త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Self-Respect Marriage | కావ్య‌-అనిరుధ్‌ సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్.. అస‌లేంటి ఈ ప‌ద్ధ‌తి..? ఎలా పుట్టుకొచ్చింది..?

Self-Respect Marriage | సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్ (Anirudh Ravichander), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సహ యజమాని కావ్య మారన్ (Kavya Maran) సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్ చేసుకుంది. మంగ‌ళ‌సూత్రం లేకుండా ఇరువురు ఒకే ర‌క‌మైన‌ చైన్స్‌ను మార్చుకున్నారు. దీంతో ఈ వివాహ‌ ప‌ద్ధ‌తిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

D

Entertainment | Published On Nov 13, 2026, 11.40 am IST

Self-Respect Marriage | కావ్య‌-అనిరుధ్‌ సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్.. అస‌లేంటి ఈ ప‌ద్ధ‌తి..? ఎలా పుట్టుకొచ్చింది..?
Advertisement

Self-Respect Marriage | త్రినేత్ర న్యూస్ : ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్ (Anirudh Ravichander), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సహ యజమాని కావ్య మారన్ (Kavya Maran) వివాహ బంధంతో ఒక్కటైన విష‌యం తెలిసిందే. నవంబర్‌ 11న గ్రీస్ (Greece) న‌గ‌రంలో అంగ‌రంగ వైభ‌వంగా వీరి పెళ్లి జ‌రిగింది. అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో వీరు ఒక్క‌ట‌య్యారు. ఈ జంట ఎంతో వినూత్నంగా వేద మంత్రాలు, పురోహితుల ప్రమేయం లేకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్ (ఆత్మగౌరవ వివాహం) చేసుకుంది (Self-Respect Marriage). మంగ‌ళ‌సూత్రం లేకుండా ఇరువురు ఒకే ర‌క‌మైన‌ చైన్స్‌ను మార్చుకున్నారు.

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఒక చైన్‌ను కావ్య‌కు అందించ‌గా.. సేమ్ అలాంటి గొలుసునే త‌మిళ‌స్టార్ ర‌జినీకాంత్ త‌న మేన‌ల్లుడైన అనిరుధ్‌కు ఇచ్చారు. తొలుత దండ‌లు మార్చుకున్న కావ్య‌-అనిరుధ్ జంట ఆ త‌ర్వాత గొలుసుల‌ను మార్చుకుని కుటుంబ స‌భ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. దీంతో ఈ వివాహ‌ ప‌ద్ధ‌తిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఈ పెళ్లి గురించి నెటిజ‌న్లు తెగ చ‌ర్చించుకుంటున్నారు.

అస‌లు సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్ అంటే ఏంటి..?

సాంప్రదాయ మతపరమైన ఆచారాలకు బదులుగా సమానత్వం, పరస్పర అంకితభావంతో జ‌రుపుకునే పెళ్లినే సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్ అంటారు. 1920లో తమిళనాడు (Tamil Nadu)కు చెందిన ప్రముఖ సామాజిక సంస్కర్త పెరియార్ ఈవీ రామసామి (Periyar EV Ramasamy) ప్రారంభించిన 'ఆత్మగౌరవ ఉద్యమం' (Self-Respect Movement) నుంచి ఈ వివాహ పద్ధతి పుట్టుకొచ్చింది. వివాహాల్లో కుల వివక్షను, ఖరీదైన సంప్రదాయ ఆచారాలను, మత పెద్దల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ సమానత్వాన్ని చాటడం ఈ వివాహం ముఖ్య ఉద్దేశం.

ఈ పెళ్లి తంతులో పురోహితులు, వేద మంత్రాలు వంటి ఆచార సంప్ర‌దాయాల‌ను పాటించ‌రు. వధూవరులు తమ పరస్పర అంగీకారాన్ని ప్రకటిస్తూ పూలమాలలు, ఉంగరాలు లేదా గొలుసులు మార్చుకుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ వేడుకకు సాక్షులుగా నిలుస్తారు. 1967లో తమిళనాడు ప్రభుత్వం హిందూ వివాహ చట్టానికి సవరణ చేసి ఈ ఆత్మగౌరవ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు కల్పించింది. అప్ప‌టి నుంచి స్త్రీల అణచివేతకు, కుల వ్యవస్థకు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఈ వివాహ వ్యవస్థ పురుడు పోసుకుంది. ఈ పద్ధతిలో చేసుకునే వివాహాలు పూర్తిగా చట్టపరమైనవిగా సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో స్పష్టం చేసింది.

Also Read..

ఢిల్లీలో ప్ర‌మాద‌క‌ర‌స్థాయికి గాలి నాణ్య‌త‌.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్ర‌జ‌లు

మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో అంతరాయం.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా స‌ర్వ‌ర్లు డౌన్‌..

కేసు ఉప‌సంహ‌రించుకోనందుకు.. కుటుంబంపై దాడి

Advertisement
Advertisement