త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

E20 Petrol | కేంద్రం తీసుకొచ్చిన ఇథనాల్ పెట్రోల్‌కు పొన్నం ప్రభాకర్ మద్దతు.. అదంతా అపోహే అన్న మంత్రి

ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) వాడితే వాహనాలు పాడవుతాయన్న అపోహలపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. దీనివల్ల రైతులకు అపార లాభాలున్నాయని వివరించారు.

J

Telangana | Published On Sep 9, 2026, 4.58 pm IST

E20 Petrol | కేంద్రం తీసుకొచ్చిన ఇథనాల్ పెట్రోల్‌కు పొన్నం ప్రభాకర్ మద్దతు.. అదంతా అపోహే అన్న మంత్రి

సంక్షిప్త సారాంశం

పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో తీసుకుంది. E20 పెట్రోల్ వల్ల వాహనాలు చెడిపోతున్నాయన్న ఫిర్యాదులు రవాణా శాఖకు ఏమీ రాలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. వాహనాల పికప్, మైలేజీ కొద్దిగా తగ్గినప్పటికీ.. పర్యావరణ కాలుష్యం తగ్గడం, రైతులకు గిట్టుబాటు ధర రావడం, విదేశీ మారకద్రవ్యం ఆదా కావడం వంటి లాభాలు ఉన్నాయని వివరించారు. కాలుష్య నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలకు (EVs) 100 శాతం టాక్స్ మినహాయింపు ఇస్తున్నట్లు మంత్రి గుర్తుచేశారు.

Advertisement

E20 Petrol | త్రినేత్ర.న్యూస్ : పర్యావరణ పరిరక్షణ, విదేశీ మారక ద్రవ్యం ఆదా లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 20 శాతం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (E20) వాడకంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇథనాల్ పెట్రోల్ వాడితే వాహనాలు పాడవుతాయన్న వదంతులను ఆయన తోసిపుచ్చారు. దీనివల్ల దేశానికి, ముఖ్యంగా రైతులకు కలిగే అపారమైన లాభాలను సభ వేదికగా వివరించారు.

ఫిర్యాదులు ఏమీ రాలేదు.. స్పేర్ పార్ట్స్ మార్చుకుంటే చాలు

ప్రస్తుతం పెట్రోల్‌లో 80 శాతం శిలాజ ఇంధనం, 20 శాతం ఇథనాల్ (Ethanol) కలుపుతున్నారని, ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల పర్యవేక్షణలో జరుగుతోందని మంత్రి తెలిపారు. ఏప్రిల్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా అన్ని బంకుల్లో ఈ20 పెట్రోల్ సరఫరా అవుతోందన్నారు. అయితే, ఈ పెట్రోల్ వాడకం వల్ల వాహనాలు ఖరాబు అవుతున్నాయంటూ తమ రవాణా శాఖకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు (Complaints) రాలేదని ఆయన స్పష్టం చేశారు.

పాత వాహనాల యజమానులు రబ్బర్, ప్లాస్టిక్ ట్యూబులు వంటి చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ (Spare parts) మార్చుకుని, రొటీన్ సర్వీసింగ్ చేయించుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండదని సూచించారు. ఏప్రిల్ 1 నుంచి తయారయ్యే కొత్త వెహికల్స్ అన్నీ ఈ20 ధ్రువీకరణ (Type approval) నిబంధనలకు అనుగుణంగానే వస్తున్నాయని గుర్తుచేశారు. ఇథనాల్ పెట్రోల్ వాడటం వల్ల వాహనాల పికప్ (Pickup) 3 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందన్నారు. అలాగే మైలేజీలోనూ (Mileage) స్వల్ప తగ్గుదల ఉంటుందని అంగీకరించారు.

మూడు ప్రధాన లాభాలు ఇవే..

మైలేజ్, పికప్ తగ్గినప్పటికీ ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ప్రధానంగా మూడు లాభాలు ఉన్నాయని మంత్రి వివరించారు. మొదటిది, వాహనాల ఉద్గారాలు (Pollution) గణనీయంగా తగ్గుతాయి. రెండవది, ఇంధన దిగుమతులు తగ్గి విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. మూడవది, ఇథనాల్ తయారీకి వాడే చెరకు, మొక్కజొన్న, వరి వంటి వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి.. గ్రామీణ రైతులకు మంచి మద్దతు ధర, అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు.

హైదరాబాద్ మరో ఢిల్లీ కావొద్దు

ఇథనాల్ ఫ్యాక్టరీల వల్ల కాలుష్యం వస్తుందనేది కేవలం అపోహ మాత్రమేనని, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వస్తున్న పొల్యూషన్ ఫ్రీ ఫ్యాక్టరీల వల్ల కాలుష్య ఇబ్బందులు ఉండవన్నారు. రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో 2-3 ఫ్యాక్టరీల సహా మొత్తం 7 ఇథనాల్ ఫ్యాక్టరీలు ఉన్నాయని, పారిశ్రామికవేత్తలు ముందుకువస్తే ఎవరైనా ఫ్యాక్టరీలు నెలకొల్పవచ్చని ఆహ్వానించారు. హైదరాబాద్ నగరం మరో ఢిల్లీలా కాలుష్య కోరల్లో చిక్కుకోకూడదనే ఉద్దేశంతో తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు (EVs) 100 శాతం ట్యాక్స్ మినహాయింపు ఇచ్చినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా సభకు తెలిపారు.

Advertisement
Advertisement