TTD | వైభవోపేతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
TTD | తిరుమల, సెప్టెంబరు 9: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. దేశం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దర్శనం, వసతి, అన్నప్రసాదం, రవాణా, భద్రత, వైద్యం, పారిశుద్ధ్యం, విద్యుత్, పుష్పాలంకరణ తదితర అన్ని విభాగాల్లో పటిష్ట చర్యలు చేపట్టింది.
Devotional | Published On Sep 9, 2026, 4.25 pm IST
- భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు
- 15న స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న ఏపీ సీఎం చంద్రబాబు
- గరుడసేవకు 9.30 లక్షల మందికి అన్నప్రసాదం
- ఉద్యోగుల బీమా రూ.10 లక్షలకు పెంపు
- తిరుమలకు వచ్చే భక్తులకు తొలిసారిగా లైఫ్ ఇన్సూరెన్స్
- టీటీడీ చైర్మన్ బీఆర్ఎస్ నాయుడు
TTD | తిరుమల, సెప్టెంబరు 9: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. దేశం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దర్శనం, వసతి, అన్నప్రసాదం, రవాణా, భద్రత, వైద్యం, పారిశుద్ధ్యం, విద్యుత్, పుష్పాలంకరణ తదితర అన్ని విభాగాల్లో పటిష్ట చర్యలు చేపట్టింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ, పోలీసు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో బుధవారం ఆయన అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం ఈవో ముద్దాడ రవిచంద్రతో కలిసి మీడియాకు సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను వెల్లడించారు.
ఈ నెల 15 నుంచి బ్రహ్మోత్సవాలు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు జరగనున్నాయి. 14వ తేదీ సాయంత్రం 7 గంటలకు అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 15న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి 9 గంటలకు జరిగే పెద్దశేష వాహన సేవలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 15న సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. సెప్టెంబరు 16న రిలయన్స్ సంస్థ టీటీడీకి విరాళంగా అందించిన 25 ఎలక్ట్రిక్ బస్సులను సీఎం ప్రారంభించనున్నారు. అదే కార్యక్రమంలో 2027 సంవత్సరానికి సంబంధించిన టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ఆవిష్కరిస్తారు.
గరుడసేవకు భారీ ఏర్పాట్లు
ఈ ఏడాది గరుడసేవకు గతేడాదితో పోలిస్తే 15 నుంచి 20 శాతం మంది భక్తులు అదనంగా వచ్చే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గరుడసేవ రోజున గతేడాది 6.13 లక్షల మందికి అన్నప్రసాదం అందించగా.. ఈసారి 9.30 లక్షల మందికి అందించేలా చర్యలు చేపట్టారు. ఇది గతేడాదితో పోలిస్తే 52 శాతం అధికం. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజూ 10 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల భద్రత కోసం 3 వేల మంది పోలీసులతో పాటు 2,500 మంది టీటీడీ నిఘా, భద్రతా సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు సిబ్బంది సంఖ్యను 3 వేల నుంచి 3,300కు పెంచుతున్నారు. బ్రహ్మోత్సవాల్లో దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలకు చెందిన కళాకారులతో పాటు సింగపూర్, జర్మనీ నుంచి కూడా కళాకారులు పాల్గొననున్నారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, సురక్షిత వాతావరణం, మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు.
ఉద్యోగుల బీమా రూ.10 లక్షలకు పెంపు
భక్తులు, ఉద్యోగుల సంక్షేమానికి టీటీడీ పెద్దపీట వేస్తోంది. తిరుమలలో ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు అందించే బీమా మొత్తాన్ని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచేందుకు పాలక మండలి నిర్ణయించింది. అలాగే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమలలో సహజ మరణం సంభవించిన సందర్భంలో లైఫ్ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఆలయాల పరిపాలనలో దేశంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని టీటీడీ ప్రవేశపెడుతోందని చైర్మన్ తెలిపారు. ఈ పథకం కింద మరణించిన భక్తుడి కుటుంబానికి రూ.2 లక్షలు చెల్లించనున్నారు. పెన్షనర్లకు ఈహెచ్‌ఎఫ్ పదవీ విరమణ పొందిన సీపీఎస్, ఎన్‌పీఎస్ పెన్షనర్లు, వారి కుటుంబాలకు ఓపీఎస్ పెన్షనర్ల తరహాలో ఎంప్లాయీస్ హెల్త్ ఫెసిలిటీ (EHF) సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 48 మంది ఉద్యోగుల వేతనాలను పెంచేందుకు కూడా పాలక మండలి ఆమోదం తెలిపింది.
లడ్డూల తయారీకి మరో 400 మంది
శ్రీవారి పోటులో లడ్డూల తయారీని మరింత వేగవంతం చేసేందుకు 400 మంది అదనపు అవుట్‌సోర్సింగ్ సిబ్బంది పోస్టుల కోసం ప్రభుత్వ అనుమతికి ప్రతిపాదనలు పంపనున్నారు. తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణకు అదనపు సిబ్బందిని నియమిస్తూ.. వారికి తిరుమలకు రవాణా ఛార్జీలు చెల్లించేందుకు నిర్ణయించారు. ఇందుకోసం మూడేళ్లకు రూ.1.60 కోట్లు మంజూరు చేశారు. తిరుమల అన్నప్రసాద కేంద్రం, క్యాంటీన్లు, హోటళ్ల నుంచి వచ్చే ఆహార వ్యర్థాలను విభజించి వాటర్ హైడ్రాలసిస్ ప్రక్రియ ద్వారా బయోగ్యాస్ తయారు చేయనున్నారు. దీన్ని టీటీడీ అన్నప్రసాద కేంద్రానికి సరఫరా చేసేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) ముందుకు వచ్చింది. బయోగ్యాస్ ప్లాంట్ నిర్వహణను రూ.2.80 కోట్లతో M/s GPS Renewablesకు అప్పగించేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది.
ఆలయాలకు బంగారు తాపడం
నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అమ్మవారి పద్మపీఠానికి బంగారు తాపడం ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపారు. చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ధ్వజస్తంభం, బలిపీఠానికి బంగారు తాపడం చేసేందుకు రూ.17.05 కోట్లకు ఆమోదం లభించింది. తిరుపతిలో తెలుగు, సంస్కృత అకాడమీకి కేటాయించిన టీటీడీ భవనం లైసెన్సు గడువును మరో మూడేళ్లు పొడిగించారు. 2026 నవంబరు 2 నుంచి 2029 నవంబరు 1 వరకు లైసెన్సు గడువు పొడిగించేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. భాషా, సాంస్కృతిక అభివృద్ధికి టీటీడీ సహకరిస్తుందని చైర్మన్ పేర్కొన్నారు. క్టోబరు 12 నుంచి 20వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, జేఈవోలు శరత్, ప్రభల గోపినాథ్, సీవీఎస్‌వో కేవీ మురళీకృష్ణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Fauzi Movie | ‘ఫౌజీ’కి బ్రేక్.. సంక్రాంతి రేసులో నిలిచే ఛాన్స్..!
- ●Supreme Court | బీసీసీఐని జాతీయ క్రీడా చట్టం పరిధిలోకి ఎందుకు తీసుకురాకూడదు..? : సుప్రీంకోర్టు
- ●KCR | కేసీఆర్పై జీరో ఎఫ్ఐఆర్..!
- ●Sudden Sweating | వ్యాయామం చేయకున్నా చెమటలు అతిగా పడుతున్నాయా.. జాగ్రత్త, అది గుండె పోటుకు సంకేతం కావచ్చు..
- ●Singireddy Niranjan Reddy | ప్రశ్నిస్తారనే భయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
- ●Stock Markets | పశ్చిమ ఆసియాలో పెరిగిన యుద్ధ తీవ్రత.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Fauzi Movie | ‘ఫౌజీ’కి బ్రేక్.. సంక్రాంతి రేసులో నిలిచే ఛాన్స్..!

Supreme Court | బీసీసీఐని జాతీయ క్రీడా చట్టం పరిధిలోకి ఎందుకు తీసుకురాకూడదు..? : సుప్రీంకోర్టు

KCR | కేసీఆర్పై జీరో ఎఫ్ఐఆర్..!

Sudden Sweating | వ్యాయామం చేయకున్నా చెమటలు అతిగా పడుతున్నాయా.. జాగ్రత్త, అది గుండె పోటుకు సంకేతం కావచ్చు..






