త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Oracle Layoffs | తెల్ల‌వార‌గానే పిడుగులాంటి వార్త‌.. 30 వేల మందిపై ఒరాకిల్ వేటు.. భార‌త్‌లో 12 వేల మందికి ఉద్వాస‌న‌

Oracle Layoffs | ప్రపంచ వ్యాప్తంగా టెక్ రంగంలో లేఆఫ్స్‌ (Layoffs) పర్వం కొనసాగుతోంది. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఒరాకిల్ త‌న ఉద్యోగులకు షాకిచ్చింది (Oracle Layoffs).

D

Business | Published On Apr 1, 2026, 10.46 am IST

Oracle Layoffs | తెల్ల‌వార‌గానే పిడుగులాంటి వార్త‌.. 30 వేల మందిపై ఒరాకిల్ వేటు.. భార‌త్‌లో 12 వేల మందికి ఉద్వాస‌న‌
Advertisement

Oracle Layoffs | ప్రపంచ వ్యాప్తంగా టెక్ రంగంలో లేఆఫ్స్‌ (Layoffs) పర్వం కొనసాగుతోంది. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఒరాకిల్ త‌న ఉద్యోగులకు షాకిచ్చింది (Oracle Layoffs). ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 1.62 లక్షల మంది సిబ్బందిలో 18 శాతం మందిపై వేటు వేసింది. అంటే దాదాపు 30 వేల మందిని తొల‌గించింది.

వీరిలో భార‌త్‌లో ప‌నిచేస్తున్న సిబ్బందే 12,000 మంది ఉండ‌టం ఆందోళ‌న క‌లిగించే విష‌యం. లేఆఫ్స్ గురించి ఉద్యోగుల‌కు అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 6 గంటలకే మెయిల్స్ పంపించింది సంస్థ‌. మార్చి 31 నాటికే చివ‌రి ప‌నిదినంగా అందులో పేర్కొంది. అంతేకాదు, ల్యాప్‌టాప్‌ల‌కు కంపెనీ సిస్టమ్ యాక్సెస్‌ను కూడా నిలిపివేసింద‌ట‌. ఈ మేర‌కు సంబంధిత వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ మీడియాలో వ‌రుస క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

భార‌తీయ ఉద్యోగుల‌పై తీవ్ర ప్ర‌భావం..

ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడింది. మ‌న దేశంలో దాదాపు 30 వేల మంది ఒరాకిల్ ఉద్యోగులు ఉన్నారు. వారిలో 12 వేల మందిపై వేటు ప‌డ‌టం గ‌మ‌నార్హం. అమెరికా, కెనడాలో తొలగించిన ఉద్యోగుల్లో కూడా పెద్ద సంఖ్యలో భారతీయులే ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా మేనేజింగ్‌ హోదాల్లో ఉన్న వాళ్లే ఎక్కువ మంది వేటుకు గురైనట్లు స‌మాచారం. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వారి రోల్స్‌ అవసరం లేదని భావించిన సంస్థ ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిసింది. ఉదయం నిద్ర లేవగానే పిడుగులాంటి వార్త చూసి ఉద్యోగులు ఒక్క‌సారిగా షాక్ అయ్యారు.

వ‌చ్చే నెల మ‌రో రౌండ్‌..

ఈ లేఆఫ్స్ వ్య‌వ‌హారం మొత్తం టెక్‌ ప్రపంచాన్నే ఒక్క‌సారిగా షాక్‌కు గురి చేసింది. ఇక‌ ఒరాకిల్‌ చరిత్రలో ఇదే అతిపెద్ద ఉద్యోగాల కోతగా భావిస్తున్నారు. మ‌రో షాకింగ్ విష‌యం ఏంటంటే..? వ‌చ్చే నెల‌లో కంపెనీ మ‌రో భారీ స్థాయి తొల‌గింపున‌కు ప్లాన్ చేస్తుండ‌టం. ఈ విష‌యాన్ని హెచ్ఆర్ విభాగానికి చెందిన వారు వెల్ల‌డించిన‌ట్లు మీడియా నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి.

ఏఐ డేటా సెంటర్ కోసం..

కాగా, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, ఒరాకిల్‌ (Oracle) వంటి క్లౌడ్‌, డేటా సెంటర్ల దిగ్గజాలు ఏఐ మోడల్స్‌పై ఆధారపడటానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలో పెరుగుతున్న నిర్వహణ వ్యవయాలను నియంత్రించేందుకు వీలుగా ఉద్యోగుల తొలగింపు చేపడుతున్నాయి. ఒరాకిల్ కూడా ఏఐ డేటా సెంటర్ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇందుకోసం ఇప్పటికే 50 బిలియన్‌ డాలర్లు అప్పు తెచ్చింది. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకొనే కార్యక్రమంలో ఉద్యోగాల్లో కోత పెడుతోంది. ఈ లేఆఫ్స్ వ‌ల్ల దాదాపు 10 బిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కూ న‌గ‌దు ఆదా అవుతుంద‌ని సంస్థ భావిస్తోంది.

ఉద్యోగుల‌కు ప‌రిహారంగా..

తొల‌గింపుకు గురైన ఉద్యోగుల‌కు కంపెనీ కొన్ని ప‌రిహారాల‌ను కూడా ప్ర‌క‌టించింది. ముగిసిన నెల జీతంతోపాటూ అదనంగా మ‌రో మూడు నెల‌ల జీతం, ఇప్పటివరకు కంపెనీలో సర్వీసును లెక్కగట్టి ఏడాదికి 15 రోజుల జీతాన్ని ఇవ్వ‌నుంది. వీటితోపాటూ మార్చి 31 తేదీ వ‌ర‌కూ మిగిలి ఉన్న అన్ని సెల‌వుల‌ను నగదుగా మార్చుకునే అవకాశం క‌ల్పించింది. కార్మిక చట్టాలకు అనుగుణంగా గ్రాట్యుటీ చెల్లిస్తారు. అయితే, కంపెనీ నిర్దేశించిన గడువులోగా రాజీనామా చేసిన వారికే ఇవన్నీ వర్తిస్తాయి.

లాభాల్లో ఉన్న‌ప్ప‌టికీ..

ఇక ఒరాకిల్ ప్రస్తుతం నష్టాల్లో కూడా లేదు. ఇటీవలే ముగిసిన త్రైమాసికంలో కంపెనీ లాభాలు గత ఏడాదితో పోలిస్తే 95% పెరిగి 6.13 బిలియన్ డాలర్లకు చేరాయి. అయిన‌ప్ప‌టికీ ఇలా భారీ స్థాయిలో ఉద్యోగుల‌ను తొల‌గించ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. లేఆఫ్స్‌కు గురైన ఉద్యోగులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఏదిఏమైనా ఒరాకిల్ లేఆఫ్స్ టెక్ పరిశ్రమలో పెరుగుతున్న అనిశ్చితిని మ‌రోసారి స్ప‌ష్టం చేస్తున్నాయి.

Also Read..

Census 2027 | నేటి నుంచి జ‌న గ‌ణన షురూ.. ఎన్యూమ‌రేట‌ర్లు 33 ప్రశ్నలు ఇవే..

యుద్ధం ముగియ‌బోతుంద‌ని సంకేతాలు.. భారీ లాభాల్లో ట్రేడ‌వుతున్న స్టాక్ మార్కెట్లు..

ఎల‌క్ట్రిక్ కార్ల కోసం గూగుల్ మ్యాప్స్‌లో ప్ర‌త్యేక ఫీచ‌ర్లు.. ఇక చార్జింగ్ అయిపోతుంద‌న్న బెంగ ఉండ‌దు..

Advertisement
Advertisement