త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Sanjay | డన్నింగ్ క్రూగర్, బై పోలార్ డిసార్డర్ జబ్బులతో రేవంత్ బాధపడుతున్నరు

MLA Sanjay | రేవంత్‌రెడ్డి డన్నింగ్ క్రూగర్, బై పోలార్ డిసార్డర్ జబ్బులతో బాధ పడుతున్నారని ఎమ్మెల్యే సంజ‌య్ విమ‌ర్శించారు. ఈ నవీన, సైన్స్ యుగంలో కూడా రేవంత్ క్షుద్ర భాష మాట్లాడుతున్నారన్నారు.

S

Telangana | Published On Aug 14, 2026, 3.21 pm IST

MLA Sanjay | డన్నింగ్ క్రూగర్, బై పోలార్ డిసార్డర్ జబ్బులతో రేవంత్ బాధపడుతున్నరు
Advertisement
  • సైన్స్ యుగంలో కూడా క్షుద్ర భాష మాట్లాడుతున్నరు
  • ఆయ‌న ఆలోచ‌న, భాష‌లో మార్పు వ‌చ్చేలా కుటుంబ స‌భ్యులు డాక్ట‌ర్‌కు చూపించాలి
  • రేవంత్ తన ఇంటి పేరును అబద్దాలు, అజ్ఞానంగా మార్చుకోవాలి
  • మీడియా స‌మావేశంలో రేవంత్‌పై ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఘాటు విమ‌ర్శ‌లు

త్రినేత్ర‌.న్యూస్: రేవంత్‌రెడ్డి డన్నింగ్ క్రూగర్, బై పోలార్ డిసార్డర్ జబ్బులతో బాధ పడుతున్నారని కోరుట్ల‌ ఎమ్మెల్యే సంజ‌య్ విమ‌ర్శించారు. డన్నింగ్ క్రూగర్ సిండ్రోమ్ అంటే ఏమి తెలవకున్నా తెలిసినట్టు మాట్లాడటమ‌ని, బై పోలార్ డిజార్డర్ అంటే కొన్ని నిమిషాల్లోనే పరస్పర విరుద్ధంగా మాట్లాడటమ‌ని పేర్కొన్నారు. ఈ నవీన, సైన్స్ యుగంలో కూడా రేవంత్ క్షుద్ర భాష మాట్లాడుతున్నారన్నారు. రేవంత్‌ను అతని భార్య డాక్టర్‌కు చూపించాలని ఎద్దేవా చేశారు. రేవంత్ ఆలోచనలో, భాషలో కుటుంబ సభ్యులు మార్పు తీసుకురావాలన్నారు. తెలంగాణ భ‌వ‌న్ అంటే అస్తిత్వం... కాంగ్రెస్ అంటే స్కామ్ అని విమ‌ర్శించారు. తెలంగాణ భవన్ నిర్మించి 20 ఏళ్లు అయిన సందర్భంగా శుక్ర‌వారం ఆయ‌న‌ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియ‌జేశారు.

రోడ్డు మీద తిరిగేవాళ్లు కూడా అలా మాట్లాడ‌ట్లే...

అనంత‌రం మీడియా స‌మావేశంలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న క్షుద్ర పూజలు, చేతబడుల భాష చెత్త భాష. చేతబడులంటూ రేవంత్ తన చెత్త బుద్ధిని బయట పెట్టుకున్నారు. క్షుద్ర పూజలు చేసే రేవంత్‌సీ ఎం అయ్యారా? రోడ్డు మీద తిరిగేవాళ్లు కూడా క్షుద్ర పూజల గురించి మాట్లాడటం లేదు. తెలంగాణ ప్రజలకు చేతబడి చేసే రేవంత్ అధికారంలోకి వచ్చారా? ఇప్పటికైనా సీఎం జ్ఞానం తెచ్చుకుని ప్రవర్తించాలి.

బీడీ కార్మికుల కాల‌మ్ పెట్ట‌లే..

కొత్త పింఛన్ దరఖాస్తులో బీడీ కార్మికుల కాలమ్ పెట్టలేదు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు బీడీ కార్మికులను పట్టించుకోలేదు. కేసీఆర్ సీఎం అయిన తర్వాతనే బీడీ కార్మికులకు పింఛన్ ఇచ్చారు. కోరుట్ల నియోజకవర్గంలో ఎక్కువ మంది బీడీ కార్మికులు ఉంటారు. బీడీ కార్మికులకు ఉన్న పింఛన్లు తీసివేస్తారా? కాంగ్రెస్ అంటేనే స్కామ్. పింఛన్లు ఇవ్వడానికి పైసలు వసూలు చేస్తున్నారు. అందాల పోటీలకు పెట్టిన ఖర్చు బీడీ కార్మికులకు సంవత్సరం పాటు పింఛన్లు ఇవ్వొచ్చు.

పెళ్ల‌ప్పుడు ఇవ్వాల్సింది పిల్ల‌లు పుట్టినంక‌ ఇస్తున్న‌రు..

కేసీఆర్ 45 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారు. కేసీఆర్ కిట్ తీసివేశారు. కల్యాణలక్ష్మీ పథకం రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక సంతాన లక్ష్మీ పథకంగా మారింది. పెండ్లప్పుడు ఇవ్వాల్సిన కల్యాణ లక్ష్మి చెక్‌ను పిల్లలు పుట్టాక ఇస్తున్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి కనీసం 2,000 రూపాయలు ఇవ్వడం లేదు.

పార్లమెంట్‌లో తెలంగాణ మాట ఎవరైనా ఎత్తుతున్నారా? బీజేపీ నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 8 మంది లోక్‌సభ ఎంపీలు ఉన్నారు. తెలంగాణను పాకిస్థాన్‌తో పోలిస్తే పార్లమెంట్‌లో ఎవరూ మాట్లాడలేదు. రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో వేసి పంచుతారంట. వాళ్లు శాశ్వతంగా ఉంటారా? కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏళ్లు కూడా ఉండదు. ప‌బ్లిసిటీకి పెట్టే ఖర్చుతో కొన్నేళ్లు పెన్షన్లు ఇవ్వొచ్చు. మూడు లక్షల పెన్షన్లు కత్తిరించి రెండు లక్షలే కొత్తగా ఇస్తారా? రేషన్ షాపుల్లో మా ఫొటోలు పెట్టాలని ఢిల్లీ వాళ్లు వస్తారు. ప్రభుత్వం పబ్లిసిటీకి ఎంత ఖర్చు పెట్టారో బయటపెట్టాలి. క్యాబినెట్ మీటింగ్‌కు మంత్రులు రాని పరిస్థితి ఉంది అని ఎమ్మెల్యే సంజ‌య్ ఎద్దేవా చేశారు.

ఈ విలేక‌రుల స‌మావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. సతీష్ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్ర చారి పాల్గొన్నారు.

Advertisement
Advertisement