త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Layoffs | SAPలో లేఆఫ్స్‌.. 10 వేలకుపైగా ఉద్యోగుల‌పై వేటుకు రంగం సిద్ధం!

Layoffs | జర్మనీకి చెందిన సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఎస్ఏపీ (SAP) భారీ సంఖ్య‌లో ఉద్యోగుల‌ను తొల‌గించేందుకు (Layoffs) సిద్ధమవుతున్న‌ది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు 10 వేల‌కుపైగా ఉద్యోగుల‌ను తొలగించేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేస్తుంది.

G

International | Published On Nov 27, 2026, 9.08 am IST

Layoffs | SAPలో లేఆఫ్స్‌.. 10 వేలకుపైగా ఉద్యోగుల‌పై వేటుకు రంగం సిద్ధం!
Advertisement

Layoffs | త్రినేత్ర న్యూస్‌: జర్మనీకి చెందిన సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఎస్ఏపీ (SAP) భారీ సంఖ్య‌లో ఉద్యోగుల‌ను తొల‌గించేందుకు (Layoffs) సిద్ధమవుతున్న‌ది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు 10 వేల‌కుపైగా ఉద్యోగుల‌ను తొలగించేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేస్తుంది. మొత్తం వ‌ర్క్‌ఫోర్స్‌లో ఇది 9 శాతం. సాఫ్ట్‌వేర్ ఉత్ప‌త్తుల‌తో ఏఐ (AI) టూల్స్‌ను అనుసంధానించ‌డ‌పై సంస్థ‌ దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా ఉద్యోగుల‌ను తొల‌గించాల‌ని నిర్ణ‌యించింది. ఇప్పటికే కార్మిక సంఘాల‌తో చర్చలు కూడా జరుపుతున్నట్టు తెలుస్తున్న‌ది. చ‌ర్చ‌ల త‌ర్వాత ఎంతమందిని లేఆఫ్ చేస్తారనే విష‌య‌మై స్ప‌ష్ట‌త రానుంది.

అన్ని విభాగాల్లో ఈ కోత‌లు ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌త్యేకంగా ప్రాడక్ట్, ఇంజినీరింగ్, సేల్స్ విభాగాల‌పై అధిక ప్ర‌భావం ఉండ‌నుంద‌ని నివేదిక‌లు పేర్కొన్నాయి. మూడేండ్ల వ్య‌వ‌ధిలో భారీ సంఖ్య‌లో ఉద్యోగుల‌ను తొల‌గించ‌డం ఇది రెండోసారి. 2024లో సుమారు 9 వేల నుంచి 10 వేల మందికి లేఆఫ్ ప్ర‌క‌టించింది. అయితే అప్పుడు ఉద్యోగుల కోసం వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ప్రక్రియ స్వచ్ఛంద పదవీ విరమణ (Voluntary Departures) ద్వారా జరుగుతుందా లేదా నేరుగా ఉద్యోగాల నుండి తొలగిస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, ప్రస్తుత లేఆఫ్స్‌తో పాటు సంస్థ‌ నాయకత్వంలో కూడా మార్పులు జరగనున్నట్టు తెలుస్తున్న‌ది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా SAPలో సుమారు 1,13,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

భార‌త్‌పై ప్ర‌భావం ఎంత‌?

ప్రపంచవ్యాప్తంగా SAP ప్రకటించనున్న 10,000 మంది ఉద్యోగుల కోతల్లో భారతదేశంలోని ఉద్యోగులపై ఎంత మేర ప్రభావం ఉంటుందనే దానిపై ఇంకా అధికారిక స్పష్టత రాలేదు. అయితే, ఇక్క‌డున్న భారీ వర్క్‌ఫోర్స్ దృష్ట్యా SAP Labs Indiaపై ప్రభావం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా SAPకి ఉన్న అతిపెద్ద ఆర్‌ అండ్ డీ కేంద్రాలలో భారత్‌ ఒకటి. బెంగళూరు, హైదరాబాద్, గురుగ్రామ్, ముంబై, పుణే, న్యూఢిల్లీ, కోల్‌కతాలో సుమారు 18,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కోతల్లో ప్రధానంగా ప్రాడక్ట్ డెవలప్‌మెంట్, ఇంజినీరింగ్, సేల్స్ విభాగాలపై దృష్టిసారించ‌డంతో.. ఇక్క‌డున్న SAP ల్యాబ్స్ ప్రధానంగా పరిశోధన, ప్రాడక్ట్ ఇంజినీరింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తుండ‌టంతో ఈ విభాగాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. 2023లో SAP భారత్‌లో పునర్వ్యవస్థీకరణ చేపట్టినప్పుడు బెంగళూరు, గురుగ్రామ్ కార్యాలయాల నుంచి సుమారు 300 మందిని తొలగించింది.

Advertisement
Advertisement