త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mekedatu Dam | సీఎం డీకే Vs మాణికం ఠాగూర్‌.. కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టిన‌ మేకెదాటు

Mekedatu Dam | కావేరీ న‌దిపై క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన మేకెదాటు (Mekedatu Dam) ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టింది. ఈ అంశం క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ (DK Shivakumar), త‌మిళ‌నాడు కాంగ్రెస్ కమిటీ (TNCC) అధ్యక్షుడు మాణికం ఠాగూర్ (Manickam Tagore) మ‌ధ్య మాట‌ల యుద్ధానికి దారి తీసింది.

D

National | Published On Nov 14, 2026, 3.29 pm IST

Mekedatu Dam | సీఎం డీకే Vs మాణికం ఠాగూర్‌.. కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టిన‌ మేకెదాటు
Advertisement

Mekedatu Dam | త్రినేత్ర న్యూస్ : కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ జలాల వివాదం మ‌రోసారి రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదికైంది. ఇప్ప‌టి వ‌ర‌కూ క‌ర్ణాట‌క‌ Vs త‌మిళ‌నాడుగా (Tamil Nadu) సాగిన పోరు.. ఇప్పుడు కాంగ్రెస్ Vs కాంగ్రెస్ పోరుగా మారింది. ఈ నదిపై ప్రతిపాదిత మేకెదాటు డ్యామ్ (Mekedatu Dam) వివాదం కాంగ్రెస్ పార్టీ నేత‌ల మ‌ధ్య చిచ్చు పెట్టింది. మేకెదాటు వద్ద డ్యామ్ నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరని, ఈ ప్రాజెక్టుకు చ‌ట్ట‌ప‌ర‌మైన అనుమ‌తుల‌ను వేగ‌వంతం చేయాల‌ని ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ (DK Shivakumar) కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరిన విష‌యం తెలిసిందే.

డీకే వ్యాఖ్య‌ల‌పై తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (TNCC) అధ్యక్షుడు మాణికం ఠాగూర్ (Manickam Tagore) తీవ్రంగా మండిప‌డ్డారు. మేకెదాటు డ్యామ్ ప్రాజెక్టు తమిళనాడు రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకమని అన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం తుది అనుమతి ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. ఈ డ్యామ్ విష‌యంలో సీఎం వైఖ‌రి ఏ మాత్రం ఆమోద‌యోగ్యం కాద‌ని వ్యాఖ్యానించారు. తమిళనాడు హక్కులను కాపాడేందుకు అవసరమైతే ఎంతవరకైనా పోరాడతామని హెచ్చరించారు.

డ్యామ్ నిర్మాణాన్ని ఎవ‌రూ ఆప‌లేరు..

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ శుక్ర‌వారం క‌ర్ణాట‌క‌లో ప‌ర్య‌టించి ప‌లు అభివృద్ధి ప్రాజెక్టుల‌ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మైసూరులో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో సీఎం డీకే మాట్లాడుతూ.. మేకెదాటు వద్ద డ్యామ్ నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరని, ప్రతిపాదిత ప్రాజెక్ట్‌కు చట్టపరమైన అనుమతులను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విష‌యంలో సుప్రీంకోర్టు తీర్పు కూడా స్ప‌ష్టంగా ఉంద‌ని చెప్పారు.

రైతుల జీవనోపాధి దెబ్బ‌తింటుంది..

సీఎం వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మణికం ఠాగూర్.. డీకే వైఖరిని తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ఇది సుప్రీంకోర్టు తీర్పుకు, కావేరీ జల వివాద ట్రైబ్యునల్ తుది ఆదేశాలకు విరుద్ధమని ఆరోపించారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా, తమిళనాడు రైతుల జీవనోపాధిని నాశనం చేసేలా ఉన్న ఈ ప్రకటన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు. దిగువ తీర రాష్ట్రమైన తమిళనాడు సమ్మతి లేకుండా ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల కావేరీ డెల్టా ప్రాంత రైతుల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మేకెదాటు వద్ద కర్ణాటక కనీసం ఒక్క ఇటుక కూడా వేయకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేన‌ని స్ప‌ష్టం చేశారు. తమిళనాడు కాంగ్రెస్ తరఫున తాము ఈ ప్రాజెక్టును ఎప్పటికీ అనుమతించబోమ‌ని, దీని వ్య‌తిరేకంగా పోరాడ‌తామ‌ని తెగేసి చెప్పారు.

డ్యామ్ నిర్మాణం ఆగ‌దు..

మాణికం ఠాగూర్ అభ్యంత‌రాల‌పై డీకే ప్ర‌తిస్పందించారు. డ్యామ్ నిర్మాణం ఆగ‌ద‌ని ఈ సంద‌ర్భంగా పునరుద్ఘాటించారు. ఆయ‌న‌కు పూర్తి వాస్తవాలు తెలియవని వ్యాఖ్యానించారు. "మేకెదాటు వద్ద డ్యామ్ నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరు. తమిళనాడు ప్రయోజనాలను కాపాడుకోవడం మాణికం ఠాగూర్ బాధ్యతే. కానీ ఆయనకు పూర్తిగా వాస్తవాలు తెలియవు. ఆయన తన ప్రతినిధి బృందంతో కర్ణాటకకు వస్తే.. నేను ఆ డ్యామ్ సైట్‌కి తీసుకెళ్లి అది వారి ప్రయోజనాలకు ఎలా మేలు చేస్తుందో చూపిస్తాను" అని సీఎం పేర్కొన్నారు. మేకెదాటు సొంత పార్టీ నేత‌ల మ‌ధ్యే చిచ్చు పెట్టింది. ఒకే పార్టీకి చెందిన ఇద్ద‌రు కీల‌క నేత‌లు ఈ ప్రాజెక్టుపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేయ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

డీకే వ్యాఖ్యలపై టీవీకే ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం

మ‌రోవైపు సీఎం డీకే వ్యాఖ్య‌ల‌పై త‌మిళ‌నాడులోని టీవీకే ప్ర‌భుత్వం తీవ్రంగా స్పందించింది. ప్ర‌తి ఎన్నిక‌ల‌కు ముందు క‌ర్ణాట‌క నేత‌లు ఇలాంటి వివాదాస్ప‌ద ప్ర‌క‌న‌ట‌లు చేయ‌డం అల‌వాటుగా మారింద‌ని మంత్రి నిర్మ‌ల్ కుమార్ విమ‌ర్శించారు. మేకెదాటు ప్రాజెక్టును త‌మ ప్ర‌భుత్వం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అనుమ‌తించ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అటవీ, పర్యావరణ అనుమతులు లేనందున కర్ణాటక ప్రభుత్వం మేకెదాటు వద్ద కనీసం ఒక్క ఇటుక కూడా పేర్చలేదని తేల్చి చెప్పారు. కావేరి జలాలపై తమిళనాడు హక్కులను కాపాడేందుకు తమ ప్రభుత్వం బలమైన న్యాయపోరాటం చేస్తోందని ఆయ‌న వెల్ల‌డించారు.

డీకే వ్యాఖ్య‌ల‌తో అటు ప్ర‌తిప‌క్ష డీఎంకే కూడా విజ‌య్ ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెంచింది. కావేరీ జలాల అంశం తమిళనాడు ప్రజలకు జీవన్మరణ సమస్య (Matter of Life and Death) అని చెప్పారు. ఈ విష‌యంలో మౌనంగా ఉండ‌కుండా త‌క్ష‌ణ‌మే త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మాజీ ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని ఏర్పాటు చేయాల‌ని విజ‌య్ ప్ర‌భుత్వాన్ని డీఎంకే కోరింది.

Also Read..

36 గంట‌ల నిరీక్ష‌ణ‌కు తెర‌.. మైక్రోసాఫ్ట్ సేవ‌లు పున‌రుద్ధ‌ర‌ణ‌

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కొరడా.. 1.24 లక్షల మొబైల్ కనెక్షన్లపై చర్యలు..

జెన్సన్ హువాంగ్‌కు మస్క్ మద్దతు.. ఎన్విడియా సీఈఓగా తిరిగి రావాలంటూ పిటిషన్‌పై సంతకం..

Advertisement
Advertisement