US Tariff | అమెరికా సుంకాల సెగ..! యూఎస్‌లో భారత ఉత్పత్తుల ధరలు పెరుగుతాయా?
US Tariff | ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న అమెరికా.. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్‌తో వాణిజ్య సంబంధాల విషయంలో మరోసారి కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) తొలి దశకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక అవగాహనకు వచ్చినప్పటికీ.. తాజాగా ప్రతిపాదించిన సుంకాలు.. చర్చలను మళ్లీ మొదటికి తీసుకొచ్చాయి.
US Tariff | ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న అమెరికా.. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్‌తో వాణిజ్య సంబంధాల విషయంలో మరోసారి కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) తొలి దశకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక అవగాహనకు వచ్చినప్పటికీ.. తాజాగా ప్రతిపాదించిన సుంకాలు.. చర్చలను మళ్లీ మొదటికి తీసుకొచ్చాయి. భారత్ సహా 14 దేశాలపై 25 శాతం వరకు అదనపు సుంకాలు విధించే ప్రతిపాదనను అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (యూఎస్‌టీఆర్) ముందుకు తెచ్చింది. అయితే, వాణిజ్య ఒప్పందం కుదిరితే భారత్‌పై ఈ సుంకాన్ని 17 శాతానికి తగ్గించే అవకాశం ఉన్నట్లు సంకేతాలిచ్చింది. దీంతో అమెరికా మార్కెట్‌పై ఆధారపడిన భారత ఎగుమతిదారుల్లో ఆందోళన మొదలైంది.
మళ్లీ సుంకాలు ఎందుకు?
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే కస్టమ్స్ సుంకాన్నే టారిఫ్ అంటారు. ఈ భారం దిగుమతిదారులపై పడుతుంది. ఫలితంగా విదేశీ వస్తువుల ధరలు పెరుగుతాయి. దీంతో దేశీయ ఉత్పత్తులకు పోటీ తగ్గి స్థానిక పరిశ్రమలకు మేలు జరుగుతుంది. ప్రభుత్వాలకు ఆదాయం కూడా సమకూరుతుంది. అమెరికా ప్రస్తుతం ఈ సుంకాలను వాణిజ్య చర్చల్లో ఒత్తిడి సాధనంగా ఉపయోగిస్తోంది. తన వాణిజ్య లోటును తగ్గించుకోవడం, దేశీయ తయారీ రంగాన్ని కాపాడుకోవడం, ఇతర దేశాలతో తమకు అనుకూలమైన ఒప్పందాలు కుదుర్చుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. భారత్, చైనా వంటి దేశాలు అమెరికా ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకాలు, కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయని వాషింగ్టన్ ఆరోపిస్తోంది.
అమెరికా మార్కెట్ భారత్‌కు కీలకం
2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి అమెరికా భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత ఎగుమతులు 0.92 శాతం పెరిగి 87.3 బిలియన్ డాలర్లకు చేరాయి. అదే సమయంలో అమెరికా నుంచి దిగుమతులు 15.95 శాతం పెరిగి 52.9 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యాయి. దీంతో ఇరు దేశాల మధ్య భారత్‌కు ఉన్న వాణిజ్య మిగులు 2024-25లోని 40.89 బిలియన్ డాలర్ల నుంచి 34.4 బిలియన్ డాలర్లకు తగ్గింది. వస్త్రాలు, ఔషధాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలకు అమెరికా ప్రధాన ఎగుమతి మార్కెట్‌గా ఉంది. తాజా సుంకాల పెంపు అమల్లోకి వస్తే ఈ రంగాల ఉత్పత్తుల ధరలు పెరిగి అమెరికా మార్కెట్‌లో పోటీతత్వం తగ్గే ప్రమాదం ఉంది.
ఏడాదిన్నరలో మారిన అమెరికా టారిఫ్ విధానం
భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాల విధానం గత ఏడాదిన్నరలో పలుమార్లు మారింది. 2025 ఆగస్టు 7 నుంచి భారత ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధించింది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను కారణంగా చూపుతూ మరో 25 శాతం జరిమానా సుంకాన్ని జతచేసింది. దీంతో మినహాయింపు పొందిన ఉత్పత్తులను మినహాయిస్తే.. కొన్ని భారతీయ వస్తువులపై మొత్తం సుంకం 50 శాతానికి చేరింది. 2026 ఫిబ్రవరిలో ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహనతో పరస్పర సుంకాలను 18 శాతానికి తగ్గించేందుకు అమెరికా అంగీకరించింది. అయితే, ఫిబ్రవరి 20న అమెరికా సుప్రీంకోర్టు ఈ పరస్పర సుంకాల విధానాన్ని కొట్టివేయడంతో పరిస్థితి మళ్లీ మారింది. అనంతరం ట్రంప్ ప్రభుత్వం 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301ను ఉపయోగించి.. బలవంతపు కార్మిక విధానాల ఆరోపణలతో భారత్ సహా 60 దేశాలపై 10 నుంచి 12.5 శాతం సుంకాలు విధించింది.
భారత్‌పై యూఎస్‌టీఆర్ తాజా ఆరోపణలు
నవంబర్ 25న యూఎస్‌టీఆర్ మరో కీలక ప్రతిపాదనను వెల్లడించింది. 14 దేశాల్లో పారిశ్రామిక తయారీ సామర్థ్యం అవసరానికి మించి పెరుగుతోందన్న ఆరోపణలపై చేపట్టిన రెండో సెక్షన్ 301 దర్యాప్తు ఫలితాలను విడుదల చేసింది. ఇందులో భారత్‌పైనా 25 శాతం వరకు అదనపు సుంకాలు విధించాలని ప్రతిపాదించింది. అయితే, ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే ఈ రేటును 17 శాతానికి సవరించే అవకాశం ఉందని పేర్కొంది. భారత్ అమలు చేస్తున్న మేక్ ఇన్ ఇండియా, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు (పీఎల్‌ఐ), పారిశ్రామిక విస్తరణ, కార్మిక రక్షణ విధానాలు, ఆర్థిక కార్యకలాపాలు, మార్కెట్ ప్రవేశంపై ఆంక్షలు ప్రపంచవ్యాప్తంగా అధిక ఉత్పత్తికి కారణమవుతున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. ముఖ్యంగా ఉక్కు, సౌర విద్యుత్, ఔషధాలు, వైద్య పరికరాలు, సమాచార, కమ్యూనికేషన్ సాంకేతిక రంగాలను తన నివేదికలో ప్రస్తావించింది.
ఆరోపణలను తోసిపుచ్చిన భారత్..
అమెరికా ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. దేశంలోని ఏ రంగంలోనూ నిర్మాణాత్మకంగా అవసరానికి మించిన ఉత్పత్తి సామర్థ్యం లేదని స్పష్టం చేసింది. వాణిజ్యపరమైన సమస్యలుంటే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చల పరిధిలోనే పరిష్కరించుకోవాలని పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనకు అనుగుణంగా త్వరగా ఒప్పందాన్ని పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నట్లు వెల్లడించింది. ఈ మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక రూపురేఖలపై అంగీకారానికి వచ్చాయి. ఇందులో భాగంగా అమెరికా పారిశ్రామిక ఉత్పత్తులతోపాటు విస్తృత శ్రేణిలో వ్యవసాయ, ఆహార ఉత్పత్తులపై భారత్ దిగుమతి సుంకాలను తగ్గించడం లేదా పూర్తిగా తొలగించడం వంటి అంశాలు ఉన్నాయి. మరోవైపు, భారత ఉత్పత్తులపై 18 శాతం పరస్పర సుంకం విధించేందుకు అమెరికా అంగీకరించింది. అంతేకాకుండా వచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి ఇంధన ఉత్పత్తులు, విమానాలు, వాటి విడిభాగాలు, విలువైన లోహాలు, సాంకేతిక ఉత్పత్తులు, కోకింగ్ కోల్ తదితరాలను కలిపి 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు కొనుగోలు చేయాలని భారత్ ఉద్దేశించింది. ఇరు దేశాలు వాణిజ్యేతర అడ్డంకులను తొలగించుకోవాలని కూడా నిర్ణయించాయి. ఒప్పందంలో అంగీకరించిన సుంకాల రేట్లను ఏదైనా దేశం మార్చితే.. దానికి అనుగుణంగా మరో దేశం కూడా తన నిర్ణయాలను మార్చుకునే అవకాశం కల్పించారు.
పోటీ దేశాల కంటే భారత్‌కు ఎంత ప్రయోజనం?
అమెరికాతో ఒప్పందం ద్వారా భారత ఎగుమతిదారులకు సుంకాల భారం తగ్గించడంతోపాటు దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలతో పోలిస్తే మెరుగైన మార్కెట్ అవకాశాలు పొందాలని భారత్ భావిస్తోంది. ముఖ్యంగా బంగ్లాదేశ్, వియత్నాం, ఇండోనేషియా, థాయ్‌లాండ్, చైనా వంటి దేశాలతో పోటీలో భారత్‌కు ప్రయోజనం కలగాలని చూస్తోంది. యూఎస్‌టీఆర్ ప్రతిపాదన ప్రకారం ఒప్పందం కుదిరితే భారత్‌పై 17 శాతం సుంకం పడుతుంది. బంగ్లాదేశ్, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ వంటి దేశాలపై 18 శాతం సుంకం ఉండటంతో భారత్‌కు కేవలం ఒక శాతం మాత్రమే ప్రయోజనం లభిస్తుంది. వియత్నాం, చైనాలపై 20 శాతం సుంకం ఉండటంతో వాటితో పోలిస్తే మూడు శాతం మేర భారత్‌కు వెసులుబాటు ఉంటుంది. ఒప్పందం కుదరకపోతే భారత్‌పై సుంకాలు 25 శాతానికి పెరిగే అవకాశం ఉంది.
పొరుగు దేశాల నుంచి పోటీ ముప్పు
అమెరికా తాజా దర్యాప్తు కేవలం 14 వాణిజ్య భాగస్వామ్య దేశాలకే పరిమితం కావడం భారత్‌కు మరో సమస్యగా మారే అవకాశం ఉంది. పాకిస్థాన్, శ్రీలంక, ఫిలిప్పీన్స్, టర్కీ వంటి దేశాలు ఈ అదనపు సుంకాల పరిధిలోకి రాకపోవచ్చు. అదే జరిగితే ఆయా దేశాల ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్‌లో భారత ఉత్పత్తుల కంటే ధరల పరంగా ప్రయోజనం లభిస్తుంది. దీంతో భారత ఎగుమతులపై పోటీ మరింత పెరిగే ప్రమాదముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజా సుంకాల ప్రతిపాదనలపై అభ్యంతరాలు, సూచనలు సమర్పించేందుకు యూఎస్‌టీఆర్ 2027 జనవరి 5 వరకు గడువు ఇచ్చింది. జనవరి 25న బహిరంగ విచారణ నిర్వహించనుంది. ఆ తర్వాత సుంకాల విధింపుపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఒప్పందాన్ని త్వరగా పూర్తి చేయాలని భారత ఎగుమతిదారులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే, ఏకపక్ష ఒత్తిడికి తలొగ్గి ఒప్పందం చేసుకోవద్దని ఆర్థిక పరిశోధనా సంస్థ జీటీఆర్‌ఐ (GTRI) సూచిస్తోంది. 100 శాతం వరకు విధించే అవకాశం ఉన్న 'గ్రాహం టారిఫ్'ల ముప్పును దృష్టిలో ఉంచుకున్నప్పటికీ.. దేశీయ, ఎగుమతి అవసరాల కోసం చేపడుతున్న పారిశ్రామిక విస్తరణను భారత్ సమర్థంగా సమర్థించుకోవాలని అభిప్రాయపడింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో తొందరపడకుండా.. భారత పరిశ్రమలు, ఎగుమతిదారుల ప్రయోజనాలను కాపాడేలా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.





