త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi | పెను ప్ర‌మాదంలో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌.. రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Rahul Gandhi | భారత్ ఆర్థిక వ్యవస్థ (Economic Crisis) పెను ప్రమాదంలో ఉంద‌ని ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హెచ్చ‌రించారు. న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్సిటీ (Columbia University)లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశ ఆర్థిక నమూనా దాదాపు దశాబ్దం క్రితమే ఫలితాలను ఇవ్వడం ఆపేసిందని ఆయ‌న పేర్కొన్నారు.

D

National | Published On Nov 18, 2026, 11.35 am IST

Rahul Gandhi | పెను ప్ర‌మాదంలో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌.. రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

Rahul Gandhi | త్రినేత్ర న్యూస్ : ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విదేశీ గ‌డ్డ‌పై భార‌త్‌ను ఉద్దేశించి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భారత్ ఆర్థిక వ్యవస్థ (Economic Crisis) పెను ప్రమాదంలో ఉంద‌ని హెచ్చ‌రించారు. భారీగా పెరిగిపోతున్న నిరుద్యోగం (unemployment), దెబ్బ‌తిన్న త‌యారీ రంగం, విద్యావ్య‌వ‌స్థ‌పై నెల‌కొన్న ఆందోళ‌న‌ల‌తో కూడిన స‌మ‌స్య‌ల‌తో భార‌త్ ఆర్థిక విపత్తు అంచున కొట్టుమిట్టాడుతోంద‌ని వ్యాఖ్యానించారు. ఈ ప‌రిస్థితి ఇదేవిధంగా కొన‌సాగితే తీవ్ర‌మైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని గ‌ట్టిగా హెచ్చ‌రించారు.

ఎవ‌రు అవున‌న్నా కాద‌న్నా.. ఇదే నిజం

అమెరికాలో పర్యటిస్తున్న రాహుల్‌.. న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్సిటీ (Columbia University)లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశ ఆర్థిక నమూనా దాదాపు దశాబ్దం క్రితమే ఫలితాలను ఇవ్వడం ఆపేసిందని ఆయ‌న పేర్కొన్నారు. దేశంలో ప్రైవేట్ పెట్టుబడులు ఎందుకు రావడం లేదని ప్ర‌శ్నించారు. ప్రైవేట్ పెట్టుబడులు తగ్గి అదానీ, అంబానీ లాంటి కొద్దిమంది బ‌డా పారిశ్రామికవేత్తలు మాత్రమే ఎదుగుతున్నార‌ని ఆరోపించారు. 'మేక్ ఇన్ ఇండియా', 'స్టార్టప్ ఇండియా' వంటి ప్రభుత్వ పథకాలు దేశ ఆర్థిక వెన్నెముకను పునరుద్ధరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమ‌ర్శించారు. "నిజం చెప్పాలంటే.. భారత్ ప్రస్తుతం ఒక ఆర్థిక విప‌త్తు అంచున కూర్చుంది. ఎవ‌రు అవున‌న్నా కాద‌న్నా.. మీడియా దీన్ని ప‌క్క‌న పెట్టినా.. ఇదే నిజం. దేశంలో నిరుద్యోగ స‌మ‌స్య చాలా తీవ్రంగా ఉంది. విద్యావ్య‌వ‌స్థ‌లోనూ తీవ్ర‌మైన లోపాలు ఉన్నాయి" అని రాహుల్ చెప్పుకొచ్చారు.

సేవా రంగం ద్వారా ఉద్యోగాలు అసాధ్యం

ఉపాధి కల్పనలో కీలకమైన చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSMEలు), వ్యవసాయమే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని రాహుల్ నొక్కి చెప్పారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ వెన్నెముక ఇప్పుడు పూర్తిగా విరిగిపోయింద‌ని వ్యాఖ్యానించారు. కేవలం సేవల రంగం ద్వారా అందరికీ ఉద్యోగాలు కల్పించలేమని, తయారీ రంగాన్ని పునర్నిర్మించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

"దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిన్నాయి. కేవలం సేవా రంగాన్ని నమ్ముకుని అందరికీ ఉద్యోగాలు కల్పించడం అసాధ్యం. దీని ద్వారా కేవలం 5 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలరు. అందరి భవితవ్యాన్ని సేవా రంగంపై ఆధారపడేలా చేయలేం. త‌యారీ రంగాన్ని పూర్తిగా విస్మ‌రించాం" అని రాహుల్ తెలిపారు. విద్యావంతులైన మధ్యతరగతి యువతకు తమ భవిష్యత్తుపై భరోసా లేకుండా పోయిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఐఐటీలు (IITs), ఐఐఎంలు (IIMs) వంటి ప్రతిష్టాత్మక సంస్థల డిగ్రీలు కూడా ఉద్యోగ భద్రతను ఇవ్వలేకపోతున్నాయని రాహుల్ చెప్పుకొచ్చారు.

ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌ను సంస్క‌రించ‌డం అత్య‌వ‌స‌రం

గత దశాబ్ద కాలంగా రాజకీయ, ఆర్థికాధికారం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావడానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. గిరిజనులు, దళితులు, రైతులు, విద్యార్థులు వివిధ స్థాయిల్లో తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారని గుర్తుచేశారు. సంపద కేంద్రీకరణ కారణంగా ప్రజల హక్కులు హరించుకుపోతున్నాయని, మైనారిటీలు, దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. అదేవిధంగా ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌ను సంస్క‌రించ‌డం అత్యంత అవ‌స‌ర‌మ‌ని రాహుల్ నొక్కి చెప్పారు. అందుకోసం తాము పోరాడుతున్నామ‌ని చెప్పారు. ఎన్నిక‌ల్లో మోసాలు చోటు చేసుకుంటున్నాయ‌ని నిరూపించ‌డానికి త‌మ వ‌ద్ద ఆధారాలు ఉన్నాయ‌ని రాహుల్ స్ప‌ష్టం చేశారు.

ఆయ‌న‌కు ఇదో అలవాటైపోయింది

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అధికార భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్రంగా స్పందించింది. విదేశీ గ‌డ్డ‌పై భార‌త్‌ను అవ‌మానించ‌డం రాహుల్‌కు అల‌వాటుగా మారిపోయింద‌ని మండిప‌డింది. దేశ ప్రతిష్టను దిగజార్చేలా రాహుల్ గాంధీ భారత వ్యతిరేక ప్రచారానికి నాయకుడిగా మారారంటూ ఎద్దేవా చేసింది. ప్రపంచవ్యాప్తంగా భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో.. ప్ర‌తిప‌క్షనేత‌ హోదాలో ఉన్న‌ రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని మండిప‌డింది.

Also Read..

నా భార్య అంద‌ట్ల ఇజ్జ‌త్ తీస్తుంది.. ఈ బ‌త్కు బ‌త్కాల‌ని లేదు.. క‌న్నోళ్ల‌కు సెల్ఫీ వీడియో పంపి యువ‌కుడి అదృశ్యం

వాల్ స్ట్రీట్ నష్టాల ప్రభావం.. స్వల్ప నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..

'డిజిటల్ అరెస్ట్' ఒక పెద్ద మోసం.. పోలీసులు ఎప్పుడూ వీడియో కాల్స్‌లో అరెస్ట్ చేయరు

Advertisement
Advertisement