E-Waste | టెక్నాలజీ పెరిగే.. ఈ-వ్యర్థాలు పేరుకుపోయే!
E-Waste | సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త గ్యాడ్జెట్లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. తక్కువ ధరకే అందుబాటులోకి వస్తున్న స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు సామాన్యుల జీవితాలను సులభతరం చేస్తున్నాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పాత పరికరాలను పక్కనపెట్టి కొత్తవి కొనుగోలు చేసే అలవాటు పర్యావరణానికి కొత్త ముప్పుగా పరిణమిస్తోంది. పనికిరాని మొబైల్ ఫోన్లు, బ్యాటరీలు, ఛార్జర్లు, కంప్యూటర్లు, గృహోపకరణాలు భారీగా ఈ-వ్యర్థాలుగా పేరుకుపోతున్నాయి. వీటి సేకరణ, రీసైక్లింగ్ ఇప్పుడు సవాల్‌గా మారింది.
- చౌక గ్యాడ్జెట్లతో వేగంగా మారుతున్న టెక్నాలజీ..
- పర్యావరణానికి పెను ముప్పు
- దేశంలో 14.14 లక్షల మెట్రిక్ టన్నుల ఈ-వ్యర్థాలు..
- రీసైక్లింగ్‌లో ఉత్తరప్రదేశ్ టాప్
- తెలంగాణకు రెండోస్థానం
- గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తున్న సమస్య
E-Waste | సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త గ్యాడ్జెట్లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. తక్కువ ధరకే అందుబాటులోకి వస్తున్న స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు సామాన్యుల జీవితాలను సులభతరం చేస్తున్నాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పాత పరికరాలను పక్కనపెట్టి కొత్తవి కొనుగోలు చేసే అలవాటు పర్యావరణానికి కొత్త ముప్పుగా పరిణమిస్తోంది. పనికిరాని మొబైల్ ఫోన్లు, బ్యాటరీలు, ఛార్జర్లు, కంప్యూటర్లు, గృహోపకరణాలు భారీగా ఈ-వ్యర్థాలుగా పేరుకుపోతున్నాయి. వీటి సేకరణ, రీసైక్లింగ్ ఇప్పుడు సవాల్‌గా మారింది.
సీపీసీబీ లెక్కల ప్రకారం..
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గణాంకాల ప్రకారం.. దేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో 12,54,286 మెట్రిక్ టన్నుల ఈ-వ్యర్థాలు పేరుకుపోయాయి. 2024-25లో ఈ పరిమాణం 13,97,955 మెట్రిక్ టన్నులకు చేరింది. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి 2026 వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఈ-వ్యర్థాల పరిమాణం 14,14,645 మెట్రిక్ టన్నులుగా పెరిగింది. అంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాల సమస్య ఏటేటా తీవ్రతరమవుతున్నట్లు స్పష్టమవుతోంది.
చౌక ధరలతోనే..
ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరగడంతోపాటు వాటిని త్వరగా మార్చేయాలనే ధోరణి ఈ-వ్యర్థాల పెరుగుదలకు ప్రధాన కారణమవుతోంది. ఈ సమస్యను వివరిస్తూ వేస్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ (WEEE) ఫోరం పరిచయం చేసిన 'ఫాస్ట్ టెక్' భావన ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. తక్కువ ధరకు ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయడం.. కొత్త టెక్నాలజీ రావడం, వినియోగదారుల అభిరుచులు మారడంతో వాటిని కొద్దికాలానికే పక్కనపెట్టి కొత్త పరికరాలను కొనుగోలు చేయడమే ఈ విధానం. మార్కెట్‌లోకి కొత్త మోడళ్లు వేగంగా వస్తుండటం, పాత పరికరాల మరమ్మతుల కంటే కొత్తవి కొనుగోలు చేయడానికే వినియోగదారులు మొగ్గుచూపడం సమస్యను మరింత పెంచుతున్నాయి.

విలువైన లోహాలు.. విషపదార్థాలు..
మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టెలివిజన్లు, మిక్సీలు, ఎల్‌ఈడీ బల్బులు, ఛార్జర్లు, బ్యాటరీలు తదితర పరికరాలు పనిచేయకుండా పోయినప్పుడు ఈ-వ్యర్థాలుగా మారుతుంటాయి. వీటిలో రాగి, బంగారం వంటి విలువైన లోహాలు ఉంటాయి. శాస్త్రీయ పద్ధతుల్లో రీసైక్లింగ్ చేస్తే వీటిని తిరిగి వినియోగంలోకి తీసుకురావచ్చు. కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాల్లో సీసం, పాదరసం వంటి హానికర పదార్థాలు సైతం ఉంటాయి. వీటిని ఎక్కడపడితే అక్కడ పడేయడం, కాల్చడం, సరైన రక్షణ లేకుండా విడదీయడం వల్ల నేల, నీరు, గాలి కలుషితమయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఈ వ్యర్థాలను నిర్వహించే కార్మికుల ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశాలుంటాయి.
రీసైక్లింగ్‌లో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానం
ఈ-వ్యర్థాల రీసైక్లింగ్‌లో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మార్చి వరకు ఆ రాష్ట్రంలో 3,76,896 మెట్రిక్ టన్నుల ఈ-వ్యర్థాలను రీసైక్లింగ్ చేశారు. ఆ తర్వాత తెలంగాణ 1,61,988 మెట్రిక్ టన్నులతో రెండో స్థానంలో నిలిచింది. హర్యానా 1,35,951 మెట్రిక్ టన్నులతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. దేశవ్యాప్తంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 11.59 లక్షల మెట్రిక్ టన్నుల ఈ-వ్యర్థాలు రీసైక్లింగ్ అయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి వరకు నమోదైన రీసైక్లింగ్ పరిమాణం 9,79,080 మెట్రిక్ టన్నులుగా ఉన్నది.
గ్రామీణ ప్రాంతాల్లోనూ పెరుగుతున్న ముప్పు
ఈ-వ్యర్థాల సమస్య పట్టణాలకే పరిమితం కావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, బ్యాటరీలు, ఎల్‌ఈడీ బల్బులు, ఇతర చిన్న ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పెరుగుతోంది. అవి పాడైపోయిన తర్వాత సురక్షితంగా పారవేసే వ్యవస్థ అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అనేక గ్రామాల్లో అధీకృత ఈ-వ్యర్థాల సేకరణ కేంద్రాలు అందుబాటులో ఉండటం లేదు. దీంతో పనికిరాని పరికరాలు ఇళ్లలోనే నిల్వ ఉండిపోవడం, స్క్రాప్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతున్న ఈ-వ్యర్థాల పరిమాణానికి సంబంధించి అధికారిక గణాంకాలు అందుబాటులో లేకపోవడంతో సమస్య తీవ్రతను కచ్చితంగా అంచనా వేయడం కష్టతరమవుతోంది. ఈ నేపథ్యంలో పంచాయతీలు, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో ప్రత్యేక సేకరణ కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ-వ్యర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అధీకృత కేంద్రాలకు ఈ-వేస్ట్‌ను తరలించే వ్యవస్థను బలోపేతం చేయాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
పరిష్కారం ఏంటీ?
ఈ-వ్యర్థాల సమస్యను అధిగమించాలంటే కేవలం రీసైక్లింగ్ కేంద్రాల సంఖ్యను పెంచితే సరిపోదు. పాత పరికరాలను అధీకృత సేకరణ కేంద్రాలకు చేరవేయడం, వాటి ప్రాసెసింగ్‌కు సంబంధించిన కచ్చితమైన రికార్డులు నిర్వహించడం, అనధికారిక రంగంలో పనిచేస్తున్న కార్మికులను సురక్షిత వ్యవస్థలోకి తీసుకురావడం కూడా కీలకమే. రీసైక్లింగ్ ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు వాస్తవంగా ఎంత వ్యర్థం శుద్ధి అవుతోందో పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. అవసరమైన సమయంలో పాత డివైజ్‌లను మరమ్మతు చేయించుకుని తిరిగి వినియోగించడం, పనికిరాని మొబైల్ ఫోన్లు, బ్యాటరీలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అధీకృత కేంద్రాలకు అప్పగించడం ద్వారా ఈ సమస్య తీవ్రతను కొంతవరకు తగ్గించేందుకు అవకాశం ఉంది. సాంకేతిక అభివృద్ధి మానవాళికి మేలు చేయాలంటే.. దాని నుంచి వెలువడే వ్యర్థాల నిర్వహణపైనా అంతే బాధ్యత చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే తక్కువ ధరకే దొరుకుతున్న గ్యాడ్జెట్లతో ప్రయోజనం కంటే వాటి వల్ల కలిగే పర్యావరణ నష్టమే భవిష్యత్తులో ఎక్కువయ్యే ప్రమాదం ఉన్నది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●MK Stalin | స్టాలిన్ రీ ఎంట్రీ ఇస్తారా..? బాబు మృతితో అందరి చూపు కొలత్తూరు ఉప ఎన్నికపైనే
- ●Traffic Restrictions | రాణిగంజ్ ఆర్యూబీ విస్తరణ.. ఆ మార్గంలో 6 నెలలు ట్రాఫిక్ ఆంక్షలు
- ●Gold Prices | దీపావళికి బంగారం కొన్నారా? ఇప్పుడు దాని విలువ ఎంతంటే?
- ●Congress | పార్టీ వ్యవహారాల ఇన్చార్జిని కలవండి.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశం
- ●Donald Trump | భారత్‌లోనే తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయ్.. ఫెడ్‌పై ట్రంప్ విమర్శలు
- ●Hanuman 2 | ప్రశాంత్ వర్మతో వివాదం - మెగా హీరోతో హనుమాన్ 2 అనౌన్స్

MK Stalin | స్టాలిన్ రీ ఎంట్రీ ఇస్తారా..? బాబు మృతితో అందరి చూపు కొలత్తూరు ఉప ఎన్నికపైనే

Traffic Restrictions | రాణిగంజ్ ఆర్యూబీ విస్తరణ.. ఆ మార్గంలో 6 నెలలు ట్రాఫిక్ ఆంక్షలు

Gold Prices | దీపావళికి బంగారం కొన్నారా? ఇప్పుడు దాని విలువ ఎంతంటే?

Congress | పార్టీ వ్యవహారాల ఇన్చార్జిని కలవండి.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశం






