త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | వైద్యుల‌కు గిఫ్ట్‌లు.. ఫార్మా కంపెనీల అనైతిక మార్కెటింగ్‌పై కేంద్రానికి సుప్రీం కీల‌క ఆదేశాలు

Supreme Court | ఫార్మా కంపెనీలు అవలంభిస్తున్న అనైతిక మార్కెటింగ్ పద్ధతులను (Pharma Marketing Practices) అరికట్టేందుకు చట్టపరమైన నిబంధనలను సిఫార్సు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్ర‌భుత్వాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది.

D

National | Published On Oct 8, 2026, 3.01 pm IST

Supreme Court | వైద్యుల‌కు గిఫ్ట్‌లు.. ఫార్మా కంపెనీల అనైతిక మార్కెటింగ్‌పై కేంద్రానికి సుప్రీం కీల‌క ఆదేశాలు
Advertisement

Supreme Court | త్రినేత్ర న్యూస్ : ఫార్మా కంపెనీలు అవలంభిస్తున్న అనైతిక మార్కెటింగ్ పద్ధతులను (Pharma Marketing Practices) అరికట్టేందుకు చట్టపరమైన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంద‌ని దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) అభిప్రాయ‌ప‌డింది. ఈ మేర‌కు నిబంధనలను సిఫార్సు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.

ఫార్మా సంస్థలు వైద్యులను ప్రభావితం చేసే విధానాలపై నియంత్రణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. ఫార్మా కంపెనీలు వైద్యులకు నగదు ప్రయోజనాలు, విదేశీ పర్యటనలు, ఖరీదైన బహుమతులు ఇచ్చి తమ (Freebies To Doctors) మందులను ఎక్కువగా ప్రిస్క్రిప్షన్లలో రాసేలా ప్రభావితం చేస్తున్నాయని పిటిష‌న‌ర్ ఆరోపించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల (UCPMP)పై ప్ర‌భుత్వ నియంత్ర‌ణ లేక‌పోతే అవి స్వ‌చ్ఛందంగా మారిపోయే ప్ర‌మాదం ఉంద‌ని ధ‌ర్మాస‌నం ఈ సంద‌ర్భంగా ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. వీటిని అరికట్టడానికి చట్టబద్ధమైన కఠిన నిబంధనలు అవసరమని అభిప్రాయపడింది. దీనికి చట్టబద్ధత కల్పించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా అని ప్ర‌శ్నించింది.

స్పందించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. ఔషధ కంపెనీల నుంచి బహుమతులు, ప్రయాణ సౌకర్యాలు, ఆతిథ్యం, నగదు వంటి లాభాలు పొందే వైద్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే నిబంధనలు ఇప్పటికే ఉన్నాయని కోర్టుకు తెలిపారు. అయితే ఔషధ కంపెనీలనే నేరుగా నియంత్రించే అంశంపై చట్టపరమైన నియంత్రణ అవసరమా..? ఒకవేళ అవసరమైతే అది ఏ రూపంలో ఉండాలి..? అనే దానిపై పరిశీలించడానికి ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ కమిటీ రెండు నెలల్లో తన నివేదికను సమర్పిస్తుందని పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని కోర్టుకు తెలిపారు. అంతవరకు ప్రస్తుతమున్న యూసీపీఎంపీ (UCPMP) నిబంధనలే అమల్లో ఉంటాయని మెహతా స్ప‌ష్టం చేశారు.

సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ వాద‌న‌పై పిటిష‌న‌ర్లు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. 2022లోనే ప్ర‌భుత్వం ఇలాంటి హైపవర్ కమిటీని ఏర్పాటు చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు. ఆ కమిటీ నివేదికపై తదుపరి చర్యలు తీసుకోకుండానే ఇప్పుడు మళ్లీ మరో కొత్త కమిటీ ఎందుకని ప్ర‌శ్నించారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఫ్రీబీస్‌లు, ఇతర ప్రయోజనాలను స్వీకరించే వైద్యులపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నారని, కానీ ఉచితాల‌ను ఆఫ‌ర్ చేసే ఫార్మా కంపెనీల‌పై ఎలాంటి క‌ఠిన‌మైన చ‌ర్య‌లు ఉండ‌టం లేద‌ని పిటిష‌న‌ర్ల త‌ర‌ఫున‌ సీనియర్‌ న్యాయవాది సంజయ్‌ పారిఖ్‌ వాదించారు. ఈ కార‌ణంగా ఔష‌ధ కంపెనీలు వైద్యుల ప్రిస్క్రిప్ష‌న్ల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఫార్మా కంపెనీల అనైతిక మార్కెటింగ్ పద్ధతులకు అడ్డుకట్ట వేసేందుకు, వైద్యులకు ప్రలోభాలు పెట్టకుండా నియంత్రించేందుకు అవసరమైన చట్టబద్ధమైన నిబంధనలను (Statutory Regulations) రూపకల్పన చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశించింది. ఈ క‌మిటీ రెండు నెల‌ల్లో త‌న నివేదిక‌ను కేంద్రానికి అందజేస్తుంద‌ని తెలిపింది. కేంద్రం స‌మ‌ర్పించే అఫిడ‌విట్‌ను ప‌రిశీలిస్తామ‌ని పేర్కొంది. అనంత‌రం త‌దుప‌రి విచార‌ణ‌ను జ‌న‌వ‌రి 29కి వాయిదా వేసింది.

Also Read..

సైబర్ మోసాలపై గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ అవసరం : ప్రధాని మోదీ

సీఈసీ, ఈసీల నియామ‌కాల‌పై సుప్రీంకోర్టులో స‌వాల్‌

యూపీఐ ఛార్జీలపై కీలక పరిణామం.. అక్టోబర్ 15 అమలుపై వ్యాపారుల అభ్యంతరం..

Advertisement
Advertisement