త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | మ‌హిళ‌ల సహ‌కారం అపార‌మైన‌ది.. రిజర్వేషన్ల బిల్లుకు అందరూ మద్దతు పలకండి : ప్ర‌ధాని మోదీ

PM Modi | చ‌ట్ట‌సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లు భారతదేశంలోని కోట్ల మంది మహిళల ఆకాంక్షలకు ప్రతిబింబమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

D

National | Published On Apr 9, 2026, 11.18 am IST

PM Modi | మ‌హిళ‌ల సహ‌కారం అపార‌మైన‌ది.. రిజర్వేషన్ల బిల్లుకు అందరూ మద్దతు పలకండి : ప్ర‌ధాని మోదీ
Advertisement

PM Modi | చ‌ట్ట‌సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లు భారతదేశంలోని కోట్ల మంది మహిళల ఆకాంక్షలకు ప్రతిబింబమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం కేవలం ప్రాతినిధ్యానికే పరిమితం కాకూడదని, నిర్ణయాధికారంలోనూ వారు కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఈ మేర‌కు ప్ర‌ధాని మోదీ ఓ ప్ర‌త్యేక‌ వ్యాసాన్ని ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు. అందులో ఏం రాశారంటే..?

రాబోయే రోజుల్లో దేశ‌వ్యాప్తంగా పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొన‌నుంది. అస్సాం ప్ర‌జ‌లు రంగాలి బిహు జ‌రుపుకోనుండ‌గా.. ఒడిశాలో మ‌హా బిషుబ పాన సంక్రాంతి నిర్వ‌హిస్తున్నారు. ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌జ‌లు పొయిలా బైశాఖ్‌తో బెంగాలీ నూత‌న సంవ‌త్స‌రానికి స్వాగ‌తం ప‌ల‌క‌నున్నారు. కేర‌ళ‌లో విషు పండుగ‌ను ఎంతో ఉత్సాహంతో జ‌రుపుకుంటారు. త‌మిళ‌నాడులో పుత్తాండు జ‌రుపుకోనున్నారు. ఆయా పండుగ‌ల‌ను జ‌రుపుకునే దేశ‌, విదేశాల్లో ఉన్న భార‌తీయులంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను. ఈ ప‌విత్ర సంద‌ర్భాలు అంద‌రి జీవితాల్లో సంతోషాన్ని, శ్రేయ‌స్సును తీసుకురావాల‌ని కోరుకుంటున్నాను.

ఏప్రిల్ 11న మ‌నం మ‌హాత్మా పూలే 200వ జ‌యంతి సంద‌ర్భంగా ఉత్స‌వాల‌ను ప్రారంభించ‌బోతున్నాం. 14న అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా డాక్ట‌ర్ బాబాసాహెబ్ అంబేద్క‌ర్‌కు నివాళులు అర్పించ‌నున్నాం. ఈ ప్ర‌త్యేక సంద‌ర్భాల‌తోపాటూ మ‌న దేశంలో మ‌రో చారిత్రాత్మ‌క ఘ‌ట్టానికి ముంగిట నిలిచింది. ఇది మ‌న ప్ర‌జాస్వామ్య పునాదుల‌ను మ‌రింత పటిష్టం చేసుకోవ‌డానికి, స‌మాన‌త్వం, స‌మ్మిళిత‌త్వం ప‌ట్ల మ‌న సామూహిక నిబ‌ద్ధ‌త‌ను పున‌రుద్ఘాటించ‌డానికి ల‌భించిన ఓ గొప్ప అవకాశం.

చ‌ట్ట‌సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై చ‌ర్చించి ఆమోదించ‌డానికి ఏప్రిల్ 16వ తేదీన పార్ల‌మెంట్ ప్ర‌త్యేకంగా స‌మావేశం కానుంది. దీనిని కేవలం ఒక శాసనపరమైన ప్రక్రియగా అభివర్ణించడం దాని ప్రాముఖ్యతను తక్కువ చేసి చూపడమే అవుతుంది. ఇది దేశంలోని కోట్ల మంది మ‌హిళ‌ల ఆకాంక్ష‌ల‌కు ప్ర‌తిబింబం. భార‌త‌దేశ జ‌నాభాలో దాదాపు స‌గభాగం మ‌హిళ‌లే. దేశానికి వారు అందిస్తున్న స‌హ‌కారం అపార‌మైన‌ది. అమూల్య‌మైన‌ది. సైన్స్, టెక్నాల‌జీ, క‌ళ‌లు, క్రీడ‌లు, సాయుధ ద‌ళాలు, సంగీతం.. ఇలా ప్ర‌తీ రంగంలో మ‌హిళ‌లు ముందంజ‌లో ఉన్నారు. గ‌త కొన్నేళ్లుగా మ‌హిళా సాధికార‌త‌కు అనుకూల‌మైన వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించ‌డానికి నిరంత‌ర ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. అయినప్పటికీ రాజకీయాల్లో, చ‌ట్ట‌స‌భ‌ల్లో వారి ప్రాతినిధ్యం సమాజంలో వారి పాత్రకు తగినట్లుగా లేక‌పోవ‌డం దురదృష్టకరం.

2029 లోక్‌సభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాలకు జరిగే శాసనసభ ఎన్నికలన్నిటిలో మహిళా రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలుకావాలి. గడచిన అనేక దశాబ్దాలుగా గత ప్రభుత్వాలు ప్రజాస్వామ్య వ్యవస్థల్లో మహిళలకు హక్కుగా దక్కాల్సిన స్థానాన్ని అందించేందుకు పలుమార్లు ప్రయత్నించాయి. ఇందుకోసం కమిటీలు వేశాయి, బిల్లు ముసాయిదాలను ప్రవేశపెట్టాయి. కానీ అవేవీ కార్య‌రూపం దాల్చ‌లేదు. అయితే చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలన్న విషయంపై అందరూ ఏకాభిప్రాయంతోనే ఉన్నారు. అదే ఏకాభిప్రాయంతో పార్లమెంటు 2023 సెప్టెంబరులో ‘నారీ శక్తి వందన్‌ అధినియమ్‌’కు ఆమోదం తెలిపింది. అది నా జీవితంలోని అతి ముఖ్య సందర్భాల్లో ఒకటిగా నేను భావిస్తున్నాను.

చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌న్న సంక‌ల్పం మన స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. సమానత్వం అనేది కేవలం చట్టాల్లో ఉండటమే కాకుండా ఆచరణలో కూడా సాధ్యమయ్యే సమాజాన్ని మన రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రతి పౌరుడికి సమాన వాటా ఉండే సమాజాన్ని నిర్మించాలనే మన నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది. చట్టసభల్లో మహిళా భాగస్వామ్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని దశాబ్దాలుగా అందరూ అంగీకరిస్తూనే ఉన్నారు. దానిపై చర్యల్ని మరింత వాయిదా వేయడం మనం సరిదిద్దగలిగిన ఒక అసమతౌల్యాన్ని మరికొంత కాలం కొనసాగించడమే అవుతుంది అని ప్ర‌ధాని త‌న సుదీర్ఘ వ్యాసంలో రాసుకొచ్చారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లుకు ఆమోదం తెలిపేందుకు ఉద్దేశించిన స‌మావేశం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో.. అన్ని పార్టీల‌కు ప్ర‌ధాని ఓ కీల‌క విజ్ఞ‌ప్తి చేశారు. మ‌హిళ‌ల కోసం తీసుకోనున్న ఈ చ‌ర్య‌కు అంద‌రూ మ‌ద్ద‌తు తెల‌పాల‌ని కోరారు.

Also Read..

ఎంబీఏలో గోల్డ్‌మెడ‌లిస్ట్‌.. చేసేది మాత్రం దొంగ‌త‌నాలు.. ప‌ట్టించిన సెల్ఫ్‌డ్రైవ్ కారు!

త‌ల్లి మంద‌లించింద‌ని.. సైకిల్‌పై నిజామాబాద్ నుంచి కామారెడ్డికి 14 ఏండ్ల బాలుడు

బెంగాల్ ఓట‌ర్ల‌లో గంద‌ర‌గోళం.. ఒకే ఊర్లో 4 వేల ఓట్ల తొల‌గింపు

Advertisement
Advertisement