త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | ఆర్బీఐ నిర్ణయానికి ముందు మార్కెట్లలో ఒత్తిడి.. సెన్సెక్స్ 462 పాయింట్లు పతనం..

Stock Markets | బుధవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన నిర్ణయానికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో మార్కెట్లపై ఒత్తిడి కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ గరిష్ఠంగా 462.44 పాయింట్లు (0.63 శాతం) నష్టపోయి 72,605.37 వద్దకు చేరింది.

S

Business | Published On Oct 7, 2026, 10.29 am IST

Stock Markets | ఆర్బీఐ నిర్ణయానికి ముందు మార్కెట్లలో ఒత్తిడి.. సెన్సెక్స్ 462 పాయింట్లు పతనం..
Advertisement

Stock Markets | బుధవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన నిర్ణయానికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో మార్కెట్లపై ఒత్తిడి కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ గరిష్ఠంగా 462.44 పాయింట్లు (0.63 శాతం) నష్టపోయి 72,605.37 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 175.65 పాయింట్లు ( 0.77 శాతం) క్షీణించి 22,600 వద్ద ట్రేడయింది. అంతకుముందు సెన్సెక్స్ 72,965.38 వద్ద, నిఫ్టీ 22,690.45 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ అత్యధికంగా 1.55 శాతం నష్టపోయింది. నిఫ్టీ మెటల్ 1.34 శాతం పడిపోగా, నిఫ్టీ ఆటో ఒక శాతానికి పైగా క్షీణించింది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 0.94 శాతం, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 0.82 శాతం నష్టపోయాయి. నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ సూచీలు 0.7 శాతం వరకు ప‌త‌న‌మ‌య్యాయి.

లాభాల్లో హెల్త్‌కేర్ షేర్లు..

మరోవైపు హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్ షేర్లు కొంత మేరకు లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ ఫార్మా 0.16 శాతం పెరగగా, నిఫ్టీ500 హెల్త్‌కేర్ స్వల్పంగా లాభపడింది. నిఫ్టీ మీడియా 0.74 శాతం పురోగమించింది. మార్కెట్‌లో ముడి చమురు ధరలు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ప్రవాహాలు, రూపాయి మారకం విలువతోపాటు వృద్ధి, ద్రవ్యోల్బణ పరిస్థితులపై కేంద్ర బ్యాంకు అంచనాలను ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తున్నారు. గత గురువారం కనిష్ఠ స్థాయి నుంచి నిఫ్టీ 558 పాయింట్లు పుంజుకోవడం ఇన్వెస్టర్లకు కొంత ఊరటనిచ్చిందని విశ్లేషకులు తెలిపారు. అయితే ఈ ర్యాలీకి కొన్ని ప్రతికూల అంశాలు అడ్డంకిగా మారుతాయ‌ని, దీంతో నిరంతర పెరుగుదలకు పరిమితులు ఉంటాయ‌ని పేర్కొన్నారు. బ్రెంట్ ముడి చమురు ధర మళ్లీ 101 డాలర్లకు పైకి చేరడం, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ఉపసంహరణలో ఇప్పటికీ మార్పు కనిపించకపోవడం మార్కెట్‌ల‌పై ఒత్తిడి పెంచుతున్నాయని తెలిపారు. దేశీయ లిక్విడిటీ, రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మెరుగ్గా ఉంటాయన్న అంచనాలు మాత్రం మార్కెట్‌ల‌కు మద్దతుగా ఉన్నాయని విశ్లేషకులు వివరించారు.

వ‌డ్డీ రేట్ల పెంపు..

ఈరోజు మార్కెట్ ప్రధానంగా ఆర్బీఐ ద్రవ్య విధాన వైఖరి, ఆర్బీఐ గవర్నర్ సందేశంపై దృష్టి సారించనుందని నిపుణులు తెలిపారు. 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు పెంపు దాదాపు ఖాయమని, అది ఇప్పటికే మార్కెట్ అంచనాల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. అయితే ద్రవ్య విధాన వైఖరి, మారుతున్న వృద్ధి-ద్రవ్యోల్బణ పరిస్థితులపై కేంద్ర బ్యాంకు అభిప్రాయం మాత్రం మార్కెట్‌కు కీలకంగా మారనుందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై ఆర్బీఐ గవర్నర్ చేసే వ్యాఖ్యల ఆధారంగా మార్కెట్ స్పందన ఉంటుంద‌ని నిపుణులు పేర్కొన్నారు. భారత్, అమెరికా మధ్య వడ్డీ రేట్ల వ్యత్యాసం ప్రస్తుతం చాలా తక్కువ స్థాయిలో ఉందని తెలిపారు. అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం, డాలర్ బలపడుతున్న నేపథ్యంలో దేశం నుంచి మరింత మూలధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు వడ్డీ రేటు పెంపు తప్పనిసరిగా మారిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. రూపాయి విలువను స్థిరీకరించడం కూడా ఆర్బీఐ గవర్నర్ ప్రాధాన్యతల్లో ఒకటిగా ఉంటుంద‌ని, అయితే వృద్ధి, ద్రవ్యోల్బణ పరిస్థితులపైనే ప్రధాన దృష్టి కొనసాగుతుందని వివరించారు.

పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

మరోవైపు బుధవారం ముడి చమురు ధరలు పెరిగాయి. అమెరికాలో కీలక చమురు ఉత్పత్తి ప్రాంతాల వైపు తుపాను దూసుకెళ్తుండడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశాలు, సౌదీ అరేబియాపై హౌతీ దాడుల ప్రభావాలను ట్రేడర్లు పరిశీలిస్తున్నారు. అదే సమయంలో మధ్యప్రాచ్యం నుంచి పెరుగుతున్న ముడి చమురు ఎగుమతులు ధరల పెరుగుదలను కొంత పరిమితం చేస్తున్నాయి. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో ఈ సెష‌న్‌లో బ్రెంట్ క్రూడ్ ధ‌ర 0.30 శాతం పెరిగి బ్యారెల్‌కు 100 డాల‌ర్ల‌కు చేర‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 0.17 శాతం పెరిగి బ్యారెల్‌కు 92 డాల‌ర్ల‌కు చేరింది. ఫారెక్స్ మార్కెట్‌లో భార‌త రూపాయి విలువ మ‌ళ్లీ ప‌త‌న‌మైంది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 96.41 వ‌ద్ద ఉన్న రూపాయి ఈ సెషన్‌లో 0.06 శాతం న‌ష్ట‌పోయింది.

Advertisement
Advertisement