Brahmotsavalu 2026 | తిరుమలలో ఏడాదికి పది బ్రహ్మోత్సవాలు.. ఇప్పుడు ఒక్కసారే ఎందుకు?
Brahmotsavalu 2026 | తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వెయ్యేళ్లకు పైగా చారిత్రక నేపథ్యం ఉంది. విజయనగర రాజుల కాలంలో ఏడాదికి గరిష్టంగా 10 నుండి 11 బ్రహ్మోత్సవాలు జరిగినట్లు ఆలయ శాసనాలు చెబుతున్నాయి. ఆ పూర్తి వివరాలు మీకోసం.
Devotional | Published On Sep 12, 2026, 10.28 am IST
Brahmotsavalu 2026 | తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంటే తొమ్మిది రోజుల పండుగ. ధ్వజారోహణంతో మొదలై.. వాహన సేవలతో కొనసాగి.. గరుడసేవలో భక్తి వైభవం కనిపించి.. చక్రస్నానంతో ముగుస్తాయి. ఇప్పుడు ఏడాదికి ఒకసారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అధికమాసం వస్తే రెండుసార్లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గతంలో పరిస్థితి వేరుగా ఉండేది. తిరుమలలో ఒకప్పుడు ఏడాదికి పది బ్రహ్మోత్సవాల వరకు నిర్వహించిన సందర్భాలున్నాయి. ఆలయ శాసనాలు, చారిత్రక పుస్తకాల్లో దీనికి ఆధారాలు ఉన్నాయి. కాలంతో పాటు కొత్త ఉత్సవాలు చేరాయి. కొన్ని ఉత్సవాలు నిలిచిపోయాయి. ఇలా శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.
బ్రహ్మోత్సవాల చరిత్ర..
తిరుమల బ్రహ్మోత్సవాల చరిత్రలో సామాన్యశకం 966 సంవత్సరం కీలకమైంది. పల్లవ రాణి సామవై పెరుందేవి శ్రీవారికి వెండి భోగ శ్రీనివాసమూర్తిని సమర్పించారు. ఉత్సవాల నిర్వహణకు భూములను కూడా దానం చేశారు. ఆమె దానశాసనం తిరుమల ఆలయంలోని మొదటి ప్రాకారం ఉత్తర గోడపై ఉంది. ఈ శాసనం ద్వారా ఆ కాలంలోనే శ్రీవారి ఉత్సవాలు క్రమబద్ధంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. పురట్టాసి, మార్గళి మాసాల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఆమె ఏర్పాట్లు చేసినట్లు శాసనంలో ఉన్నది. అంటే చారిత్రక ఆధారాల్లో కనిపించే తొలి దశలోనే రెండు బ్రహ్మోత్సవాలు ఉన్నాయన్నమాట.
యాదవరాయుల పాలనలో ఐదుకు..
తర్వాతి కాలంలో చోళులు, యాదవరాయుల పాలనలో మరికొన్ని బ్రహ్మోత్సవాలు చేరాయి. వీర నరసింహ యాదవరాయుల కాలానికి పాంగుని బ్రహ్మోత్సవాన్ని ఆపాదిస్తున్నారు. సామాన్యశకం 1254లో విజయ గండగోపాలదేవుని కాలంలో చిత్తిరై బ్రహ్మోత్సవం చేరింది. 1300–1330 మధ్య యాదవరాయుల కాలంలో ఆడి బ్రహ్మోత్సవం కూడా ఏర్పడింది. దీంతో విజయనగర సామ్రాజ్యం ఏర్పడే నాటికి తిరుమలలో ఐదు బ్రహ్మోత్సవాలు ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇక విజయనగర కాలంలో ఉత్సవాల సంఖ్య పెరిగింది. తిరుమల ఉత్సవాల చరిత్రలో విజయనగర కాలం కీలకం. సంగమ, సాళువ, తుళువ, ఆరవీడు వంశాల పాలనలో ఆలయానికి రాజుల నుంచి మంచి ఆదరణ లభించింది. కొత్త ఉత్సవాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఉన్న ఉత్సవాలకు దానాలు పెరిగాయి. నైవేద్యాలు, సేవలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. చారిత్రక గ్రంథాల్లోని వివరాల ప్రకారం.. 1512 వరకు ఏడు బ్రహ్మోత్సవాల ప్రస్తావన ఉంది. 1514–1527 మధ్య ఎనిమిది, 1530–1541 మధ్య తొమ్మిది బ్రహ్మోత్సవాల ప్రస్తావనలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత 1539–1616 మధ్య శాసనాల్లో పది వార్షిక బ్రహ్మోత్సవాల ప్రస్తావనలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేక సంవత్సరాల్లో ఏడాదికి 11 సార్లు ఉత్సవాలు నిర్వహించినట్లుగా శాసనలు పేర్కొంటున్నాయి. ఒకే ఏడాదిలో ఆని, ఐప్పసి, కార్తీక, తై తదితర నెలలతో పాటు నక్షత్రాలను బట్టి వేర్వేరు రాజులు, దాతల పేరుతో ఈ ఉత్సవాలను జరిపించినట్లుగా శాసనలు చెబుతున్నాయి.
మారుతూ వచ్చిన ఉత్సవాలు..
ఏడాదికి పది బ్రహ్మోత్సవాలు అంటే ప్రతి నెలా ఒకటి జరిగిందని అనుకోవాల్సిన అవసరం లేదు. అప్పటి ఉత్సవాల వ్యవస్థ ప్రస్తుతం ఉన్న విధంగా లేదు. కాలానుగుణంగా ఒక్కో ఉత్సవం చేరింది. కొన్ని ఉత్సవాలు కొనసాగలేదు. మరికొన్ని కొత్త పేర్లతో లేదా వేరే కాలాల్లో నిర్వహించబడ్డాయి. ఉదాహరణకు 1534లో కార్తీకై బ్రహ్మోత్సవానికి సంబంధించిన ఆధారాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో సామవై పెరుందేవి ఏర్పాటు చేసిన మార్గళి బ్రహ్మోత్సవం నిలిచిపోయినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. దీంతో అప్పటి ఉత్సవ వ్యవస్థ ఎప్పటికప్పుడు మారుతూ ఉండేదని అర్థమవుతోంది. తిరుమల చరిత్రలో శ్రీకృష్ణదేవరాయలకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన 1513లో తిరుమలను దర్శించారు. తన జన్మమాసమైన తైలో కొత్త బ్రహ్మోత్సవాన్ని ఏర్పాటు చేసినట్లు శాసన ఆధారాలు చెబుతున్నాయి. ఆయన కాలంలో ఆలయానికి అనేక కానుకలు అందాయి. ఉత్సవాల నిర్వహణకు కూడా రాజపోషణ లభించింది. తర్వాత అచ్యుతరాయల కాలంలోనూ ఈ సంప్రదాయం కొనసాగింది. 1533–34 నాటి శాసనాల్లో కార్తీకై బ్రహ్మోత్సవానికి సంబంధించిన వివరాలు కనిపిస్తున్నాయి. శ్రీవారి ఉత్సవాల నిర్వహణలో తాళ్లపాక కుటుంబం కూడా కీలక పాత్ర పోషించింది. 1539లో తాళ్లపాక పెద తిరుమలయ్యంగార్ ఆధ్వర్యంలో ఆణి బ్రహ్మోత్సవం ఏర్పడినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. దీంతో ఒక విషయం స్పష్టమవుతోంది. బ్రహ్మోత్సవాల నిర్వహణలో రాజులు మాత్రమే కాకుండా సామంతులు, ఆలయ సేవకులు, భక్తులు కూడా తమ వంతు సేవ చేశారు. భూములు దానం చేయడం, నైవేద్యాలకు ఏర్పాట్లు చేయడం, ఉత్సవాల ఖర్చులకు సాయం చేయడం వంటి సేవలు అందించారు.
మలయప్పస్వామి రాకతో..
తిరుమల ఉత్సవాల చరిత్రలో మరో ముఖ్యమైన మార్పు ఉత్సవమూర్తికి సంబంధించినది. సుమారు 1339 ప్రాంతం నుంచి మలయప్పస్వామివారి ప్రస్తావనలు శాసనాల్లో కనిపిస్తున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామివారికి వివాహోత్సవాలు, ఇతర ఉత్సవాలు నిర్వహించే సంప్రదాయం ఏర్పడింది. నేడు వాహన సేవల్లో భక్తులకు దర్శనమిచ్చే మలయప్పస్వామివారి ఉత్సవ సంప్రదాయానికి ఇదే చారిత్రక నేపథ్యం. 16వ శతాబ్దానికి చెందిన కొన్ని శాసనాల్లో పలు బ్రహ్మోత్సవాలకు నైవేద్యాలు, సేవలు, దానాల వివరాలు ఉన్నాయి. పది బ్రహ్మోత్సవాల వ్యవస్థలో ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలు కలిపి 110 రోజుల వరకు ఉన్నట్లు చారిత్రక ఆధారాల్లో పేర్కొన్నారు. దీంతో అప్పటి తిరుమలలో ఉత్సవాలు ఎంత విస్తృతంగా జరిగేవో అర్థం చేసుకోవచ్చు. కాలంతో పాటు తిరుమల ఆలయ నిర్వహణలో మార్పులు వచ్చాయి. 1843లో ఆలయ పరిపాలన హథీరాంజీ మఠ మహంతుల ఆధీనంలోకి వెళ్లింది. ఈ విధానం 1933 వరకు కొనసాగింది. 1933లో తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏర్పడిన తర్వాత ఆలయ నిర్వహణ కొత్త వ్యవస్థలోకి వచ్చింది. భక్తుల సంఖ్య పెరిగింది. దీంతో బ్రహ్మోత్సవాల నిర్వహణ కూడా పెద్ద కార్యక్రమంగా మారింది. వసతి, రవాణా, భద్రత, వైద్యం, అన్నప్రసాదం, పారిశుధ్యం, సమాచార వ్యవస్థ.. ఇలా అనేక విభాగాలు ఇందులో భాగమయ్యాయి.
కొనసాగుతున్న సంప్రదాయం
రెండు బ్రహ్మోత్సవాలతో మొదలైన చారిత్రక ప్రయాణం.. ఐదుకు చేరింది. తర్వాత ఏడు, ఎనిమిది, తొమ్మిది దశలను దాటి.. శాసనాల్లో పది వార్షిక బ్రహ్మోత్సవాల ప్రస్తావన వరకు వచ్చింది. తర్వాత కాలంలో ఉత్సవాల సంఖ్య తగ్గింది. నిర్వహణ పద్ధతులు మారాయి. నేడు సాలకట్ల బ్రహ్మోత్సవం ప్రధానంగా జరుగుతోంది. అధికమాసం వస్తే మరో బ్రహ్మోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే ఉత్సవాల సంఖ్య మారినా.. శ్రీవారి బ్రహ్మోత్సవాలపై భక్తుల నమ్మకం మాత్రం కొనసాగుతోంది. శతాబ్దాలు మారినా.. ఉత్సవాల రూపం మారినా.. సప్తగిరులపై గోవింద నామస్మరణ మాత్రం అలాగే కొనసాగుతుండం విశేషం.
Read Also :
గణపతి తొండం కుడివైపు ఉంటే ఏంటి? ఎడమవైపు ఉంటే ఏంటి? పూజలో ఈ తేడా ఎందుకు?
Venus Transit | నక్షత్రాన్ని మార్చుకోనున్న శుక్రుడు.. మూడురాశులవారు జాగ్రత్తగా ఉండాల్సిందే..!
Mercury Transit in Virgo | కన్యారాశిలో బుధుడి సంచారం.. భద్ర రాజయోగంతో ఈ మూడు రాశుల వారికి అదృష్టం!
Budhaditya Raja Yogam | త్వరలో బుధాదిత్య రాజయోగం.. ఈ నాలుగు రాశులకు కెరీర్, ఆర్థికంగా అన్ని అనుకూల ఫలితాలే..!
Hartalika Teej | ఒకే రోజు హర్తాళికా తీజ్ తీజ్–వినాయక చవితి.. ఈ నాలుగురాశుల వారికి అన్నీ శుభాలే..!
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Anthropic | అతి పెద్ద ఐపీఓకు సిద్ధమవుతున్న ఆంథ్రోపిక్.. ఆఫర్ విలువ 100 బిలియన్ డాలర్లు..
- ●Harish Rawat | ఎన్నికల వేళ కాంగ్రెస్కు షాక్.. పదవుల నుంచి తప్పుకున్న మాజీ సీఎం
- ●Ganesh Idol | గణపతి తొండం కుడివైపు ఉంటే ఏంటి? ఎడమవైపు ఉంటే ఏంటి? పూజలో ఈ తేడా ఎందుకు?
- ●Rain Alert | రెండు రోజులు విస్తారంగా వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
- ●Special Trains | వరుస సెలవులు.. నేడు, రేపు సికింద్రాబాద్-కాగజ్నగర్-హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు..
- ●Valigonda Narasimha | మేస్త్రీ పని చేస్తూనే ఓయూ డాక్టరేట్ సాధించాడు.. వలిగొండ నరసింహ సక్సెస్ స్టోరీ ఇదీ..

Anthropic | అతి పెద్ద ఐపీఓకు సిద్ధమవుతున్న ఆంథ్రోపిక్.. ఆఫర్ విలువ 100 బిలియన్ డాలర్లు..

Harish Rawat | ఎన్నికల వేళ కాంగ్రెస్కు షాక్.. పదవుల నుంచి తప్పుకున్న మాజీ సీఎం

Ganesh Idol | గణపతి తొండం కుడివైపు ఉంటే ఏంటి? ఎడమవైపు ఉంటే ఏంటి? పూజలో ఈ తేడా ఎందుకు?

Rain Alert | రెండు రోజులు విస్తారంగా వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్






