలోనే హైదరాబాద్, ముంబై, చెన్నై వంటి ఇతర ప్రధాన నగరాలకు కూడా ఈ సేవ‌ల‌ను విస్తరించనున్నారు.

Also Read..

నోయిడాలో భారీ అగ్నిప్ర‌మాదం.. చిక్కుకుపోయిన 50 కుటుంబాలు

భారీ బ్యాట‌రీ, ప‌వ‌ర్‌ఫుల్ డిస్‌ప్లే, ప్రాసెస‌ర్‌తో లాంచ్ అయిన మోటోరోలా ఎడ్జ్‌70 మ్యాక్స్

అర్హులైన జ‌ర్న‌లిస్టుల‌కు అక్రిడిటేష‌న్లు ఇవ్వాలి.. టీడ‌బ్ల్యూజేఎఫ్ డిమాండ్

Advertisement
Advertisement