Errolla Srinivas | 9,102 అట్రాసిటీ కేసులైతే.. 32 కేసుల్లోనే శిక్షలా?
Errolla Srinivas | తెలంగాణ రాష్ట్రంలో గత మూడేళ్లలో ఏకంగా 9,102 అట్రాసిటీ కేసులు (Atrocity Cases) నమోదైతే కేవలం 32 కేసుల్లోనే శిక్షలు పడటం ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమని ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ (Errolla Srinivas) మండిపడ్డారు.
- దళితులపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం నిద్రపోతోంది
- ప్రత్యేక డ్రైవ్ పెట్టి పెండింగ్ కేసులను తేల్చాల్సిందే
- డీజీపీని కోరిన ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
Errolla Srinivas | త్రినేత్ర న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో గత మూడేళ్లలో ఏకంగా 9,102 అట్రాసిటీ కేసులు (Atrocity Cases) నమోదైతే కేవలం 32 కేసుల్లోనే శిక్షలు పడటం ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమని ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ (Errolla Srinivas) మండిపడ్డారు. 213 మంది హత్యకు గురికావడం దుర్మార్గమన్నారు. దళితులు, గిరిజనులపై పెరుగుతున్న అట్రాసిటీ దాడి ఘటనలపై మంగళవారం మేడే రాజీవ్ సాగర్, రాంబల్ నాయక్, సాల్మన్ రాజ్ తో వెళ్లి డీజీపీని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రత్యేక డ్రైవ్ పెట్టి పెండింగ్ కేసులపై తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు.
గ్రామ సభల్లో మాట్లాడినా, గుడికి వెళ్లినా, బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నా దళితులు, గిరిజనులపై బహిరంగంగా దాడులు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదు. బాధితులు న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్తే కాలయాపన చేయడం, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడం వల్లనే నేరస్థుల్లో భయం లేకుండా పోయింది.
అక్టోబర్ 1న తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో గత మూడేళ్లలో 9,102 అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ఇందులో 159 మంది ఎస్సీలు, 54 మంది ఎస్టీలు మొత్తం 213 మంది హత్యకు గురయ్యారు. అలాగే 1,305 మంది బాలికలు, మహిళలపై లైంగిక దాడి కేసులు నమోదైతే.. కేవలం 32 కేసుల్లో మాత్రమే కన్విక్షన్ పడటం వ్యవస్థ పనితీరుకు అద్దం పడుతోంది. కేసులు నమోదు చేయడంలోనూ, దర్యాప్తులోనూ, ఎవిడెన్స్ కలెక్షన్‌లోనూ పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. నిబంధనల ప్రకారం వెంటనే అందాల్సిన పరిహారం కోసం బాధితులు సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది.
నల్లగొండలో జుట్టు పట్టి నేలకేసి కొట్టారు
గత ఐదు వారాల్లో జరిగిన కొన్ని ఘటనలు రాష్ట్రంలో దళితుల భద్రత ఏ విధంగా ఉందో కళ్లకు కడుతున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల శివారులో చిలుక ఉదయ్ అనే Dalit యువకుడిని కొందరూ కారులో బలవంతంగా ఎత్తుకెళ్లి, నిర్జన ప్రదేశంలో బట్టలు విప్పించి కర్రలతో, రాళ్లతో కిరాతకంగా కొట్టారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం పీకే మల్లెపల్లిలో గ్రామసభలో మాట్లాడుతున్న గనిపాల్లి మాధవిని కులం పేరుతో దూషించి, చెంపదెబ్బ కొట్టి, జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టారు.
వనపర్తి జిల్లా పెద్ధమందడి మండలం మంగంపల్లిలో ప్రభుత్వ భూమిలో, ఊరి అందరి సహకారంతో నిర్మించిన గ్రామ ఆలయంలోకి ఒక ద దళిత కుటుంపాన్ని రాకుండా అడ్డుకున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కోనేపల్లి, కుచరాలతో పాటు తూప్రాన్ మండలం కిష్టాಪುర్, శివ్వంపేట మండలం నవాబ్‌పేటలో దళితులపై దాడులు జరిగాయి. మనోహరాబాద్ మండలంలో డప్పు కొడతావా అంటూ దళిత సర్పంచ్ చిత్ర రఘుపై దాడి చేసి కేసు నమోదు చేసినా, నాలుగు రోజులు గడిచినా నిందితులను అరెస్ట్ చేయలేదు. దీంతో విసిగిపోయిన బాధితులు అక్టోబర్ 22న మెదక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తల్లపేటలో బతుకమ్మ వేడుకల్లో సర్పంచ్, గిరిజన మహిళ అయిన కుర్సింగ కళావతితో పాటు ఉప సర్పంచ్‌పై సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దాడి చేశారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. దీనిపై సమగ్ర విచారణ జరగాలి.
దళితులు, గిరిజనులు కేవలం గ్రామసభల్లో మాట్లాడినా, గుళ్లలోకి వెళ్లినా, పండుగల్లో పాల్గొన్నా, ప్రజాప్రతినిధులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా వారిపై దాడులు జరుగుతున్నాయి. కానీ పోలీసులు మాత్రం వీడియోలు వైరల్ అయితేనో, పెద్ద ఎత్తున నిరసనలు జరిగితేనో తప్ప స్పందించడం లేదు. కేసుల నమోదులో ఆలస్యం, అరెస్టులు చేయకపోవడం వల్లనే నేరస్థుల్లో భయం పోయింది.
చార్జ్‌షీట్ దాఖలుకు గడువు విధించాలి
బాధితులకు న్యాయం జరగకపోగా, న్యాయపోరాటం చేయాలన్న నమ్మకం సడలిపోతోంది. నేరస్థులు యథేచ్ఛగా గ్రామాల్లో తిరుగుతుంటే బాధితులు భయంతో బతకాల్సి వస్తోంది. బలహీన వర్గాలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైతే చట్టంపై నమ్మకమే సన్నగిల్లుతుంది. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న అట్రాసిటీ కేసులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, చార్జ్‌షీట్ దాఖలుకు గడువు విధించాలి. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో హైలెట్ సమీక్ష నిర్వహించి జాప్యంపై అధికారులను బాధ్యులను చేయాలి.
అట్రాసిటీ ఫిర్యాదు అందిన వెంటనే అదే రోజు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, నిర్లక్ష్యం చేసే ఎస్‌హెచ్‌ఓలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలివ్వాలి. కన్విక్షన్ రేటును పెంచేందుకు సాక్ష్యాధారాల సేకరణను బలపరచడంతో పాటు ప్రత్యేక కోర్టులకు డెడికేటెడ్ ప్రాసిక్యూటర్లను కేటాయించాలి. ప్రతి త్రైమాసికానికి జిల్లావారీగా నమోదైన కేసులు, చార్జ్‌షీట్లు, కన్విక్షన్ల వివరాలను బహిర్గతం చేయాలి. రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ఇకనైనా కఠినంగా వ్యవహరించాలి. బాధితులకు పూర్తి భద్రత కల్పించాలి అని ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

Balka Suman | రైతుల అంశం డైవర్ట్ చేసేందుకే తుమ్మిడిహెట్టి పేరుతో కొత్త నాటకం
అక్టోబర్ 27, 2026

Chamala Kirankumar Reddy | కాళేశ్వరం గురించి మాట్లాడితే యమ కోపమొస్తది మీకు
అక్టోబర్ 27, 2026

High Court CJ | హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ తపబ్రత చక్రవర్తి.. జస్టిస్ శ్యామ్ కోషికి పదోన్నతి
అక్టోబర్ 27, 2026
తాజావార్తలు
- ●Thriller OTT | ఓటీటీలోకి దళపతి విజయ్ కొడుకు అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ - ఐదు భాషల్లో రిలీజ్
- ●Supreme Court | న్యూస్‌రూమ్‌లు మూతపడతాయి.. DPDP చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీడియా సంస్థలు
- ●Balka Suman | రైతుల అంశం డైవర్ట్ చేసేందుకే తుమ్మిడిహెట్టి పేరుతో కొత్త నాటకం
- ●Chamala Kirankumar Reddy | కాళేశ్వరం గురించి మాట్లాడితే యమ కోపమొస్తది మీకు
- ●Rahul Gandhi | గర్భిణీ జర్నలిస్టును తోసేశారంటూ ఆరోపణలు.. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు
- ●CTI | 10 లక్షల మంది నిరసనకారులు, 20 వేల వాహనాలు.. నవంబర్ 1 ర్యాలీని వాయిదా వేసుకోండి

Thriller OTT | ఓటీటీలోకి దళపతి విజయ్ కొడుకు అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ - ఐదు భాషల్లో రిలీజ్

Supreme Court | న్యూస్‌రూమ్‌లు మూతపడతాయి.. DPDP చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీడియా సంస్థలు

Balka Suman | రైతుల అంశం డైవర్ట్ చేసేందుకే తుమ్మిడిహెట్టి పేరుతో కొత్త నాటకం

Chamala Kirankumar Reddy | కాళేశ్వరం గురించి మాట్లాడితే యమ కోపమొస్తది మీకు



