త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

INDIA bloc meeting | రేపు ఇండీ కూట‌మి కీల‌క భేటీ.. ఆప్‌, డీఎంకే దూరం

INDIA bloc meeting | ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై నెల‌కొన్న‌ వివాదం నేపథ్యంలో రేపు ఢిల్లీలో జరగనున్న ఇండీ (INDIA) కూటమి కీలక భేటీకి ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP), ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) పార్టీలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి.

D

National | Published On Sep 29, 2026, 5.13 pm IST

INDIA bloc meeting | రేపు ఇండీ కూట‌మి కీల‌క భేటీ.. ఆప్‌, డీఎంకే దూరం
Advertisement

INDIA bloc meeting | త్రినేత్ర న్యూస్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై నెల‌కొన్న‌ వివాదం నేపథ్యంలో రేపు ఢిల్లీలో జరగనున్న ఇండీ (INDIA) కూటమి కీలక భేటీకి ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP), ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) పార్టీలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో పాటు సర్ (SIR) ప్రక్రియపై ఉమ్మడి కార్యాచరణను చర్చించేందుకు మిత్ర‌ప‌క్షాల‌ను కాంగ్రెస్ ఆహ్వానించింది. అయితే, ఈ కీల‌క భేటీకి ఆప్‌, డీఎంకే హాజ‌ర‌కావ‌డం లేదు.

ఇండీ కూట‌మి స‌మావేశంపై ఆప్ ఎంపీ సంజ‌య్ సింగ్ స్పందించారు. తాము కూట‌మిలో భాగం కాద‌ని పార్టీ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. అందువల్ల‌ ఈ భేటీకి హాజరుకావడంలో అర్థం లేదని చెప్పారు. అయితే, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం (Impeachment Motion) ప్రవేశపెడితే మాత్రం ఇతర ప్రతిపక్షాలతో కలిసి పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే సంత‌కాలు కూడా చేసిన‌ట్లు తెలిపారు.

మ‌రోవైపు తమిళనాడులో రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్‌తో విభేదాల నేపథ్యంలో డీఎంకే ఈ సమావేశాన్ని బహిష్కరించింది. త‌మిళ‌నాట హ‌స్తం పార్టీ డీఎంకేతో పొత్తులో ఉంటూనే గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన టీవీకే విజ‌య్ పార్టీకి మ‌ద్ద‌తివ్వ‌డంతో విభేదాలు త‌లెత్తిన విష‌యం తెలిసిందే. రాజ‌కీయ ల‌బ్ధి కోసం హ‌స్తం పార్టీ త‌మ‌ను వెన్నుపోటు పొడిచిందంటూ ఉద‌య‌నిధి స్టాలిన్ ఆరోపించారు. దీనివ‌ల్ల సుదీర్ఘ‌కాలం డీఎంకేతో హ‌స్తం పార్టీకి ఉన్న బంధం తెగిపోయిందని పేర్కొన్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే డీఎంకే సైతం ఇండీ కూట‌మి కీల‌క భేటీకి దూరంగా ఉంటోంది.

అఖిలేష్ సైతం

మ‌రోవైపు స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాద‌వ్ సైతం ఈ స‌మావేశానికి ప్ర‌త్య‌క్షంగా హాజ‌రుకావ‌డం లేదు. అఖిలేష్‌కు బ‌దులు ఆయ‌న ప్ర‌తినిధి హాజ‌ర‌వుతార‌ని తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్ వైఖరి వల్లే అఖిలేష్ రావడం లేదని డీఎంకే ఆరోపించింది. రాజ్యసభ నామినేషన్ల బిజీ వల్ల ఆయన రాలేకపోతున్నారని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ వివరణ ఇచ్చారు. అఖిలేష్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులంతా హాజరవుతున్నార‌ని చెప్పారు. రేపు జ‌ర‌గ‌బోయే ఇండీ కూట‌మి భేటీకి టీఎంసీ అధినేత్ర మ‌మ‌తా బెన‌ర్జీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సుప్రియా సూలే, జితేంద్ర అవ్హాద్‌, పీఎస్ చాకో త‌దిత‌రులు హాజ‌రుకానున్నారు. శ‌ర‌ద్ ప‌వార్‌, శివ‌సేన యూటీబీ అధినేత ఉద్ధ‌వ్ ఠాక్రే, ఇత‌ర పార్టీ నాయ‌కులు ఆన్‌లైన్ వేదిక‌గా స‌మావేశంలో పాల్గొన‌నున్నారు.

ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) రాజీనామా చేయాల‌ని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. పార్ల‌మెంటులో ఆయ‌న‌పై అభిశంస‌న తీర్మానం (Impeachment Motion) ప్రవేశపెట్టేందుకు ఉమ్మ‌డి వ్యూహాన్ని ర‌చిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే విపక్ష ఇండీ కూటమి పార్టీలు (Crucial Opposition Meeting) ఈనెల 30న ప్ర‌త్యేకంగా భేటీ కానున్నాయి. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో స‌మావేశం కానున్నాయి. ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై తలెత్తిన వివాదాల‌పై భవిష్యత్తు కార్యాచరణను సంయుక్తంగా ఖరారు చేయనున్నాయి.

Also Read..

అస్సాం రైఫిల్స్ బృందంపై ఉగ్ర‌వాదులు కాల్పులు.. జ‌వాను వీర‌మ‌ర‌ణం

కాళేశ్వ‌ర పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల్లో ఆర్మీ ఇంజినీర్ల సేవ‌లు వినియోగిస్తాం

ఒప్పో నుంచి కె14 ప్ల‌స్ స్మార్ట్‌ఫోన్‌.. 8000 ఎంఏహెచ్ బ్యాట‌రీతో అదిరిపోయింది..

Advertisement
Advertisement