త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Zomato | జొమాటో గుడ్ న్యూస్‌.. 40 కిలోమీట‌ర్ల దూరం నుంచీ ఫుడ్ డెలివ‌రీ..

Zomato | ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో లిమిట్‌లెస్ డెలివరీ పేరుతో సరికొత్త సేవలను ప్రారంభించింది. ఈ సదుపాయం ద్వారా వినియోగదారులు తమ నివాస ప్రాంతానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెస్టారెంట్ల నుంచి కూడా ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. తొలుత హైదరాబాద్ సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

S

Business | Published On Nov 7, 2026, 1.37 pm IST

Zomato | జొమాటో గుడ్ న్యూస్‌.. 40 కిలోమీట‌ర్ల దూరం నుంచీ ఫుడ్ డెలివ‌రీ..
Advertisement

Zomato | ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో లిమిట్‌లెస్ డెలివరీ పేరుతో సరికొత్త సేవలను ప్రారంభించింది. ఈ సదుపాయం ద్వారా వినియోగదారులు తమ నివాస ప్రాంతానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెస్టారెంట్ల నుంచి కూడా ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. తొలుత హైదరాబాద్ సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఏంటీ లిమిట్‌లెస్ డెలివ‌రీ ఫీచ‌ర్‌..?

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ రంగంలో ప్రముఖ సంస్థ జొమాటో మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. లిమిట్‌లెస్ డెలివరీ పేరుతో ప్రారంభించిన ఈ సేవ ద్వారా వినియోగదారులు తమ డెలివరీ చిరునామా నుంచి గరిష్ఠంగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెస్టారెంట్ల నుంచి కూడా ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. సాధారణంగా జొమాటో యాప్‌లో వినియోగదారులకు సమీపంలోని రెస్టారెంట్లే ఎక్కువగా కనిపిస్తాయి. దీంతో దూర ప్రాంతాల్లోని ఇష్టమైన రెస్టారెంట్ల నుంచి ఆహారం తెప్పించుకునే అవకాశం పరిమితంగా ఉంటోంది. తాజాగా తీసుకొచ్చిన ఫీచర్‌తో ఈ పరిమితిని అధిగమించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల వినియోగదారులకు మరిన్ని రెస్టారెంట్ల ఆహారాన్ని ఆస్వాదించే అవకాశం లభించడంతోపాటు, భాగస్వామ్య రెస్టారెంట్లు కూడా తమ వ్యాపార పరిధిని విస్తరించుకోవచ్చు. జొమాటో సీఈఓ ఆదిత్య మంగ్లా మాట్లాడుతూ, వినియోగదారులు తమకు ఇష్టమైన రెస్టారెంట్లు దూరంగా ఉన్నప్పటికీ అక్కడి నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేసుకునేలా ఈ సేవ ఉపయోగపడుతుందని తెలిపారు.

ఏయే న‌గ‌రాల్లో ఉంది..?

ప్రస్తుతం ఈ సదుపాయాన్ని బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్, చెన్నై, ముంబై, కోల్‌కతా, పుణె, హైదరాబాద్ నగరాల్లో ప్రారంభించారు. ఇతర నగరాలకు ఈ సేవలను ఎప్పుడు విస్తరిస్తారనే విషయంపై సంస్థ ఇంకా స్పష్టమైన గడువును ప్రకటించలేదు. వినియోగదారులు జొమాటో యాప్‌లో హోమ్‌పేజీకి వెళ్లి ఎక్స్‌ప్లోర్ మోర్ విభాగంలో కనిపించే లిమిట్‌లెస్ డెలివరీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అప్పుడు ఈ సేవకు అందుబాటులో ఉన్న రెస్టారెంట్ల వివరాలు కనిపిస్తాయి. మరో మార్గంలో నేరుగా యాప్‌లో తమకు నచ్చిన రెస్టారెంట్ పేరును సెర్చ్ చేయవచ్చు. ఆ రెస్టారెంట్ ఈ సదుపాయంలో భాగస్వామిగా ఉండి, వినియోగదారుడి డెలివరీ ప్రాంతానికి సేవలు అందిస్తే మెనూను పరిశీలించి సాధారణ పద్ధతిలో ఆర్డర్ చేసుకోవచ్చు.

వినియోగ‌దారులు గుర్తుంచుకోవాల్సిన‌వి..

అయితే 40 కిలోమీటర్లు అనేది యాప్‌లో అనుమతించే గరిష్ఠ డెలివరీ పరిధి మాత్రమేనని, ఆ పరిధిలోని అన్ని రెస్టారెంట్ల నుంచి ఆహారం ఆర్డర్ చేసుకోవచ్చని హామీ లేదని సంస్థ స్పష్టం చేసింది. ఆయా రెస్టారెంట్లు ఈ సేవలో భాగస్వాములుగా ఉండడం, వినియోగదారుడి డెలివరీ చిరునామా వంటి అంశాల ఆధారంగా ఆర్డర్ అందుబాటుపై నిర్ణయం ఉంటుంది. అలాగే డెలివరీ ఛార్జీలు, ఆహారం చేరుకునే సమయం కూడా ప్రాంతం, సేవల లభ్యతను బట్టి మారుతాయి. ఈ కొత్త ఫీచర్‌తో వినియోగదారులకు ఆహార ఎంపికలు పెరగడంతోపాటు, రెస్టారెంట్లు వివిధ ప్రాంతాల కస్టమర్లకు చేరువయ్యే అవకాశం ఉంటుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఫుడ్ డెలివరీ సేవలను మరింత విస్తరించే దిశగా జొమాటో ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement
Advertisement