త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

E20 fuel | పెట్రోల్‌లో ఇథ‌నాల్ శాతాన్ని 20%కి మించి పెంచే ఆలోచ‌న లేదు : కేంద్ర మంత్రి

E20 fuel | పెట్రోల్‌లో ప్రస్తుతం 20 శాతంగా ఉన్న ఇథనాల్ (E20 fuel) బ్లెండింగ్‌ను అంత‌కు మించి పెంచే ఉద్దేశం కేంద్ర ప్ర‌భుత్వానికి లేద‌ని పెట్రోలియం, స‌హ‌జ వాయువు శాఖ మంత్రి హ‌ర్దీప్ సింగ్ పురి (Hardeep Singh Puri) స్ప‌ష్టం చేశారు.

D

National | Published On Oct 27, 2026, 3.14 pm IST

E20 fuel | పెట్రోల్‌లో ఇథ‌నాల్ శాతాన్ని 20%కి మించి పెంచే ఆలోచ‌న లేదు : కేంద్ర మంత్రి
Advertisement

E20 fuel | త్రినేత్ర న్యూస్ : పెట్రోల్‌లో ప్రస్తుతం 20 శాతంగా ఉన్న ఇథనాల్ (E20 fuel) బ్లెండింగ్‌ను అంత‌కు మించి పెంచే ఉద్దేశం కేంద్ర ప్ర‌భుత్వానికి లేద‌ని పెట్రోలియం, స‌హ‌జ వాయువు శాఖ మంత్రి హ‌ర్దీప్ సింగ్ పురి (Hardeep Singh Puri) స్ప‌ష్టం చేశారు. గోవాలో జ‌రిగిన 29వ ఎన‌ర్జీ టెక్నాల‌జీ అండ్ ఇన్నోవేష‌న్ మీట్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఈ మేర‌కు క్లారిటీ ఇచ్చారు. ఈ20 ల‌క్ష్యంగా త‌ప్పుడు స‌మాచారం ప్ర‌చారం అవుతోంద‌న్నారు.

"జీవ ఇంధనాల (Biofuels) విష‌యానికొస్తే.. ఈ20 (20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్) లక్ష్యాన్ని చేరుకున్నాం. ఇప్పుడైతే దీనిని పెంచే ఆలోచన లేదు. ఈ అంశంపై త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక‌వేళ‌ భవిష్యత్తులో పెంచాలనే ప్ర‌తిపాద‌న వ‌స్తే.. శాస్త్రీయ అధ్యయనాలు, ఆటోమొబైల్ సంస్థ‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతాం" అని కేంద్ర మంత్రి స్ప‌ష్టం చేశారు. E20 కార్యక్రమం ద్వారా దేశానికి సుమారు రూ. 1.6 లక్ష కోట్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అయింద‌ని చెప్పారు. అందులో రూ. 1.4 లక్ష కోట్ల వరకు నేరుగా రైతులకూ చేరాయని తెలిపారు.

అదేవిధంగా ఈ20 పెట్రోల్ వాడ‌టం వ‌ల్ల వాహ‌న ఇంజన్లు పాడ‌వుతాయంటూ సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని కేంద్ర మంత్రి తీవ్రంగా ఖండించారు. అవ‌న్నీ కుట్ర‌పూరిత‌మైన త‌ప్పుడు ప్ర‌చారాలేన‌ని కొట్టిపారేశారు. దేశంలో రోజుకు 6 కోట్ల వాహనాలు పెట్రోల్‌ బంకులకు వెళ్తున్నాయని చెప్పారు. ఒకవేళ ఇంజన్లు పాడైపోయే మాట నిజమైతే అన్ని చోట్లా వాహనాలు నిలిచిపోవాలి..? కదా అని ప్రశ్నించారు. వాహన ఇంజన్ పాడవుతుందని తప్పుడు ప్రచారం చేసిన ఒక వ్యక్తిపై ఒక ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కేసు కూడా నమోదు చేసిందని మంత్రి ఈ సంద‌ర్భంగా తెలిపారు. 2003 కంటే ముందు తయారైన పాత వాహ‌నాల్లో మాత్ర‌మే ఇంధ‌నం వ‌ల్ల కొన్ని స‌మ‌స్య‌లు త‌లెత్తొచ్చ‌ని వివ‌రించారు. మిగిలిన ప్రమాణాల ప్రకారం తయారైన వాహ‌నాలు ఈ ఇంధ‌నంతో స‌జావుగా న‌డుస్తాయ‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read..

ఫారం-6లో మార్పుల‌పై పిటిష‌న్‌.. ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

న్యూస్‌రూమ్‌లు మూతపడతాయి.. DPDP చ‌ట్టాన్ని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన మీడియా సంస్థ‌లు

గర్భిణీ జర్నలిస్టును తోసేశారంటూ ఆరోప‌ణ‌లు.. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు

Advertisement
Advertisement