త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dhanteras 2026 | ధంతేరస్ వేళ బంగారం, వెండి ధరల్లో భారీ తేడా.. దేనిపై పెట్టుబడి మంచిది?

Dhanteras 2026 | ధంతేరస్ పండుగ నవంబర్ 6న వస్తుండడంతో బంగారం, వెండి కొనుగోళ్లకు ప్రజలు సిద్ధమవుతున్నారు. అయితే ఈ ఏడాది ఈ రెండు లోహాల ధరల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రకారం మంగ‌ళ‌వారం కిలో వెండి ధర రూ.1,94,479కు పడిపోయింది. సెప్టెంబర్ 30న ఇది రూ.2,20,435గా ఉంది.

S

Business | Published On Oct 27, 2026, 2.50 pm IST

Dhanteras 2026 | ధంతేరస్ వేళ బంగారం, వెండి ధరల్లో భారీ తేడా.. దేనిపై పెట్టుబడి మంచిది?
Advertisement

Dhanteras 2026 | ధంతేరస్ పండుగ నవంబర్ 6న వస్తుండడంతో బంగారం, వెండి కొనుగోళ్లకు ప్రజలు సిద్ధమవుతున్నారు. అయితే ఈ ఏడాది ఈ రెండు లోహాల ధరల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రకారం మంగ‌ళ‌వారం కిలో వెండి ధర రూ.1,94,479కు పడిపోయింది. సెప్టెంబర్ 30న ఇది రూ.2,20,435గా ఉంది. అంటే వెండి ధర 11.8 శాతం తగ్గింది. అదే సమయంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,888 నుంచి రూ.1,41,710కు పడిపోయి 4.2 శాతం క్షీణించింది. ఈ నెలలో బంగారంతో పోలిస్తే వెండి ధర దాదాపు మూడు రెట్లు అధికంగా పడిపోయింది.

ధ‌ర‌ల ప‌త‌నం వెనుక కార‌ణాలేమిటి..?

బంగారం, వెండి ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలు ముడి చమురు ధరల పెరుగుదల, అమెరికాలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, వడ్డీ రేట్లపై ఆందోళనలు. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు సుమారు 115 డాలర్లకు చేరగా, అమెరికాలో సెప్టెంబర్ ద్రవ్యోల్బణం 3.7 శాతానికి పెరిగింది. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు బలపడ్డాయి. వడ్డీ రేట్లు పెరిగితే వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారం, వెండి వంటి లోహాలపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే డాలర్ బలపడడం కూడా ఈ లోహాల ధరలపై ఒత్తిడి పెంచుతుంది.

వెండి ప‌త‌నం ఎక్కువ‌..

బంగారంతో పోలిస్తే వెండి ధర ఎక్కువగా పడిపోవడానికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి. వెండిని ఆభరణాల తయారీకే కాకుండా సౌర విద్యుత్ ప్యానళ్లతో సహా అనేక పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తారు. అయితే సౌర ప్యానళ్ల తయారీదారులు ఖర్చులను తగ్గించేందుకు వెండి వినియోగాన్ని తగ్గిస్తున్నారు. దీనికి తోడు వెండి మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. జనవరిలో ఔన్స్ వెండి ధర 121 డాలర్లకు పైగా చేరగా, ప్రస్తుతం సుమారు 54 డాలర్లకు పడిపోయింది. అంటే గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 56 శాతం తగ్గింది. బంగారం ధర మాత్రం దాని రికార్డు స్థాయి నుంచి సుమారు 28 శాతమే తగ్గింది. కేంద్ర బ్యాంకులు బంగారాన్ని నిల్వ చేసుకోవడం కూడా దానికి కొంత మద్దతునిస్తోంది.

ఎందులో పెట్టుబ‌డి పెట్టాలి..

ధంతేరస్ సందర్భంగా వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి ప్రస్తుత ధరలు గత గరిష్ఠ స్థాయితో పోలిస్తే ఆకర్షణీయంగా మారాయి. అయితే వెండి ధరలు మరింత తగ్గే అవకాశం కూడా ఉందని గుర్తుంచుకోవాలి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం, ముడి చమురు ధరలు, తదుపరి ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయి. సంప్రదాయం కోసం నాణేలు, వెండి పాత్రలు కొనేవారు తమ బడ్జెట్‌ను బట్టి నిర్ణయం తీసుకోవచ్చు. పెట్టుబడి కోసం కొనుగోలు చేసేవారు మాత్రం ధరల్లో హెచ్చుతగ్గులను తట్టుకోగల సామర్థ్యాన్ని అంచనా వేయాలి. ఒకేసారి మొత్తం కొనుగోలు చేయకుండా విడతలవారీగా కొనడం ధరల మార్పుల ప్రమాదాన్ని కొంతవరకు తగ్గిస్తుంది. అయితే బంగారం, వెండి రెండూ సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డి మార్గాలే అయిన‌ప్ప‌టికీ సొంత విశ్లేష‌ణ లేదా ఆర్థిక నిపుణుల స‌ల‌హాతో స‌రైన స‌మ‌యంలో పెట్టుబ‌డులు పెట్టాల్సి ఉంటుంద‌ని, లేదంటే భారీ ఎత్తున న‌ష్టం వచ్చే ప్ర‌మాదం ఉంటుంద‌ని విశ్లేష‌కులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement