త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NEET Aspirant | మ‌ళ్లీ నీట్ ప‌రీక్ష రాసే ధైర్యం నాకు లేదు.. అమ్మ‌, నాన్న న‌న్ను క్ష‌మించండి..

NEET Aspirant | "అమ్మ‌, నాన్న న‌న్ను క్ష‌మించండి. నీట్ ప‌రీక్ష మ‌ళ్లీ రాసే ధైర్యం నాకు లేదు" అంటూ ఓ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. నీట్ పేప‌ర్ లీక్‌, అక్ర‌మాల ఆరోప‌ణ‌ల మ‌ధ్య త‌న క‌ష్టానికి, ప్ర‌తిభ‌కు విలువ లేకుండా పోతుందేమోన‌ని ఆకాంక్ష భ‌య‌ప‌డింద‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు.

D

National | Published On Jun 4, 2026, 3.52 pm IST

NEET Aspirant | మ‌ళ్లీ నీట్ ప‌రీక్ష రాసే ధైర్యం నాకు లేదు.. అమ్మ‌, నాన్న న‌న్ను క్ష‌మించండి..
Advertisement
  • సూసైడ్‌నోట్ రాసి నీట్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌
  • నీట్ పేప‌ర్ లీక్‌, అక్ర‌మాల ఆరోప‌ణ‌లతో డిప్రెష‌న్‌కు లోనైన విద్యార్థిని
  • ఆకాంక్ష‌ది ఆత్మ‌హ‌త్య కాదు.. రాహుల్ గాంధీ
  • మోదీ గారూ.. విద్యావ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేసేశారు

NEET Aspirant | నీట్ పేప‌ర్ లీక్ వ్య‌వ‌హారం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. ముఖ్యంగా ల‌క్ష‌లాది మంది విద్యార్థుల జీవితాల‌ను ఈ అంశం కుదిపేస్తోంది. చాలా మంది విద్యార్థులు రాత్రి, ప‌గ‌లు అన్న తేడా లేకుండా క‌ష్ట‌ప‌డి చ‌దివి ప‌రీక్ష రాశారు. మంచి ఫ‌లితం వ‌స్తుంద‌ని ఆశించారు. అయితే, పేప‌ర్ లీక్ వార్త‌లు వారిని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేశాయి. ఈ ప‌రీక్ష‌ను మ‌ళ్లీ రాయాల‌న్న భ‌యం చాలామందిని వెంటాడుతోంది. ఈ క్ర‌మంలో ఓ విద్యార్థిని (NEET Aspirant) క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంది. ఎగ్జామ్ మ‌ళ్లీ రాసే ధైర్యం త‌న‌కు లేదంటూ త‌నువు చాలించింది.

కుటుంబాన్ని పేద‌రికం నుంచి బ‌య‌ట‌ప‌డేయాల‌నుకుంది..

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం మౌగంజ్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల‌ ఆకాంక్ష ఛ‌తుర్వేది (Akanksha Chaturvedi) మెడికల్ ఎంట్రన్స్ పరీక్షకు (నీట్) ప్రిపేరైంది. నాగ్‌పూర్‌లోని ఓ కోచింగ్ సెంట‌ర్‌లో కోచింగ్ తీసుకుంది. ఆ స‌మ‌యంలో ఆకాంక్ష‌కు తోడుగా ఆమె త‌ల్లిదండ్రులు కూడా నాగ్‌పూర్‌కే వ‌చ్చారు. ఆమె తండ్రి చిన్న రైతు. ఇంటి ఖర్చులు, ఆకాంక్ష‌ కోచింగ్ ఫీజుల కోసం నాగపూర్‌లో వంటవాడిగా ప‌నిచేశాడు. అవిసరిపోక కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా దాదాపు రూ.3 ల‌క్ష‌ల అప్పు కూడా చేశాడు. బంధువుల నుంచి కొంత ఆర్థిక సాయం తీసుకున్నాడు. త‌న కుటుంబ ప‌రిస్థితి చూసిన ఆకాంక్ష బాగా చ‌దువుకుని త‌న ఫ్యామిలీని పేద‌రికం నుంచి బ‌య‌ట‌ప‌డేయాల‌నుకుంది. అలా క‌ష్ట‌ప‌డి చ‌దివి.. గ‌త‌నెల 3న దేశ‌వ్యాప్తంగా జ‌రిగిన నీట్ ప‌రీక్ష‌ను రాసింది. ఈ పరీక్ష బాగా రాశానని, తనకు మంచి ఫలితం వస్తుందని ఆశించింది. ఇదే విష‌యం తన త‌ల్లిదండ్రులు, బంధువులు, సన్నిహితులకు చెప్పింది.

మ‌ళ్లీ ప‌రీక్ష రాసే ధైర్యం నాకు లేదు..

అయితే, వారం రోజుల్లోనే నీట్ ప‌రీక్ష పేప‌ర్ లీకైన‌ట్లు తేలింది. నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేసింది. దీంతో ఆకాంక్ష ఒక్క‌సారిగా షాక్‌కు గురైంది. నీట్ పేప‌ర్‌కు సంబంధించిన అక్రమాలు, పేపర్ లీక్ వార్తల తర్వాత ఆమె తీవ్ర డిప్రెషన్‌కు లోనైంది. ఈ క్ర‌మంలో మే20న త‌న గ‌దిలో ఉరివేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఆ త‌ర్వాత కొద్ది రోజుల‌కు ఆమె గ‌దిలో ఓ సూసైడ్ నోట్‌ను కుటుంబ స‌భ్యులు గుర్తించారు. తనకు మళ్లీ నీట్ పరీక్ష రాసేంత ధైర్యం లేదని ఆ యువ‌తి అందులో పేర్కొంది. అమ్మ‌, నాన్న‌.. మీ ఆకాంక్ష‌లు నెరవేర్చలేకపోతున్నందుకు న‌న్ను క్ష‌మించండి అంటూ లేఖ‌లో రాసింది.

650 కంటే ఎక్కువ మార్కులు వ‌స్తాయ‌ని చెప్పింది..

కాగా, నీట్ ప‌రీక్ష రాసిన త‌ర్వాత ఆకాంక్ష ఎంతో ఆత్మ‌విశ్వాసంతో ఇంటికి వ‌చ్చింద‌ని ఆమె బాబాయ్ జ‌గ‌దీష్ ప్ర‌సాద్ ఛ‌తుర్వేది తెలిపారు. ఎగ్జామ్ అయిపోయాక ఆమె చాలా సంతోషంగా క‌నిపించింద‌న్నారు. త‌న‌కు 650 కంటే ఎక్కువ మార్కులు వ‌స్తాయ‌ని త‌మ‌తో చెప్పింద‌న్నారు. అయితే, పేప‌ర్ లీక్ వార్త‌లతో ఆకాంక్ష షాక్‌కు గురైన‌ట్లు చెప్పారు. అన్నం కూడా తిన‌కుండా, ఎవ‌రితోనూ మాట్లాడ‌కుండా ఎప్పుడూ ఆందోళ‌నగా ఉండేద‌ని చెప్పుకొచ్చారు. అయితే, ఇంత‌టి క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని తాము అస్స‌లు ఊహించ‌లేద‌ని జ‌గ‌దీష్ క‌న్నీరుమున్నీరుగా విల‌పించారు. నీట్ పేప‌ర్ లీక్‌, అక్ర‌మాల ఆరోప‌ణ‌ల మ‌ధ్య త‌న క‌ష్టానికి, ప్ర‌తిభ‌కు విలువ లేకుండా పోతుందేమోన‌ని ఆకాంక్ష భ‌య‌ప‌డింద‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు.

విద్యా వ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేశారు.. రాహుల్ గాంధీ

ఆకాంక్ష ఆత్మ‌హత్య వ్య‌వ‌హారం మధ్యప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది. ప్ర‌తిప‌క్ష పార్టీలు కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఆకాంక్ష మృతిపై కాంగ్రెస్ అగ్ర‌నేత, లోక్‌స‌భ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది మోదీ హయాంలోని అవినీతి, విచ్ఛిన్నమైన వ్యవస్థ వల్ల జరిగిన ఘోరంగా అభివ‌ర్ణించారు.

ఆకాంక్ష డాక్టర్ అయ్యి దేశానికి, సమాజానికి సేవ చేయాలనుకుంది. ఆమె తండ్రి ఒక రైతు. తన కూతురిని డాక్టర్ చేయాలనే కలని నిజం చేసుకోవడం కోసం కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.3 లక్షలు అప్పు చేశారు. అంతేకాదు, కుమార్తె కోచింగ్ కోసం నాగ్‌పూర్ వెళ్లి.. అక్క‌డ వంట‌వాడిగా చేరారు. ఒక తండ్రి బిడ్డ కోసం చేయ‌గ‌లిగిన‌దంతా ఆయ‌న చేశారు. కానీ, నీట్ పేప‌ర్ లీకైంది. ఆ త‌ర్వాత ప‌రీక్ష ర‌ద్దైంది. తీవ్ర ఒత్తిడికి లోనైన‌ ఆకాంక్ష మనల్ని వ‌దిలి తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయింది. ఆకాంక్ష‌ది ఆత్మ‌హ‌త్య కాదు.. మోదీ హ‌యాంలో అవినీతి, విచ్ఛిన్న‌మైన వ్య‌వ‌స్థ వ‌ల్ల జ‌రిగిన హ‌త్య‌.

ఇంత జ‌రిగినా ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ గారు (కేంద్ర విద్యాశాఖ మంత్రి) ఇప్ప‌టికీ త‌న కుర్చీలోనే ఉన్నారు. అదే క‌మిటీ.. అవే బ‌దిలీలు.. అవే విచార‌ణ‌లు. ఎలాంటి సంస్క‌ర‌ణ‌లూ లేకపోగా.. న్యాయం కూడా జ‌ర‌గ‌లేదు. మోదీ గారూ.. అధికారం శాశ్వ‌తం కాదు. మీరు ఈ 12 ఏళ్ల‌లో విద్యా వ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేసేశారు. దానికి యువ‌త‌రం మూల్యం చెల్లించుకుంటోంది అంటూ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఆర్థిక సాయం..

మరోవైపు కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ నేతలు బాధిత‌ కుటుంబానికి రూ.2.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అంతేకాదు.. వారు తీసుకున్న కిసాన్ క్రెడిట్ లోన్ రూ.3 లక్షలకు సంబంధించి బాకీ చెల్లించడంలో సాయపడతామన్నారు. తాము ఆకాంక్ష కుటుంబానికి అండగా ఉంటామన్నారు.

Also Read..

పోల‌వ‌రం పూర్త‌యితే భ‌ద్రాచ‌లానికి నిత్యం జ‌ల‌గండ‌మే: హ‌రీశ్‌రావు

పేద‌ల‌కు ఇండ్లు క‌ట్టిస్తున్నందుకు రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహా?: కేటీఆర్‌కు మ‌ల్లు ర‌వి కౌంట‌ర్‌

పెట్రోల్ భారం ఇక తప్పుతుందా? 85% ఇథనాల్‌తో నడిచే తొలి కారు వచ్చేసింది!

Advertisement
Advertisement