త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manan Kumar Mishra | మోదీ గారూ.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీ సంస్థే

"మోదీ జీ.. మై లార్డ్‌.. మీరు మా సంర‌క్ష‌కులు, మా మార్గ‌ద‌ర్శి. మీరు ప్ర‌పంచంలోనే అత్యంత స‌మర్థుడైన‌, శ‌క్తిమంత‌మైన నాయ‌కుడు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీ సంస్థే. మీ కోసమే మేం పనిచేస్తున్నాం"... అని నాడు ఇదే మనన్ కుమార్ మిశ్రా... నరేంద్ర మోదీని వేనోళ్ల కొనియాడారు.

D

National | Published On Aug 14, 2026, 4.49 pm IST

Manan Kumar Mishra | మోదీ గారూ.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీ సంస్థే
Advertisement
  • 12 ఏళ్లుగా బార్ కౌన్సిల్‌కు చైర్మ‌న్‌గానే
  • ఆయ‌న చుట్టూ ఎన్నో వివాదాలు
  • బీసీఐ వేదిక‌గా రాజ‌కీయ ప్ర‌క‌ట‌న‌లు
  • మనన్ రాజీనామా చేయాలి.. సీజేపీ డిమాండ్‌

Manan Kumar Mishra | త్రినేత్ర‌.న్యూస్ : బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) చైర్మన్, రాజ్య‌స‌భ ఎంపీ మనన్ కుమార్ మిశ్రా (Manan Kumar Mishra) తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక న్యాయ విద్యాసంస్థ నల్సార్ యూనివర్సిటీ (NALSAR University of Law) విద్యార్థులకు వ్య‌తిరేకంగా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం వివాదాస్ప‌ద‌మైంది. 2026లో లా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకుంటున్న విద్యార్థుల‌ న్యాయవాదులుగా (Advocates) ఎన్‌రోల్‌మెంట్‌ను నిలిపివేయాల‌ని బార్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణ‌యం పెద్ద ఎత్తున దుమారానికి దారి తీసింది. ఈ నిర్ణ‌యంపై అన్ని వ‌ర్గాల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. బార్ కౌన్సిల్ నిర్ణ‌యాన్ని స్వ‌యంగా భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్ సైతం తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ఈ అంశంలో బీసీఐ జోక్యం అన‌వ‌స‌ర‌మ‌ని తేల్చి చెప్పారు. ఈ వివాదం వేళ మ‌న‌న్ కుమార్ మిశ్రా ప్ర‌ముఖంగా వార్త‌ల్లో నిలిచారు.

ఇంత‌కీ ఎవ‌రీ మ‌న‌న్ కుమార్ మిశ్రా..

మిశ్రా బీహార్ రాష్ట్రం గోపాల్‌గంజ్ జిల్లాకు చెందిన వ్య‌క్తి. ఆయ‌న ఛ‌ప్రాలోని రాజేంద్ర కాలేజీ నుంచి బీఎస్సీ పూర్తి చేసి పాట్నా లా కాలేజీ నుంచి ఎల్ఎల్‌బీ ప‌ట్టా పొందారు. అతను తన బ్యాచ్‌లో గోల్డ్‌మెడ‌లిస్ట్‌. న్యాయ‌విద్య పూర్తైన త‌ర్వాత 1980లో గోపాల్‌గంజ్ సివిల్ కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించిన మిశ్రా.. 1982లో పాట్నా హైకోర్టులో లాయర్‌గా త‌న‌ ప్రస్థానాన్ని మొద‌లుపెట్టారు. 2009లో సుప్రీంకోర్టు న్యాయ‌వాదిగా ప్రమోట్ అయ్యి సీనియ‌ర్ అడ్వొకేట్‌గా గుర్తింపు పొందారు.

2014లో బీజేపీలోకి

ఆయ‌న సీనియ‌ర్ అడ్వొకేటే కాదు.. ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు కూడా. 2009లో బహుజన్ సమాజ్ పార్టీ (BSP), 2010లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో ఉన్నారు. 2010 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2013లో హ‌స్తం పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. 2014లో నరేంద్ర మోదీ నాయకత్వానికి ఆకర్షితులై అధికారికంగా భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు.

వ‌రుస‌గా ఏడోసారి బీసీఐ చైర్మ‌న్‌గా

బీజేపీకి చేరిన ఏడాదే ఆయ‌న బార్ కౌన్సిల్ ఇండియాకు చైర్మ‌న్‌గా ఎన్నిక‌య్యారు. సుప్రీంకోర్టు అడ్వొకేట్ అయిన కేవ‌లం ఐదేళ్ల‌లోనే ఆయ‌న ఈ అత్యున్న‌త ప‌ద‌వి చేప‌ట్ట‌డం విశేషం. అప్ప‌టి నుంచి ఆయ‌న ఇదే ప‌ద‌విలో కొన‌సాగుతూ వ‌స్తున్నారు. 2025 లో రికార్డు స్థాయిలో వ‌రుస‌గా ఏడోసారి ఆ ప‌ద‌వికి ఎన్నిక‌య్యారు. సాధార‌ణంగా బీసీఐ చైర్మ‌న్‌ను రెండేళ్ల కాల‌ప‌రిమితికి ఎన్నుకుంటుంటారు. కానీ అసాధార‌ణ రీతిలో ఆయ‌న 12 ఏళ్లు నిరంత‌రాయంగా ఆ ప‌ద‌విలో కొన‌సాగుతుండ‌టం గ‌మ‌నార్హం.

బీజేపీ రాజ్య‌స‌భ ఎంపీ

ఆయ‌న బీహార్ నుంచి బీజేపీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు. 2024 ఆగ‌స్టులో లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి లోక్‌సభకు ఎన్నిక కావడంతో బీహార్‌లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో మనన్ కుమార్ మిశ్రా బీజేపీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన రాజ్య‌స‌భ‌ పదవీ కాలం 2028 వరకు కొనసాగ‌నుంది.

ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు..

బీసీఐ చైర్మ‌న్‌గా మనన్ కుమార్ మిశ్రా ఏక‌ప‌క్ష ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. చట్టపరమైన నిబంధనలు, పునఃసమీక్షకు అవకాశం లేకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా ప్ర‌క‌ట‌న జారీ చేసేముందు కౌన్సిల్‌లో ఎలాంటి సామూహిక చ‌ర్చ‌లు జ‌ర‌కుండానే త‌న సొంత నిర్ణ‌యాల‌తో ప్ర‌క‌ట‌న‌లు జారీ చేస్తార‌న్నది ప్ర‌చారం.

మోదీపై మ‌న‌న్ కుమార్ మిశ్రా ప్రశంస‌లు

మనన్ కుమార్ మిశ్రా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని పలు సందర్భాల్లో కొనియాడారు. ప్ర‌ధాని మోదీ గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌నపై ప్ర‌శంస‌లు కురిపించారు. మార్చి 2014లో గుజ‌రాత్‌లోని గాంధీ న‌గ‌ర్‌లో జ‌రిగిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్వ‌ర్ణోత్స‌వ ముగింపు వేడుక‌ల్లో చైర్మ‌న్ హోదాలో ప్ర‌సంగించిన మ‌న‌న్ కుమార్.. మోదీని మ‌హాత్మా గాంధీకి పున‌ర్జ‌న్మ‌ రూపంగా అభివ‌ర్ణించారు. దేశాన్ని సరైన మార్గంలో నడిపించే నాయకత్వ లక్షణాలు ఆయనలో ఉన్నాయని కొనియాడారు. ఆ త‌ర్వాత 2016లో సైతం "మై లార్డ్‌.. మీరు మా సంర‌క్ష‌కులు, మా మార్గ‌ద‌ర్శి. మీరు ప్ర‌పంచంలోనే అత్యంత స‌మర్థుడైన‌, శ‌క్తిమంత‌మైన నాయ‌కుడు" వంటి ప‌దాల‌తో మోదీని ఆకాశానికెత్తుతూ ఓ లేఖ రాశారు. ఆ లేఖ‌లో "బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీ సంస్థే" అని మెన్ష‌న్ చేయ‌డం అప్ప‌ట్లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కుదారితీసింది.

BCI వేదికగా రాజకీయ ప్రకటనలు

మ‌న‌న్ కుమార్ మిశ్రా త‌న రాజ‌కీయ ప్ర‌క‌ట‌న‌ల‌కు బార్ కౌన్సిల్‌ను ఉప‌యోగించుకున్నారు. 2014 లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు కొన్ని రోజుల‌ ముందు మిశ్రా వార‌ణాసిలో ఓ వారం పాటు మ‌కాం వేసి బీజేపీ కోసం ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వార‌ణాసి బీజేపీ కార్యాల‌యంలో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ.. భార‌తదేశ తదుప‌రి ప్ర‌ధాన మంత్రిగా న‌రేంద్ర మోదీకి త‌న పూర్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఉన్న 17 ల‌క్ష‌ల‌ మంది న్యాయవాదుల తరఫున తాను ఈ మాట చెబుతున్న‌ట్లు వ్యాఖ్యానించారు. అంతేకాదు ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌క‌పోతే 2019లో బీజేపీకి ఓటు వేయొద్ద‌ని న్యాయ‌వాదుల‌ను కోరుతానంటూ వ్యాఖ్యానించారు. ఆయ‌న ఓవైపు రాజ‌కీయాలు, మ‌రోవైపు బార్ కౌన్సిల్‌ను అడ్డుపెట్టుకుని పెద్దల అండదండలతో న‌చ్చిన‌ట్టు చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

అసలు వివాదం ఏంటి?

జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ (NEET) పరీక్షల రద్దు, తదితర అంశాలపై 'చలో సంసద్' పేరిట ఆందోళనకారులు నిరసన చేపట్టారు. వారిపై పోలీసులు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. నల్సార్ స్నాతకోత్సవానికి ఆయనను ముఖ్య అతిథిగా పిలవొద్దని కొందరు విద్యార్థులు డిమాండ్ చేశారు.

ఇది కూడా చ‌ద‌వండి.. విద్యార్థుల‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు వాళ్లెవ‌రు..? బీసీఐపై సీజేఐ ఆగ్ర‌హం

దీనిపై సీరియస్ అయిన BCI, న్యాయవ్యవస్థను గౌరవించని వారు లాయర్లు కాలేరంటూ తొలుత విద్యార్థులందరిపైనా బ్యాన్ విధించింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ అజయ్ మాకెన్ తదితరులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది పూర్తిగా ఏకపక్ష, చట్టవిరుద్ధ నిర్ణయం అని విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు BCI వెనక్కి తగ్గింది. ఈ మేరకు BCI చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా సర్క్యులర్ జారీ చేశారు. 2026 బ్యాచ్ విద్యార్థుల్లో చాలా మంది అమాయకులని (innocent), సీజేఐని అగౌరవపరిచే ఉద్దేశం వారికి లేదని తాజా సర్క్యులర్‌లో BCI పేర్కొంది. కొందరు టీచర్లు, బయటి వ్యక్తులే (outsiders) ఉద్దేశపూర్వకంగా ఈ అమాయక విద్యార్థులను రెచ్చగొట్టారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందినట్లు కౌన్సిల్ తెలిపింది. ఏ తప్పు చేయని విద్యార్థులు ఈ వివాదం వల్ల నష్టపోకూడదనే ఉద్దేశంతోనే తాము ఇచ్చిన పాత ఆర్డర్‌ను సవరిస్తున్నట్లు చైర్మన్ వెల్లడించారు. నల్సార్ విద్యార్థులంతా తమకు నచ్చిన స్టేట్ బార్ కౌన్సిల్‌లో (State Bar Councils) అడ్వకేట్లుగా ఎన్‌రోల్ (Enrolment) చేసుకోవచ్చని BCI స్పష్టం చేశారు.

ఇది కూడా చ‌ద‌వండి.. నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత

సీజేపీ ఎంట్రీ.. మనన్ రాజీనామా చేయాలని డిమాండ్‌

ఈ వివాదంలోకి కాక్రోచ్ జ‌న‌త‌పార్టీ ఎంట్రీ ఇచ్చింది. బార్ కౌన్సిల్ చైర్మ‌న్ మ‌న‌న్ కుమార్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేసింది. “నైతిక బాధ్యత వహించి మనన్ కుమార్ మిశ్రా తన పదవికి రాజీనామా చేయాలి. కోర్టుల లోపల, బయట ఉన్న బొద్దింక‌లే ఇది జరిగేలా చూడాలి” అని కాక్రోచ్ జ‌న‌తాపార్టీ అధికార ప్ర‌తినిధి సౌర‌వ్ దాస్ (Saurav Das) ఎక్స్ వేదిక‌గా ట్వీట్ పెట్టారు.

Also Read..

స్వాతంత్య్రం సిద్దించిన నాడే భారత్‌ను ముక్కలు చేయాలని చూసిన వారి కథ

సీఎం రేవంత్ కేబినెట్ నిర్ణ‌యాలు ఇవే..

రాజు వెడ్స్ రాంబాయి హీరోతో నాగ‌దుర్గ రొమాన్స్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో శ‌నార్తి

Advertisement
Advertisement