త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత

సీజేఐ రాకను వ్యతిరేకించిన నల్సార్ 2026 విద్యార్థులపై విధించిన ఎన్‌రోల్‌మెంట్ బ్యాన్‌ను BCI వెనక్కి తీసుకుంది. అమాయక విద్యార్థులు నష్టపోకూడదని స్పష్టం చేసింది.

J

Hyderabad | Published On Aug 13, 2026, 9.55 pm IST

BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత

సంక్షిప్త సారాంశం

నల్సార్ 2026 బ్యాచ్ విద్యార్థుల అడ్వకేట్ ఎన్‌రోల్‌మెంట్‌పై విధించిన నిషేధాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) వెనక్కి తీసుకుంది. చాలా మంది విద్యార్థులు అమాయకులని, కొందరు టీచర్లు, బయటి వ్యక్తులే వారిని రెచ్చగొట్టారని తాజా సర్క్యులర్‌లో BCI పేర్కొంది. తాజా నిర్ణయంతో విద్యార్థులు తమకు నచ్చిన రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో న్యాయవాదులుగా ఎన్‌రోల్ చేసుకోవచ్చని చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా స్పష్టం చేశారు. అయితే, ఆందోళనలకు కారణమైన వారిపై విచారణ కొనసాగుతుందని, వర్సిటీ ఇచ్చే నివేదిక తర్వాత చర్యలు ఉంటాయని కౌన్సిల్ తెలిపింది.

Advertisement

BCI Withdraws Order | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నల్సార్ యూనివర్సిటీ (NALSAR) 2026 బ్యాచ్ లా విద్యార్థులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) భారీ ఊరటనిచ్చింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant) చీఫ్ గెస్ట్‌గా రావడాన్ని వ్యతిరేకించినందుకు విద్యార్థులందరి ఎన్‌రోల్‌మెంట్‌ను నిలిపివేస్తూ జారీ చేసిన వివాదాస్పద ఆదేశాలను కొన్ని గంటల్లోనే వెనక్కి తీసుకుంది. ఈ మేరకు BCI చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా సరికొత్త సర్క్యులర్ జారీ చేశారు.

అమాయకులకు నష్టం జరగకూడదు

నల్సార్‌లో చదువుతున్న 2026 బ్యాచ్ విద్యార్థుల్లో చాలా మంది అమాయకులని (innocent), సీజేఐని అగౌరవపరిచే ఉద్దేశం వారికి లేదని తాజా సర్క్యులర్‌లో BCI పేర్కొంది. కొందరు టీచర్లు, బయటి వ్యక్తులే (outsiders) ఉద్దేశపూర్వకంగా ఈ అమాయక విద్యార్థులను రెచ్చగొట్టారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందినట్లు కౌన్సిల్ తెలిపింది. ఏ తప్పు చేయని విద్యార్థులు ఈ వివాదం వల్ల నష్టపోకూడదనే ఉద్దేశంతోనే తాము ఇచ్చిన పాత ఆర్డర్‌ను సవరిస్తున్నట్లు చైర్మన్ వెల్లడించారు.

ఎన్‌రోల్‌మెంట్‌కు గ్రీన్ సిగ్నల్

ఈ తాజా సవరణతో 2026లో లా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకుంటున్న నల్సార్ విద్యార్థులంతా తమకు నచ్చిన స్టేట్ బార్ కౌన్సిల్‌లో (State Bar Councils) అడ్వకేట్లుగా ఎన్‌రోల్ (Enrolment) చేసుకోవచ్చని BCI స్పష్టం చేసింది. అయితే, ఈ ఆందోళనల వెనుక ఉన్న అసలు వ్యక్తులెవరు అనేదానిపై Factual inquiry కొనసాగుతుందని, యూనివర్సిటీ వీసీ ఇచ్చే నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని కౌన్సిల్ తేల్చిచెప్పింది.

అసలు వివాదం ఏంటి?

జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ (NEET) పరీక్షల రద్దు, తదితర అంశాలపై 'చలో సంసద్' పేరిట ఆందోళనకారులు నిరసన చేపట్టారు. వారిపై పోలీసులు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. నల్సార్ స్నాతకోత్సవానికి ఆయనను ముఖ్య అతిథిగా పిలవొద్దని కొందరు విద్యార్థులు డిమాండ్ చేశారు.

దీనిపై సీరియస్ అయిన BCI, న్యాయవ్యవస్థను గౌరవించని వారు లాయర్లు కాలేరంటూ తొలుత విద్యార్థులందరిపైనా బ్యాన్ విధించింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ అజయ్ మాకెన్ తదితరులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది పూర్తిగా ఏకపక్ష, చట్టవిరుద్ధ నిర్ణయం అని విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు BCI వెనక్కి తగ్గింది.

Advertisement

తాజావార్తలు

Advertisement