త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UPI | యూపీఐ ఛార్జీలపై కీలక పరిణామం.. అక్టోబర్ 15 అమలుపై వ్యాపారుల అభ్యంతరం..

UPI | యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లావాదేవీలపై కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్‌ (ఎండీఆర్‌) నిబంధనల అమలును వాయిదా వేయాలని వ్యాపారుల సంఘాలు కోరుతున్నాయి. అక్టోబర్ 15 నుంచి కొత్త ఛార్జీల విధానం అమల్లోకి రావాల్సి ఉండగా, పండుగ సీజన్ ముగిసే వరకు లేదా వచ్చే ఏడాది ప్రారంభం వరకు అమలును వాయిదా వేయాలని వ్యాపారుల సంఘాలు ప్రతిపాదించాయి.

S

Business | Published On Oct 8, 2026, 2.46 pm IST

UPI | యూపీఐ ఛార్జీలపై కీలక పరిణామం.. అక్టోబర్ 15 అమలుపై వ్యాపారుల అభ్యంతరం..
Advertisement

UPI | యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లావాదేవీలపై కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్‌ (ఎండీఆర్‌) నిబంధనల అమలును వాయిదా వేయాలని వ్యాపారుల సంఘాలు కోరుతున్నాయి. అక్టోబర్ 15 నుంచి కొత్త ఛార్జీల విధానం అమల్లోకి రావాల్సి ఉండగా, పండుగ సీజన్ ముగిసే వరకు లేదా వచ్చే ఏడాది ప్రారంభం వరకు అమలును వాయిదా వేయాలని వ్యాపారుల సంఘాలు ప్రతిపాదించాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ప్రతిపాదన పంపినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఎన్డీటీవీ ప్రాఫిట్ గురువారం వెల్లడించింది. అయితే ఈ ప్రతిపాదనపై ఎన్‌పీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అన్ని భాగస్వాములతో సంప్రదింపులు జరిపిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పండుగల సీజన్‌లో వ్యాపారాలు, వినియోగదారులపై కొత్త ఛార్జీల ప్రభావం పడకుండా ఉండేందుకు అమలును వాయిదా వేయాలని వ్యాపారుల సంఘాలు కోరుతున్నాయి.

ఛార్జీలు ఎలా ఉన్నాయి..

ఇప్పటివరకు ఉచితంగా కొనసాగుతున్న యూపీఐ వ్యవస్థలో కొన్ని అధిక విలువ కలిగిన లావాదేవీలకు ఎండీఆర్‌ విధించేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. రూ.2వేల కంటే ఎక్కువ విలువైన ఎంపిక చేసిన లావాదేవీలపై రూ.5 వరకు స్థిర ఛార్జీ విధించనున్నారు. పెద్ద మొత్తంలో జరిగే మర్చంట్ చెల్లింపులకు 0.4 శాతం ఎండీఆర్‌ వర్తిస్తుంది. అయితే ఒక్కో లావాదేవీపై గరిష్ఠంగా రూ.300 మాత్రమే ఛార్జీ విధించేలా పరిమితి విధించారు. కొత్త నిబంధనల ప్రకారం రైల్వేలు, టెలికాం సేవలు, బీమా, ఇంధనం వంటి ఎంపిక చేసిన మర్చంట్ కేటగిరీల్లో రూ.2వేల‌కు పైబడిన యూపీఐ చెల్లింపులపై ఒక్కో లావాదేవీకి రూ.5 స్థిర ఎండీఆర్‌ వర్తిస్తుంది. అదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీస్, స్టాక్ బ్రోకర్లు, డీలర్లకు సంబంధించిన క్యాపిటల్ మార్కెట్ చెల్లింపులపై కేవలం 0.02 శాతం ఎండీఆర్‌ ఉంటుంది. దీనికీ ఒక్కో లావాదేవీకి రూ.300 గరిష్ఠ పరిమితిగా ఉంటుంది.

వినియోగ‌దారుల‌పై భారం ఉంటుందా..

కొత్త ఎండీఆర్‌ విధానం ఎలా ఉంటుందంటే.. మర్చంట్‌కు రూ.2వేలు చెల్లిస్తే ఎలాంటి ఎండీఆర్‌ ఉండదు. అంటే వ్యాపారి చెల్లించాల్సిన ఛార్జీ రూ.0. రూ.3వేలు చెల్లిస్తే 0.4 శాతం ప్రకారం రూ.12 ఎండీఆర్‌ ఉంటుంది. రూ.50వేల చెల్లింపుపై 0.4 శాతం ప్రకారం రూ.200 ఛార్జీ అవుతుంది. రూ.75వేలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తానికి మాత్రం 0.4 శాతం కాకుండా స్థిరంగా రూ.300 మాత్రమే ఎండీఆర్‌ విధిస్తారు. అయితే కొత్త ఛార్జీల ప్రభావం మొత్తం యూపీఐ వినియోగంపై పరిమితంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. మర్చంట్ లావాదేవీల్లో కేవలం 4 శాతం వరకు మాత్రమే కొత్త ఎండీఆర్‌ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. 95 శాతానికి పైగా యూపీఐ పర్సన్‌ టు మర్చంట్‌ లావాదేవీలు ఎండీఆర్‌ పరిధికి వెలుపలే కొనసాగుతాయి. చిన్న వ్యాపారులు ఉపయోగించే పర్సన్‌ టు పర్సన్‌ టు మర్చంట్‌ మోడల్‌లో ఎలాంటి ఎండీఆర్‌ ఉండదు.

నెల‌వారీ ప‌రిమితి ఉందా..

వ్యక్తిగత వినియోగదారులకు కూడా నెలవారీ పరిమితి లేదా ఉచిత యూపీఐ వినియోగంపై కోటా విధించడం లేదు. అంటే కొత్త విధానంలో ఉచితంగా ఉండే లావాదేవీల పరిధిలో వినియోగదారులు యూపీఐ చెల్లింపులను ఎలాంటి ఎండీఆర్‌ ఛార్జీ లేకుండా కొనసాగించవచ్చు. కొత్త ఎండీఆర్‌ వ్యవస్థలో చిన్న వ్యాపారులు యూపీఐ చెల్లింపులను స్వీకరించేలా ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తం ఎండీఆర్‌ వసూళ్లలో 5 శాతాన్ని ఈ నిధికి కేటాయించనున్నారు. చిన్న వ్యాపారాల్లో యూపీఐ స్వీకరణను మరింత విస్తరించేందుకు ఈ నిధిని ఉపయోగించనున్నారు. యూపీఐ వ్యవస్థలోని వివిధ భాగస్వాముల మధ్య ఎండీఆర్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని పంచనున్నారు. యూపీఐ విస్తరణ, సైబర్‌ సెక్యూరిటీ, సాంకేతిక ఆవిష్కరణలు వంటి రంగాలకు ఈ ఆదాయం ఉపయోగపడే అవకాశం ఉంది. అదే సమయంలో కార్డులు, డిజిటల్ వాలెట్లపై ఉండే ఛార్జీలతో పోలిస్తే కొత్త యూపీఐ ఎండీఆర్‌ రేట్లు తక్కువగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా ఎండీఆర్‌ భారం వినియోగదారులపై పడకుండా చూడాలని బ్యాంకులకు సూచనలు ఇచ్చారు. కొత్త నిబంధనల ప్రకారం ఎండీఆర్‌ చెల్లించాల్సిన వ్యాపారులు ఆ ఛార్జీని వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేయకూడదు. అంటే యూపీఐ ద్వారా చెల్లింపు చేసినందుకు కస్టమర్‌పై ప్రత్యేకంగా అదనపు ఛార్జీ విధించే అవకాశం ఉండదు.

Advertisement
Advertisement