త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UP SIR | యూపీ ఓట‌రు లిస్టులో కొత్త‌గా చేర్చిన ఆ 16 ల‌క్ష‌ల మంది ఎవ‌రు..?

UP SIR | SIR ప్ర‌క్రియ‌లో భాగంగా ఉత్త‌ప్ర‌దేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో దాదాపు 84.3 లక్షల మంది కొత్త ఓటర్లను జాబితాలో చేర్చారు. అయితే, అందులో 16.18 లక్షల మంది ఓట‌ర్ల వివ‌రాలు మాత్రం రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) వెబ్‌సైట్‌లో అందుబాటులో లేకపోవడం ప్ర‌స్తుతం హాట్‌టాపిక్ అవుతోంది. ఆ 16 ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు ఎవ‌ర‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

D

National | Published On Oct 6, 2026, 2.13 pm IST

UP SIR | యూపీ ఓట‌రు లిస్టులో కొత్త‌గా చేర్చిన ఆ 16 ల‌క్ష‌ల మంది ఎవ‌రు..?
Advertisement

UP SIR | త్రినేత్ర న్యూస్ : కేంద్ర ఎన్నిక‌ల సంఘం దేశ‌వ్యాప్తంగా ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ ప్ర‌క్రియలో (SIR) భాగంగా ఉత్త‌ప్ర‌దేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో దాదాపు 16.18 లక్షల మంది కొత్త ఓట‌ర్ల‌ను జాబితాలో చేర్చారు. అయితే, వారి వివ‌రాలు మాత్రం రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) వెబ్‌సైట్‌లో అందుబాటులో లేకపోవడం ప్ర‌స్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. 'ది రిపోర్టర్స్ కలెక్టివ్' (The Reporters Collective) క‌థ‌నం ద్వారా ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

స‌ద‌రు క‌థ‌నం ప్ర‌కారం.. SIR ప్రక్రియలో భాగంగా ఉత్తరప్రదేశ్ తుది ఓటర్ల జాబితాలో 84.3 లక్షల మంది కొత్త ఓటర్లను చేర్చినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అయితే, రాష్ట్ర సీఈఓ (CEO) వెబ్‌సైట్‌లో ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచిన ఫారమ్-6 డేటాలో కేవలం 71.38 లక్షల మంది వివరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగిలిన 16.18 లక్షల మంది ఓటర్లకు సంబంధించిన దరఖాస్తులు, వ్యక్తిగత వివరాల డేటా వెబ్‌సైట్‌లో కనిపించడం లేదు. దీంతో ఓట‌రు లిస్టులో కొత్త‌గా చేర్చిన‌ ఆ 16 ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు ఎవ‌ర‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితాలో చేసే ప్ర‌తీ మార్పులు, చేర్పుల‌కు సంబంధించిన క్లెయిమ్స్, అభ్యంతరాల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ముఖ్యంగా, రాష్ట్ర సీఈఓ వెబ్‌సైట్‌లో నియోజకవర్గాల వారీగా పోలింగ్ బూత్ స్థాయి వరకు ఓట‌ర్ల ద‌ర‌ఖాస్తుల‌ను వివరాలతో పాటు ఫోటో లేకుండా అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. అయితే, యూపీలో భారీ సంఖ్య‌లో ఓట‌ర్ల డేటా బ‌హిరంగంగా అందుబాటులో లేక‌పోవ‌డం అనేక అనుమానాల‌కు తావిస్తోంది.

ఈ వ్య‌వ‌హారం స్థానిక రాజ‌కీయ, సామాజిక వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ స‌మాచారాన్ని ఎన్నిక‌ల సంఘ‌మే చ‌ట్ట‌విరుద్ధంగా గోప్యంగా ఉంచింద‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇంత భారీ సంఖ్యలో కొత్త ఓటర్ల దరఖాస్తుల వివరాలను గోప్యంగా ఉంచ‌డంపై రాజ‌కీయ పార్టీలు ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నాయి. రాబోయే ఎన్నిక‌ల్లో ఆ 16 ల‌క్ష‌ల మంది ఘొస్ట్ ఓట‌ర్లే ఫ‌లితాల‌ను మార్చే అవ‌కాశం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి.

Also Read..

కెప్టెన్సీకి గుడ్‌బై.. హ‌ర్మ‌న్‌ప్రీత్ సంచ‌ల‌న నిర్ణ‌యం

జ్ఞానేశ్ ఇక చాలు బ్రో.. రాజీనామా చెయ్‌

నిర్ధారణ చేసుకోకుండా తప్పుడు వార్తలు ప్రచురించడం శోచనీయం.. ఈనాడుపై కేటీఆర్ ఆగ్ర‌హం

Advertisement
Advertisement