త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Microsoft | మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో అంతరాయం.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా స‌ర్వ‌ర్లు డౌన్‌..

Microsoft | ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో ఏర్పడిన అంతరాయాన్ని సరిచేసేందుకు మైక్రోసాఫ్ట్ చర్యలు చేపట్టింది. ఔట్‌లుక్, టీమ్స్, వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్, షేర్‌పాయింట్, వన్‌డ్రైవ్ సేవలు ప్రభావితమయ్యాయి. దాదాపు 1.30 లక్షల మంది వినియోగదారులు సమస్యలు ఎదుర్కొన్నట్లు డౌన్‌డిటెక్టర్ వెల్లడించింది.

S

Technology | Published On Nov 13, 2026, 10.49 am IST

Microsoft | మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో అంతరాయం.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా స‌ర్వ‌ర్లు డౌన్‌..
Advertisement

Microsoft | ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో ఏర్పడిన అంతరాయాన్ని సరిచేసేందుకు మైక్రోసాఫ్ట్ చర్యలు చేపట్టింది. ఔట్‌లుక్, టీమ్స్, వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్, షేర్‌పాయింట్, వన్‌డ్రైవ్ సేవలు ప్రభావితమయ్యాయి. దాదాపు 1.30 లక్షల మంది వినియోగదారులు సమస్యలు ఎదుర్కొన్నట్లు డౌన్‌డిటెక్టర్ వెల్లడించింది. ప్రభావిత సర్వర్లలో కొన్నింటిని తిరిగి అందుబాటులోకి తీసుకురాగా, అవి ప్రస్తుతం స్థిరంగా పనిచేస్తున్నాయని సంస్థ తెలిపింది.

సాంకేతిక అంత‌రాయంతో ఇబ్బందులు..

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో ఏర్పడిన సాంకేతిక అంతరాయంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఔట్‌లుక్ ద్వారా ఈ-మెయిల్స్ పంపడం, స్వీకరించడం, ఇన్‌బాక్స్ తెరవడం వంటి సమస్యలు తలెత్తాయి. టీమ్స్, మైక్రోసాఫ్ట్ కోపైలట్ సహా ఇతర క్లౌడ్ ఆధారిత అప్లికేషన్లపైనా ప్రభావం పడింది. ఈ అంతరాయంపై స్పందించిన మైక్రోసాఫ్ట్.. ప్రభావితమైన సర్వర్లలో కొన్నింటిని తిరిగి సేవల్లోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ప్రత్యామ్నాయ నెట్‌వర్క్ మార్గాల ద్వారా ట్రాఫిక్‌ను మళ్లించి సమస్యను తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది. అయితే పునరుద్ధరించిన సర్వర్లపై వినియోగదారుల ట్రాఫిక్ పెరిగినప్పుడు అవి మళ్లీ స్పందించకపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ప్రభావిత సర్వర్లకు చేరే ట్రాఫిక్‌ను తాత్కాలికంగా పరిమితం చేసినట్లు పేర్కొంది.

దాదాపు 1.30 లక్షల మంది వినియోగదారులకు ఇబ్బందులు..

అంతరాయం తీవ్రంగా ఉన్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.30 ల‌క్ష‌ల మంది వినియోగదారులు సమస్యలను నివేదించినట్లు డౌన్‌డిటెక్టర్ వెల్లడించింది. మొదట ఎక్స్ఛేంజ్ ఆన్‌లైన్ మెయిల్‌బాక్సులను వివిధ మార్గాల్లో యాక్సెస్ చేయడంలో సమస్యలు ఎదురవుతున్నట్లు మైక్రోసాఫ్ట్ గుర్తించింది. అనంతరం సంస్థకు చెందిన కొన్ని సర్వర్లు ఆటోమేటెడ్ హెల్త్ చెక్స్‌లో విఫలమై అనూహ్యంగా అందుబాటులో లేకుండా పోవడంతో మిగిలిన సర్వర్లపై భారం పెరిగినట్లు గుర్తించింది. దీంతో కనెక్టివిటీ సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. ఇది మొత్తం ట్రాఫిక్ పెరగడం వల్ల కాకుండా, అందుబాటులో ఉన్న సర్వర్ల సంఖ్య తగ్గడం వల్లే జరిగిందని సంస్థ స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ హెల్త్ చెక్ విధానాన్ని పరీక్షించి కొన్ని సర్వర్లను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్, మిగిలిన సర్వర్లను ఆటోమేటిక్‌గా గుర్తించి పునఃప్రారంభించే విధానంపైనా పనిచేస్తోంది. ఇటీవల చేసిన కాన్ఫిగరేషన్ మార్పులు అంతరాయానికి కారణమై ఉంటాయ‌ని అనుమానిస్తూ, కొత్త మార్పులు, అప్‌డేట్ల అమలును తాత్కాలికంగా నిలిపివేసింది.

నిపుణుల హెచ్చరిక..

మైక్రోసాఫ్ట్ వ్యవస్థల్లోని నెట్‌వర్క్ స్థాయిలో సమస్య ఏర్పడి ఉంటుంద‌ని ఆర్‌ఎంఐటీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ మార్క్ గ్రెగరీ అభిప్రాయపడ్డారు. కొన్ని సర్వర్లు పనిచేయకపోవడంతో మిగిలిన సర్వర్లపై భారం పెరిగి, అవి కూడా విఫలమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. దీనిని వరుస వైఫల్యాలకు దారితీసే సమస్యగా అభివర్ణించారు. లైవ్ నెట్‌వర్క్‌లో మార్పులు అమలు చేయడానికి ముందు ప్రత్యేక పరీక్షా వ్యవస్థల్లో వాటిని పరిశీలించాలని సూచించారు. కాగా మైక్రోసాఫ్ట్ 365 కనెక్టర్ల ద్వారా సేవలు అందించే చాట్‌జీపీటీ, క్లాడ్ ఏఐ ప్లాట్‌ఫామ్‌లపైనా అంతరాయం ప్రభావం చూపినట్లు సమాచారం. ఉత్తర అమెరికాలో టీమ్స్ సేవలకు సంబంధించిన కొన్ని సమస్యలను పరిష్కరించినట్లు మైక్రోసాఫ్ట్ గతంలో ప్రకటించినప్పటికీ, ప్రపంచవ్యాప్త అంతరాయానికి కచ్చితమైన కారణాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. వినియోగదారులు తిరిగి కనెక్ట్ అవుతున్న కొద్దీ సేవలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటాయని సంస్థ తెలిపింది.

Advertisement
Advertisement