త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

మహబూబ్‌నగర్ జిల్లా జైలులో పోక్సో నిందితుడు టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకి పరారైన ఘటన సంచలనం రేపుతోంది. భద్రతా వైఫల్యంతో 8 మంది జైలు అధికారులపై సస్పెన్షన్ వేటు?

J

Telangana | Published On Jul 6, 2026, 11.00 pm IST

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
Advertisement
  • పోక్సో (POCSO) కేసులో రిమాండ్‌లో ఉన్న కిషోర్ రెడ్డి అనే ఖైదీ మహబూబ్‌నగర్ జైలు నుంచి పరారీ
  • తోటి ఖైదీల టవల్స్ (Towels) ఒకదానికొకటి కట్టి 18 అడుగుల ఎత్తైన జైలు గోడ దూకిన వైనం
  • భద్రతా వైఫల్యంపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు.. జైలర్ సహా 8 మంది సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు సమాచారం
  • ఆటో డ్రైవర్ ఫోన్ నుంచి తల్లిదండ్రులకు నిందితుడి కాల్.. గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు

POCSO Accused Escapes | త్రినేత్ర.న్యూస్ : మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా జైలు నుంచి రిమాండ్ ఖైదీ పారిపోయిన ఘటన జిల్లావ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. గత 25 రోజులుగా పోక్సో (POCSO) కేసులో రిమాండ్‌లో ఉన్న కిషోర్ రెడ్డి అనే నిందితుడు.. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య సోమవారం తెల్లవారుజామున జైలు గోడ దూకి పరారయ్యాడు. జైలు భద్రతపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో జైళ్ల శాఖ సీరియస్ యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

మైనర్‌తో పెళ్లి.. టవల్స్‌తో పక్కా స్కెచ్

వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన కిషోర్ రెడ్డి.. ఒక మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు అతనిపై కిడ్నాప్, పోక్సో (POCSO) కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని పక్కా ప్లాన్ (Sketch) వేసిన కిషోర్.. కొన్ని రోజులుగా లోపల రెక్కీ నిర్వహించాడు. సోమవారం తెల్లవారుజామున తోటి ఖైదీల టవల్స్ (Towels) అన్నీ ఒకదానికొకటి కట్టి, బాత్రూం పైకెక్కి.. అక్కడి నుంచి ఏకంగా 18 అడుగుల ఎత్తైన జైలు గోడను దాటి కిందకు దూకేశాడు.

అధికారుల నిర్లక్ష్యం.. 8 మందిపై వేటు?

ఉదయం జైలు గోడ బయట టవల్స్ వేలాడుతుండటాన్ని గమనించిన కొందరు స్థానికులు జైలు అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అప్రమత్తమైన సిబ్బంది.. లోపల ఖైదీలను లెక్కపెట్టగా కిషోర్ మిస్ అయినట్లు నిర్ధారణ అయింది. 18-20 ఫీట్ల గోడ దూకి ఖైదీ పారిపోవడం జిల్లా జైలు చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ ఘటనపై జైళ్ల శాఖ (Prisons Department) తీవ్రంగా స్పందించింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జైలర్‌తో సహా 8 మంది సిబ్బందిని సస్పెండ్ (Suspension) చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే అధికారులు దీన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. వన్ టౌన్ ఎస్ఐ శీనయ్య ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆటో డ్రైవర్ ఫోన్ నుంచి కాల్.. గాలింపు ముమ్మరం

జైలు నుంచి పారిపోయిన తర్వాత కిషోర్.. ఓ ఆటో డ్రైవర్ వద్ద నుంచి ఫోన్ తీసుకుని తన తల్లిదండ్రులకు కాల్ చేశాడు. తాను జైలు నుంచి తప్పించుకున్నానని, ఇంటికి వస్తున్నానని చెప్పగా.. వారు రావొద్దని వారించినట్లు సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. సదరు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిందితుడిని ఎక్కడ డ్రాప్ చేశాడనే సమాచారంతో గాలింపు ముమ్మరం చేశారు. కిషోర్ స్వగ్రామానికి వెళ్లే అవకాశం ఉందన్న అనుమానంతో ఆత్మకూర్ పోలీసులను అప్రమత్తం చేశారు. అలాగే సమీపంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఖైదీ ఎస్కేప్ ఘటనతో జైళ్ల శాఖ డీఐజీ స్వయంగా విచారణ చేపట్టినా మీడియాకు ఎలాంటి వివరాలు వెల్లడించకపోవడం గమనార్హం.

Advertisement
Advertisement